తిరుమల వేంకటేశ్వర స్వామికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు ఉన్నారు. ఆయన దర్శనార్థం ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. అందుకే సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడూ స్వామివారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఒక్కోసారి ఆ కలియుగ దైవాన్ని దర్శించుకోవాలి అంటే 24 గంటలకు మించి సమయం పడుతూ ఉంటుంది. అయితే స్వామివారి దర్శనం, సేవలకు సంబంధించిన అన్ని రకాల టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే స్వామివారి భక్తులకు టీటీడీ ఒక శుభవార్తను చెప్పింది.
సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసింది. సుప్రభాత, తోమాల, అష్టదళ పాద పద్మారాధన, అర్చనకు సంబంధించిన టికెట్లను కూడా టీటీడీ విడుదల చేసింది. ఆర్జిత సేవా టికెట్ల కోసం భక్తులు జూన్ 19 ఉదయం 10 గంటల నుంచి జూన్ 21 ఉదయం 10 గంటల వరకు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు. అలా నమోదు చేసుకున్న భక్తుల నుంచి లక్కీ డిప్ విధానంలో ఎంపిక చేస్తారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా టీటీడీ కూడా తమ సేవలను సులభతరం చేస్తోంది. కరోనా తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం దర్శన, ప్రత్యేక సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్లో అందుబాటులో ఉంచుతున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు సెప్టెంబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవల్లో పాల్గొన దల్చిన భక్తుల కోసం నమోదుకు అవకాశం కల్పంచింది. ఇందులో నమోదు చేసుకున్న భక్తుల నుంచి లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి ఆర్జిత సేవా టికెట్లను అందజేస్తారు. అలాగే ఈనెల 22న స్వామివారి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవలకు సంబంధించి జూన్ 22న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ గా టికెట్లను విడుదల చేయనున్నారు. అంతేకాకుండా అంగప్రదక్షిణ చేయాలని కోరుకునే భక్తుల కోసం సెప్టెంబర్ నెలక సంబంధించిన కోటాను జూన్ 23 ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి నమోదుకు అవకాశం కల్పించడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.