Venkateswarlu
Venkateswarlu
సనాతన ధర్మం.. గత రెండు, మూడు రోజులుగా దీనిపై దేశ వ్యాప్తంగా ఓ పెద్ద చర్చ జరుగుతోంది. డీఎంకే పార్టీ నాయకుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన కామెంట్లతో సనాతన ధర్మం వార్తల్లో నిలిచింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయనిధి సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ.. ‘‘ సనాతన ధర్మం మలేరియా లాంటిది.. డెంగ్యూ లాంటిది.. కరోనా లాంటిది.. అది దేశంలో విపరీతంగా వ్యాపిస్తోంది. సనాతన ధర్మాన్ని శాశ్వతంగా నిర్మూలించాలి’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులు, హిందూ మత పెద్దలు ఉదయనిధిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు సనాతన ధర్మం గురించి పూర్తిగా తెలుసుకుని ఆ తర్వాత మాట్లాడమంటూ మండిపడుతున్నారు. ఇంతకీ సనాతన ధర్మం అంటే ఏమిటి? దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి?
సనాతన ధర్మం అంటే ఏమిటి?
సనాతన ధర్మం అనేది రెండు పదాల కలయిక. ఇవి సంస్కృతం నుంచి ఉద్భవించాయి. సనాతనం అంటే ‘‘ నిత్యమైనది’’.. ‘‘ ఏనాటికీ మారనిది’’ అని అర్థాలు ఉన్నాయి. ధర్మం అంటే.. జీవన విధానం అన్న అర్థం ఉంది. సనాతన ధర్మం అంటే.. ఎప్పటికీ మారని, నిత్యమైన జీవన విధానం. సనాతన ధర్మం వేదాలు ఎంత ప్రాచీనమైనవో.. అంత ప్రాచీనమైనది.. దేశకాల సరిహద్దులు లేని ధర్మం సనాతన ధర్మం. హిందుగా పుట్టిన వారు పాటించే ధర్మం సనాతన ధర్మం. సనాతన ధర్మం ఎప్పుడు ప్రారంభమైందో స్పష్టత లేదు. అయితే, వేదాల్లో ఎక్కడా కూడా సనాతన ధర్మం ప్రస్తావన లేదు. ద్వాపర యుగంలో.. మహా భారత యుద్ధం సమయంలో మొదటి సారి సనాతన ధర్మం ప్రస్తావన వచ్చింది. యుద్ధం సమయంలో అర్జునుడు సనాతన ధర్మం గురించి మాట్లాడాడు. ఆ తర్వాతి కాలంలో సనాతన ధర్మం చాలా పాపులర్ అయింది. సనాతనం ధర్మం ప్రాంతాలు, కాలాలను బట్టి మారదు. వందల ఏళ్లు అయినా.. ప్రపంచం ఈ మూలనుంచి ఆ మూల వరకు ఒకే విధంగా ఆచరణలో ఉంటుంది. ఆచరింపబడుతుంది.
సనాతన ధర్మం ఏమి చెబుతోంది?
సనాతన ధర్మం నాటినుంచి నేటి వరకు శాంతికి పెద్ద పీట వేస్తోంది. ఈ సనాతన ధర్మంలో మొత్తం ఎనిమిది భాగాలు ఉంటాయి. సనాతన ధర్మాన్ని ఆచరించే వారు. ఈ ఎనిమిది భాగాలను అనుసరించాల్సి ఉంటుంది. ఈ ఎనిమిది భాగాలకు సంబంధించి ఓ శ్లోకం ఉంది. ఆ శ్లోకంలోనే సనాతన ధర్మం మొత్తం ఇమిడి ఉంటుంది.
‘‘ఇద్యా అధ్యయన దానాని..
తపహ, సత్యం, ధృతిహి, క్షమ ..
అలోభ ఇతి మార్గోయం
ధర్మస్య అష్టవిధః స్మతహా..’’
ఇధ్య : ఇధ్య అంటే పూజించటం.. గౌరవంగా ఉండటం అన్న అర్థం ఉంది. ఇధ్యలో భాగంగా ప్రతీ ఒక్కరిని గౌరవించడం, దేవుడ్ని పూజించటం, ప్రకృతిని ఆరాధించటం చేయాలి. అహంకారం లేకుండా.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. సాటి మనుషుల్ని గౌరవించాలి.
అధ్యయన : అంటే ప్రతీరోజూ అధ్యయనం చేయాలి, పరిశీలించుకోవాలి. మనల్ని మనం అధ్యయనం చేసుకోవాలి. ఎంత వరకు మార్పు చెందామో చూసుకోవాలి. అలాగే ప్రకృతిని కూడా అధ్యయనం చేస్తూ.. దాన్నుంచి నేర్చుకోవాలి.
దానం : నేను అని కాకుండా మనం అని ఆలోచించాలి. ఇతరులకు సహాయపడాలి. దానం చేస్తూ ఉండాలి. లేని వాళ్లకు విద్యాదానం, అన్నదానం చేస్తూ ఉండాలి. నీకు ఎంత అవరసరమో అంతే నీ దగ్గర ఉంచుకుని మిగిలినది దానం చేయాలి. మనిషిగా సహానుభూతిని కలిగి ఉండాలి.
తపహ : ఈ శరీరంతో ఎవర్నీ బాధపెట్టవద్దు, ఈ శరీరంతో ఎలాంటి చెడ్డ పనులు చేయవద్దు, నీ మాటలతో ఎవర్నీ ఇబ్బంది పెట్టవద్దు, నీ మనసుతో కూడా ఎవర్నీ ద్వేషించకూడదు. ఎవర్నీ శత్రువుగా భావించవద్దు. మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి. తపస్సు అంటే మనసును ప్రశాంతగా ఉంచుకోవటం. త్రికరణ శుద్ధిగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
సత్య : ఎల్లప్పుడూ సత్యాన్నే పాటించాలి. నిజాలు మాట్లాడాలి. అబద్ధాలు చెప్పరాదు.
ధృతిహి : ధైర్యంగా ఉండటం. ఏదైనా ఆశయాన్ని పెట్టుకుంటే.. ఆ ఆశయం మీదే ఉండాలి. వేరే ఆలోచన పెట్టుకోరాదు. ధైర్యంగా ముందుకు వెళ్లాలి.
క్షమ : జాలి, దయ చూపిస్తుండాలి. సాటి మనుషులపై, జీవులపై జాలి, దయ కలిగి ఉండాలి.
హిందూ ధర్మం.. సనాతన ధర్మం ఒక్కటేనా?
హిందూ మత పెద్దలు చెబుతున్న దాని ప్రకారం.. హిందూ ధర్మం.. సనాతన ధర్మం వేరు వేరు కాదు. హైందవ ధర్మం, సనాతన ధర్మం కవల పిల్లల లాంటివి. అయితే, హైందవ ధర్మం కాలానుగుణంగా మార్పులను స్వీకరిస్తుంది. త్రేతాయుగంలో ఉన్న జీవన విధానాన్ని కలియుగంలో పాటించడానికి కుదరదు. కలియుగంలో ఎలా ఉండాలో అలానే ఉండాలి. యుగ ధర్మం బట్టి మారుతూ ఉండేది హైందవ ధర్మం. కానీ, ఈ ధర్మాలకు మూలం సనాతన ధర్మం. ఇది ఎప్పటికీ ఒకేలా ఉంటుంది.
సనాతన ధర్మం విస్తృతి చాలా పెద్దది. ఇక్కడ నాస్తికులకు, ఆస్తికులకు ఇద్దరికీ ఇక్కడ చోటుంది. దేవుడు ఉన్నాడని నమ్మినా.. లేడు అని అన్నా.. ఎలాంటి తప్పులేదు. సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతానికి పెద్ద పీట ఉంది. ముఖ్యంగా మంచి కర్మలకు ఈ ధర్మం ప్రాధాన్యత ఇస్తుంది. చార్వాక సిద్ధాంతానికి కూడా సనాతన ధర్మంలో చోటు ఉంది. సమాజానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎంజాయ్ చేయటానికి కూడా ఆస్కారం ఉంది. ఇక్కడ ఓ మతం తక్కువ.. మరో మతం ఎక్కువ అని చెప్పటం ఉద్ధేశ్యం కాదు.
తనకు ఇష్టం వచ్చిన మతాన్ని, ధర్మాన్ని పాటించే స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు మనిషికి ఎప్పుడూ ఉన్నాయి. ఇక్కడ మనిషి చేయాల్సిందల్లా తమ మతాన్ని ఆచరిస్తూ.. అభిమానిస్తూ.. ఇతర మతాలను గౌరవించటం. ఇలా చేస్తే ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు రావు. కానీ, ముఖ్యమంత్రి కుమారుడు, ఓ రాష్ట్రానికి మంత్రి అయిన ఉదయ నిధి స్టాలిన్ ఓ మతాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేయటం వల్లే అసలు సమస్య వచ్చింది. మరి, ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.