P Venkatesh
P Venkatesh
ఈ మధ్యకాలంలో యువతీ యువకులు చిన్న చిన్న విషయాలకే ఆందోళనకు గురవుతున్నారు. కుటుంబ సభ్యులతో చెప్పకుండా తమలో తామే కుంగిపోయి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. చదువులో వెనకబడినా, ఉద్యోగం రాకపోయిన, ప్రేమలో విఫలమైనా మానసికంగా బాధపడుతూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో అయిన వారిని తీవ్ర వేధనకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువతి తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్ కు గురిచేసింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఆమె ఇలా చేస్తదని ఎవరూ ఊహించలేదు. ఉద్యోగం వచ్చిన కొన్ని నెలల్లోనే రాజీనామా చేసి ఆత్మహత్యకు పాల్పాడింది. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు నెలల క్రితం పోస్టల్ శాఖ విడుదల చేసిన ఉద్యోగాల్లో బ్రాంచ్ పోస్ట్ ఉమెన్ గా ఉద్యోగం సాధించింది సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెంకు చెందిన నూనె ధనూజ. అయితే ఆమెకు సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలం మర్రిగడ్డలో పోస్టింగ్ వచ్చింది. పోస్టింగ్ వచ్చిన చోటే నివాసముండాలి అనే నిబంధన ఉండడంతో ధనూజ మర్రిగడ్డకు షిఫ్ట్ అయ్యింది. గత రెండు నెలలుగా మర్రిగడ్డలో అద్దె ఇంట్లో ఉంటూ ఉద్యోగానికి హాజరవుతోంది. అద్దె ఇంట్లో ఒంటరిగా ఉండడంతో ధనూజ మానసికంగా కుంగి పోయింది. ఇదే విషయాన్ని తన ప్రియుడైన రాకేష్ తో చెప్పింది. ఈక్రమంలో అతడు ధనూజను ఉద్యోగానికి రాజీనామా చేసి రావాలని కోరాడు. దీంతో ధనూజ గత నెల 31న పోస్టల్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం శుక్రవారం రోజు సామాన్లు తీసుకెళ్లేందుకు మర్రిగూడకు వచ్చింది.
అదే రోజు రాత్రి ప్రియుడితో ఫోన్ మాట్లాడుతూ తల తిప్పుతుందని చెప్పి ఫోన్ కట్ చేసింది. వెంటనే అప్పమత్తమైన ప్రియుడు స్థానికంగా తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి ధనూజ ఇంటికి వెళ్లి చూడమని కోరాడు. వెంటనే అక్కడికి వెళ్లిన ఆ వ్యక్తి ధనూజను పిలవగా స్పందించలేదు. ఆ తర్వాత తలుపులు తెరిచి చూడగా ఉరివేసుకుని కనిపించింది. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ధనూజ తల్లి తన కూతురు మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కంప్లైంట్ అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.