Tirupathi Rao
Bhavya- Vaishnavi Case: భువనగిరిలో ఇద్దరు పదో తరగతి విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆ కేసులో అసలు ఇప్పటివరకు ఏం జరిగిందంటే?
Bhavya- Vaishnavi Case: భువనగిరిలో ఇద్దరు పదో తరగతి విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆ కేసులో అసలు ఇప్పటివరకు ఏం జరిగిందంటే?
Tirupathi Rao
ఇద్దరు పదో తరగతి విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న కేసు పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిని మొదట అందరూ ఆత్మహత్యగా భావించారు. కానీ, పోస్టుమార్టానికి తరలించిన తర్వాత తమ పిల్లల ఒంటిపై గాయాలు ఉన్నాయంటూ కుటుంబసభ్యులు కొన్ని ఫొటోలను విడుదల చేశారు. ఆ సందర్భంగా పలు కీలక ఆరోపణలు కూడా చేశారు. వారిది అసలు ఆత్మహత్య కాదంటూ కుటుంబసభ్యులు వాదిస్తున్నారు. వారి పిల్లలను కావాలనే వేధింపులకు గురి చేశారంటూ చెబుతున్నారు. తల్లిదండ్రుల ఆరోపణలు, పిల్లల ఒంటిపై ఉన్న గాయాలతో ఈ కేసు మరో మలుపు తీసుకుంది. అసలు ఈ కేసులో ఇప్పటివరకు ఏం జరిగిందో పూర్తి వివరాలు..
భువనగిరిలోని ఎస్సీ బాలికల వసతిగృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. హాస్టల్ లో గదిలో యూనిఫామ్ చున్నీలతో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతి చెందిన విద్యార్థినులు వైష్ణవి(15), భవ్య(15) హైదరాబాద్ లోని హబ్సిగూడకు చెందినవాళ్లు. వీళ్లు భువనగిరిలోని బీచ్ మహల్లా ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. ఈ ఇద్దరు అమ్మాయిలు తమను వేధించారంటూ అదే హాస్టల్ లో ఉండే నలుగురు అమ్మాయిలు వార్డెన్ కు ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. ఆ విషయంలో వార్డెన్ వీళ్లకి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారని వార్తలు వచ్చాయి. భవ్య, వైష్ణవి హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఉన్నారు. వీళ్లు ఎంతకీ రాకపోవడంతో తోటి విద్యార్థులు కిటీలో నుంచి చూడగా అప్పటికే ఉరికి వేలాడుతూ కనిపించారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే విద్యార్థినులు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులకు విషయం చెప్తారనే భయంతోనే ఇలా బలవన్మరణానికి పాల్పడ్డారని అందరూ భావించారు. నిజానికి పోలీసులు కూడా మొదట ఈ కథను నమ్మినట్లుగానే అనిపించింది. కానీ, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపారు.
మొదట అందరూ ఈ అమ్మాయిలది ఆత్మహత్య అనే అనుకున్నారు. కానీ, ఎప్పుడైతే వారి ఒంటి మీద గాయలు కనిపించాయో అందరికీ అనుమానాలు ప్రారంభమయ్యాయి. విద్యార్థినుల ఒంటిపై ఉన్న గాయాలకు సంబంధించి తల్లిదండ్రులు ఫొటోలను విడుదలచేశారు. పిల్లల ఒంటిపై పళ్ల గాట్లు, వీపుపై వాతలు ఉన్నట్లు ఫొటోల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు కూడా అనుమానం బలపడింది. వీరిది ఆత్మహత్య కాదేమో అనే భావన కలిగింది. మరోవైపు తల్లిదండ్రులు వారి పిల్లలది ఆత్మహత్య కాదని వాదిస్తున్నారు. వార్డెన్ కు ఆటో డ్రైవర్ తో అక్రమసంబంధం ఉందని.. ఆ విషయం తెలిసిందని భవ్య, వైష్ణవిలను వేధింపులకు గురి చేశారంటూ ఆరోపిస్తున్నారు. పిల్లలను చిత్రహింసలకు గురిచేశారని చెబుతున్నారు. వారి పిల్లలది ఆత్మహత్య కాదని.. హత్యే అంటూ రోడ్డుపై నిరసన కూడా తెలిపారు.
హాస్టల్ గదిలో ఒక సూసైడ్ నోట్ ఉందని తోటి విద్యార్థులు పోలీసులకు అందజేశారు. ఆ సూసైడ్ నోట్ లో వారు భయంతో ఆత్మహత్య చేసుకున్నారు అనే విధంగా ఉంది. పైగా తాము చేయని తప్పుకి తమపై నిందలు వేస్తున్నారనే ఆత్మహత్య చేసుకుంటున్నాం అన్నట్లు చెప్పుకొచ్చారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. వార్డెన్ గురించి భవ్య, వైష్ణవి రాశారు అని చెబుతున్న కొన్ని విషయాలు పొంతనలేకుండా ఉన్నాయి. అసలు ఆ సూసైడ్ నోట్ లో ఏముందంటే.. “మేము వెళ్లిపోతున్నందుకు మమ్మల్ని అందరూ క్షమించండి. మేము చేయని తప్పుకు అందరూ మమ్మల్ని అంటుంటే మేము ఆ మాటలు తీసుకోలేకపోతున్నాం. మంమ్మల్ని మా శైలజ మేడం తప్ప ఎవరూ నమ్మలేదు. మా బాధ ఎవరికి చెప్పుకోలేక వెళ్లిపోతున్నాం. మా శైలజ మేడం నీ ఎవరూ అనడానికి లేదు. మా అమ్మవాళ్ల కంటే మమ్మల్ని ఎక్కువగా చూసుకున్నారు. సారీ మేడమ్.
మా ఆఖరి కోరిక.. మేము చనిపోయిన తర్వాత మా ఇద్దరినీ ఒకేచోట సమాధి చేయండి ప్లీజ్. కానీ, మా మేడం ని ఒక్కమాట కూడా అనకండి ప్లీజ్” అంటూ ఆ లెటర్ లో రాసుంది. పిల్లల కుటుంబసభ్యులు, బంధువులు అది నిజమైన లెటర్ కాదని వాదిస్తున్నారు. వార్డెన్ పైకి కేసు రాకూడదు అనే అలా కావాలని పొగుడుతూ రాశారు అంటూ ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు విచారణలో భాగంగా హాస్టల్ వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయులు, వంటచేసే సుజాత, సులోచన, పీఈటీ ప్రతిభ, ట్యూషన్ టీచర్ భువనేశ్వరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరు చెప్పే విషయాలు, వెలుగులోకి వచ్చే నిజాలు ఈ కేసులో కీలకంగా మారనున్నాయి. తల్లిదండ్రులు మాత్రం భవ్య, వైష్ణవీలది ఆత్మహత్య కాదని ఆరోపిస్తున్నారు. మరి.. భవ్య, శైలజ మృతిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.