iDreamPost

ఎంత పని చేశావు నాగమ్మా.. ఆ పిల్లలు ఏ పాపం ఎరుగరే..!

ఎంత పని చేశావు నాగమ్మా.. ఆ పిల్లలు ఏ పాపం ఎరుగరే..!

చిన్న చిన్న సమస్యలకే ప్రాణాలు తీసుకుంటున్న వారు ఈ సమాజంలో చాలా ఎక్కువయిపోయారు. అమ్మా నాన్నలు తిట్టారనో.. ప్రేయసి కాదందంనో.. భార్యాభర్తల గొడవలకో.. ఇలా ప్రతీ సమస్యకు చావునే పరిష్కారంగా భావిస్తున్నారు. తాజాగా, ఓ మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో చావును ఆశ్రయించింది. తనతో పాటు తన ఇద్దరు ఆడపిల్లల్ని కూడా తీసుకెళ్లిపోవాలని భావించింది. అయితే, ఓ కూతురు చనిపోగా.. మరో కూతురు ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక, చిక్కబళ్లాపుర తాలూకాలోని జడనహిళ్లికి చెందిన నాగమ్మకు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో పదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి గంగోత్రి, శ్రీనిధి అనే ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు. పెళ్లయి కొన్ని నెలలు వీరి కాపురం సాఫీగా సాగింది. తర్వాతి నుంచి గొడవలు జరగటం మొదలైంది. కుటుంబ విషయాల్లో ఇద్దరూ తరచుగా తగవులాడేవారు. ఏం చేసినా ఆ గొడవలు ఆగలేదు. దీంతో నాగమ్మకు విసుగు వచ్చింది. భర్త, కుటుంబంతో కలిసి ఉండటం కంటే చనిపోవటం మేలని భావించింది.

ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధం అయింది. తాను ఒక్కత్తే చనిపోతే పిల్లల పరిస్థితి దారుణంగా తయారవుతుందని భావించింది. వారిని కూడా తనతో తీసుకెళ్లాలని భావించింది. ఇంటికి దగ్గరలోని బావిలో ఇద్దరు పిల్లల్ని తోసి, తాను కూడా దూకింది. నాగమ్మ, చిన్న కూతురు నీటిలో మునిగి చనిపోయారు. పెద్ద కూతురు గంగోత్రి నీటిలో ఈదుతూ బయటకు వచ్చింది. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలిపింది. వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. నాగమ్మ, శ్రీనిధి మృతదేహాలను వెలికి తీశారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి