Venkateswarlu
Venkateswarlu
ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కిడ్నీలు అమ్మి మరీ ఐఫోన్ కొన్న వారు కూడా ఈ సమాజంలో ఉన్నారు. ఎంతో ఇష్టంతో వేలు ఖర్చు పెట్టి కొన్న ఐఫోన్‌కు ఏదైనా అవుతుంది అంటే.. ఎవరు తట్టుకుంటారు చెప్పండి. అందుకే ఓ యువతి ఐఫోన్ కోసం తన ప్రాణాలకు తెగించింది. దొంగలనుంచి ఫోన్‌ను రక్షించుకోవటానికి తీవ్ర యుద్దమే చేసింది. గాయాలపాలైంది. పాపం.. విధి ఆమెతో వింతనాటకం ఆడింది.. ఫోన్ ఆమెకు కాకుండా పోయింది. ఆ వివరాల్లోకి వెళితే..
న్యూఢిల్లీకి చెందిన యోవికా చౌదరి అనే యువతి స్కూలు టీచర్‌గా పని చేస్తోంది. గత శుక్రవారం ఆమె ఆటోలో స్కూలుకు వెళుతూ ఉంది. ఆ సమయంలో బైకుపై వచ్చిన ఓ ఇద్దరు వ్యక్తులు ఆమె ఫోన్‌ను లాక్కునే ప్రయత్నం చేశారు. ఆమె ఫోన్‌ను గట్టిగా పట్టుకోవటంతో.. ఆటోలోంచి కిందపడింది. వారు ఆ ఫోన్‌ను వదలక పోవటంతో ఫోన్‌తో సహా ఆమెను కూడా లాక్కెళ్లారు. దాదాపు కొన్ని మీటర్ల వరకు ఆమెను అలాగే లాక్కెళ్లారు. తర్వాత యోవికా పట్టు సడలింది.
ఫోన్‌ను ఆ దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై వెళుతున్న వాహనదారులు ఆమెను దగ్గరిలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇక, ఈ సంఘటనపై యోవికా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, యోవికా ఐఫోన్ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.