Dharani
స్నేహితుడని నమ్మి సాయం కోరినందుకు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అసలేం జరిగింది అంటే..
స్నేహితుడని నమ్మి సాయం కోరినందుకు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అసలేం జరిగింది అంటే..
Dharani
స్నేహితుడని నమ్మి తన సమస్య గురించి అతడికి చెప్పుకుంది. సాయం కోరింది. కానీ ఆ వ్యక్తి మాత్రం ఆమె గురించి దారుణంగా ఆలోచించాడు. తనను నమ్మిన అమాయకురాలిని అత్యంత పాశవికంగా హత్య చేశాడు. అది కూడా తన ప్రేయసితో కలిసి. అవును. మరి వాళ్లు ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారు.. ఎందుకు తనను నమ్మిన స్నేహితురాలి ప్రాణం తీశాడు.. అసలేం జరిగింది అంటే..
ఈ దారుణం ములుగు జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన తాటిపల్లి శశికాంత్, అదే జిల్లా మల్లంపల్లి మండలంలోని జంగాలపల్లికి చెందిన ఆకునూరి సుప్రియ(27) ఇద్దరూ ఇంటర్ క్లాస్మెట్స్. ఒకే కాలేజీలో చదువుకున్నారు. శశికాంత్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. అతడికి ఇంకా వివాహం కాలేదు.. కానీ నగరంలోనే ఉంటున్న ములుగు జిల్లాకు చెందిన అజ్మీరా శిరీష అనే వివాహితతో సహజీవనం చేస్తున్నాడు.
ఇక సుప్రియ విషయానికి వస్తే ఆమెకు 8 ఏళ్ల క్రితం అనగా 2016లో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన వెంగళ రాజ్ కిరణ్ తో వివాహమైంది. అతడు వరంగల్ నగరంలోని ఓ ఎలక్ట్రానిక్ షో రూంలో పని చేస్తున్నాడు. ఇక వారికి కుమార్తె, కుమారుడు సంతానం ఉన్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల కిందట సుప్రియ శశికాంత్ కు ఫోన్ చేసింది. తనకు ఆరోగ్య సమస్యలున్నాయని, హైదరాబాద్ లోని ఆసుపత్రుల గురించి వాకబు చేసింది. ఈ క్రమంలో గత నెల రోజులుగా తరచూ శశికాంత్ కు ఫోన్ చేస్తూ హాస్పిటల్స్ వివరాలు తెలుసుకుంటూ ఉంది.
తరచూ శశికాంత్, సుప్రియ ఫోన్ మాట్లాడుకుంటున్న విషయం శిరీషకు తెలిసిపోయింది. దాని గురించి ఆమె శశికాంత్ తో గొడవ కూడా పడింది. అలానే సుప్రియకు కాల్ చేసి వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే నెల రోజుల కిందట శశికాంత్, శిరీఫ ఇద్దరూ కలిసి హైదరాబాద్ నుంచి మైసంపల్లికి వచ్చారు. సుప్రియ ఇంటికి వెళ్లి ఇంకోసారి తమకు ఫోన్ చేయొద్దని, హెచ్చరించి వెళ్లారు. వారు ఇద్దరూ వచ్చిన సమయంలో సుప్రియ ఒంటరిగానే ఉండగా.. ఆమె ఒంటిపై బంగారం ఉండటాన్ని శశికాంత్, శిరీష గమనించారు.తమకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ఎలాగైనా సుప్రియ నగలను కాజేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే సుప్రియను హతమార్చాలని పథకం వేసుకున్నారు.
దీనిలో భాగంగా ముందుగా శశికాంత్, శిరీష ఇద్దరూ సుప్రియ ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించారు. ఆ తరువాత ఈ నెల 23న హైదరాబాద్ నుంచి మైసంపల్లికి మరోసారి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సుప్రియ ఇంటికి వచ్చి, ఆమెతో మాట్లాడారు. అప్పటికే ఆమె భర్త రాజ్ కిరణ్ ఉద్యోగం కోసం షాప్ కి వెళ్లాడు. శశికాంత్ తెలిసిన వ్యక్తే కావడంతో వారికి టీ పెట్టేందుకని సుప్రియ వంటగదిలోకి వెళ్లింది.
సుప్రియ వెంటనే లోపలికి వెళ్లిన శశికాంత్, శిరీష తమ ప్లాన్ అమలు చేశారు. దానిలో భాగంగా సుప్రియ మీద దాడి చేశారు. ఆమెను తీవ్రంగా కొట్టి కింద పడేశారు. ఆ తర్వాత శిరీష సుప్రియ కాళ్లను గట్టిగా పట్టుకోగా.. శశికాంత్ గొంతు నులిమి ఆమెను హత్య చేశాడు. ఆ తరువాత ఆమె ఒంటిపై ఉన్న బంగారు పుస్తెల తాడు, ఇంట్లో ఉన్న ఇతర బంగారు నగలతో బైక్ పై అక్కడి నుంచి పరారయ్యారు. హైదరాబాద్ వెళ్లి అక్కడ ఓ నగల దుకాణంలో పుస్తెలతాడు, ఇతర ఆభరణాలు కరిగించి.. కొత్త నగలు చేయించుకున్నారు.
సుప్రియ చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమె సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా క్ల్యూస్ లభించగా.. పూర్తి వివరాలు సేకరించారు. మాటు వేసి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. శశికాంత్, శిరీషలు నేరాన్ని అంగీకరించారు. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారి నుంచి నగలతో పాటు ఒక జత వెండి పట్టీలు, బైక్, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.