Tirupathi Rao
Tirupathi Rao
ప్రస్తుతం జరుగుతున్న హత్యలు, దారుణాలను గమనిస్తే ప్రధానంగా రెండే మోటివ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి డబ్బు, రెండు అక్రమ సంబంధాలు. గతంతో పోలిస్తే.. ఇప్పుడు అక్రమ సంబంధాలు, వాటి వల్ల జరుగుతున్న అఘాయిత్యాలు బాగా పెరిగిపోయాయి. పెళ్లి చేసుకున్న వారిని కాదని 5 నిమిషాల తుచ్యమైన చీకటి సుఖం కోసం చేయరాని తప్పులు చేస్తున్నారు. వారు చేసే ఆ పని వల్ల వచ్చే దుష్ఫలితాల గురించి ఆలోచించడం లేదు. అలా వాళ్లు చేస్తున్న పనుల వల్ల అన్యం పుణ్యం తెలియని పిల్లల జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి. అలాంటి ఒక ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో ఈ దారుణం జరిగింది. శివునిపల్లికి చెందిన తీగల కరుణాకర్(35) హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన నాగరాజు హమాలీగా పనిచేస్తున్నాడు. కరుణాకర, నాగరాజు పొలాలు పక్కపక్కనే ఉన్నాయి. అలా నాగరాజు భార్యకు కరుణాకర్ కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వారి మధ్య ఆమెదయోగ్యం కాని ఒక తప్పుడు బంధానికి తెర తీసింది. తర్వాత వాళ్లు ఫోన్లలో మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఎవరూ చూడకుండా వ్యక్తిగతంగా కలవడం కూడా చేస్తున్నారు. ఓరోజు నాగరాజు భార్యకు కరుణాకర్ ఫోన్ చేశాడు. ఆ ఫోన్ ని నాగరాజు లిఫ్ట్ చేశాడు. ఎత్తింతి ఎవరో తెలియకుండానే కరుణాకర్ మాట్లాడాడు. సాయంత్రం వస్తున్నాను అని.. కలుద్దాం అంటూ చెప్పుకొచ్చాడు.
ఆ విషయం తెలుసుకున్న నాగరాజు కోపంతో రగిలిపోయాడు. వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతనికి ఏమీ తెలియదు అన్నట్లుగానే ప్రవర్తించాడు. ఆ తర్వాత తన భార్య బయటకు వెళ్లగా ఆమెను అనుసరించాడు. కరుణాకర్ కూడా వాళ్ల పొలాల దగ్గర్లో ఉన్న మామిడి తోటలోకి వెళ్లాడు. నాగరాజు భార్య కూడా అక్కడికే వెళ్లింది. తర్వాత నాగరాజు కత్తి తీసుకుని కరుణాకర్ పై దాడికి దిగాడు. అతడిని అతి కిరాతకంగా హత్య చేసి సంచిలో కట్టి నమిలిగొండ చెరువులో పడేశాడు. ఈ ఘటన ఆగస్టు 25న జరిగింది. అప్పటి నుంచి కరుణాకర్ కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతూ ఉన్నారు.
కరుణాకర్ ఆచూకీ కోసం చుట్టుపక్కల గ్రామాలు తిరగడం, బంధువుల ఇళ్లకు ఫోన్ చేసి ఆరా తీయడం చేశారు. పోలీసులను కూడా కలిసి తమ కొడుకు కనిపించడం లేదని చెప్పారు. ఇదిలా ఉండగా మంగళవారం నాగరాజు నేరుగా స్టేషన్ కు వెళ్లి తాను హత్య చేసినట్లు చెప్పి లొంగిపోయాడు. మృతదేహం గురించి ఆరా తీసి చెరువు నుంచి కరుణాకర్ మృతదేహాన్ని వెలికి తీయించారు. విషయం తెలుసుకున్న కరుణాకర్ కుటుంబం బోరున విలపించింది. మృతిడి భార్య కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు, నాగరాజు ఒక్కడే హత్య చేశాడా? ఎవరైనా సహకరించారా? అసలు నిజంగా వివాహేతర సంబంధమే కారణమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.