P Krishna
P Krishna
దేశంలో ఎక్కడో అక్కడ ప్రతిరోజూ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరిగా ఉన్న మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ఆడవాళ్లు కనిపిస్తే చాలు మృగాళ్ళుగా మారిపోతున్నారు. అత్యాచారాలు, హత్యలతో భయబ్రాంతులను సృష్టిస్తున్నారు. ఒకదశలో మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మహిళా అసిస్టెంట్ కలెక్టర్ అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఒడిశాలోని రూర్కెలాలోని అదనపు కలెక్టర్ ఆఫీస్ లో అసిస్టెంట్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సస్మిత మింజ్ (35) అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ నెల 15న కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన సుస్మిత తిరిగి రాలేదు. ఈ క్రమంలోనే సస్మిత మింజ్ నగరంలోని ఒక హూటల్లో ఉన్నట్లు ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. ఆమె తల్లి, సోదరుడు సస్మితను కలిసేందుకు ప్రయత్నించినా నిరాకరించారు. గత కొన్నిరోజులుగా ఆఫీస్ లో తీవ్ర ఒత్తిడి ఉందని.. తనకు కొన్నిరోజులు ప్రశాంతత కావాలని అందుకోసం ఎవరినీ కలుసుకోలేనని అన్నట్లు వారు తెలిపారు.
ఈ క్రమంలోనే మంగళవారం పట్టణంలోని సెంచరీ పార్క్ ప్రాంగణంలోని జలాశయంలో ఓ మహిళ మృతదేహం తేలుతూ కనిపించడంతో సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. ఆ మృతదేహం అసిస్టెంట్ కలెక్టర్ సస్మితదిగా గుర్తించారు. ఆమె హ్యాండ్ బ్యాగ్, చెప్పులు లభించాయి. మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకొని ఇది హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఎప్పుడు సంతోషంగా ఉంటూ అందరితో కలుపుగోలుగా ఉండే తమ కూతురు ఇలా జలాశయంలో విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.