P Krishna
P Krishna
ఈ మద్య కాలంలో వివాహం జరిగిన ఏడాది గడవక ముందే భార్యాభర్తల మద్య విభేదాలు రావడంతో కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఇటీవల వివాహబంధానికి కొంతమంది తీరని మచ్చ తీసుకువస్తున్నారు. వివాహేతర సంబంధాల కారణంగా భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. నేరం రుజువు కావడంతో కటకటాల పాలవుతున్నారు. తల్లిదండ్రులు చేసిన తప్పుకు పిల్లలు శిక్ష అనుభవిస్తున్నారు.. ఎంతోమంది అనాథలుగా మిగిలిపోతున్నారు. ఓ భార్య తన అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన రాయచోటిలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
రాయచోటి పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాయచోటి డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కట్టుకన్న భర్తను దారుణంగా హతమార్చిన భార్య.. తన భర్త బాత్ రూమ్ లో పడి చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది.. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు నిజం బయట పెట్టిందని అన్నారు. సంబేపల్లి మండలానికి చెందిన అంజి అలియాస్ ఆంజనేయులు నాయుడు రాయచోటి పట్టణంలో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. వీరబల్లె మడల కేంద్రంలో వీఆర్ఓ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య నందిని, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. సాఫీగా సాగిపోతున్న వారి సంసారంలో అక్రమ సంబంధం నిప్పులు పోసింది. నందినికి గొర్లమోదివీడు కి చెందిన చిన్నప్పరెడ్డితో పరిచయం ఏర్పడి.. అక్రమ సంబంధానికి దారి తీసింది. నందిని-చెన్నప్పల అక్రమ సంబంధం వ్యవహారం ఆంజనేయులికి తెలియడంతో భార్యకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. నందినిపై గట్టి నిఘా పెట్టడం మొదలు పెట్టాడు. దీంతో తన అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని.. అతని అడ్డు తొలగించుకోవాలని తన ప్రియుడు చెన్నప్పతో చెప్పింది నందిని.
ఈ నెల 9వ తేదీన భర్తకు మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి పెట్టింది. భోజనం చేసిన తర్వాత ఆంజనేయులు గాఢ నిద్రలోకి వెళ్లాడు. చిన్నప్పరెడ్డి తన స్నేహితుడు సురేంద్రరెడ్డితో కలిసి బెడ్ రూమ్ లో ఆంజనేయులు ముఖంపై దిండు అదిమిపెట్టి చంపే ప్రయత్నం చేశారు. అంతలోనే అంజి లేచి గట్టిగా కేకలు వేయడంతో ముగ్గురు కలిసి అతని ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపారు. చిన్నప్పరెడ్డి అతని స్నేహితుడు చేతులకు గ్లౌజులు ధరించాడు. తన భర్త బాత్ రూమ్ లో కాలుజారి పడిపోయి చనిపోయాడని నందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే ఆమె వ్యవహారం గురించి విచారణ చేసిన పోలీసులు నందిని తమ స్టైల్లో ప్రశ్నించడంతో నిజం ఒప్పుకుంది. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని.. అతన్ని అడ్డు తొలగించుకునేందుకు ముగ్గురం కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. కేసు నమోదు చేసుకొని కోర్టులో హాజరు పరిచారు పోలీసులు.