P Krishna
P Krishna
వేద మంత్రాల సాక్షిగా.. మూడు ముళ్ళ బంధంతో ఒక్కటవుతున్న జంట ఏడాది కాలంలోనే చిన్న చిన్న విభేదాలతో కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. వివాహం తర్వాత భార్య లేదా భర్త పరాయి వ్యక్తులతో వివాహేతర సంబంధం కొనసాగించడం.. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని ఒకరినొకరు హత్యలు చేసుకునే స్థాయికి వెళ్తున్నారు. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని అమాయకురాలైన బాలికను దారుణంగా హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే..
తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం కొండయ్య పేటకు చెందిన ద్రోణ వీర్రాజు, జ్యోతిలకు కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. కొత్తలో వీరి కాపురం సజావుగా సాగింది. ఈ దంపతులకు మానస అనే కుమార్తె ఉంది. కొంతకాలం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. తన కూతురు మానసను తీసుకొని జ్యోతి పుట్టింటికి వెళ్లిపోయింది. ఎన్‌టీఆర్ కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని తన తల్లి సునిత, కూతురు మానసతో కలిసి జీవిస్తుంది జ్యోతి. ఈ క్రమంలోనే బత్తిని నాని అనే యువకుడితో జ్యోతికి సాన్నిహిత్యం ఏర్పడింది. అది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. జ్యోతికి నాని వరసకు మేనళ్ళుడవుతాడు.
తన కూతురు పెద్దది అవుతుందని.. అక్రమ సంబంధం గురించి తెలిస్తే పరువు పోతుందని భావించిన జ్యోతి కొంతకాలంగా నాని ని దూరంగా ఉంచుతూ వస్తుంది. ఇది తట్టుకోలేని నాని తమ అక్రమ సంబంధానికి మానస అడ్డు వస్తుందని భావించి ఆమె అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశాడు. ఈ నెల 19న మానసకు మాయమాటలు చెప్పి బైక్ ఎక్కించుకొని స్థానిక కట్టమూరు పుంత రోడ్డు పక్కన ఉన్న నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకు వెళ్లి హతమార్చాడు. తన కూతురు కనిపించడం లేదని తల్లి జ్యోతి ఈ నెల 20న పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితుడు నానిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా అతడు పరారీలో ఉన్నాడు.
బాలిక ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కట్టమూరు పుంతలో మృతదేహం కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. అప్పటికే బాలిక మృతదేహం పాడైపోయింది. దుస్తుల ఆధారంగా ఆ మృతదేహం మానసదే అని గుర్తించారు. పోస్టుమార్టం తర్వాత తల్లికి అప్పగించారు. మానస హత్యకు కారకుడైన నాని ఫోటోను పోలీసులు రిలీజ్ చేశారు.. పట్టి ఇచ్చిన వారికి పదివేల రూపాయల నజరానా కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.