Venkateswarlu
Venkateswarlu
బంగ్లా అమ్మడానికి భార్య ఒప్పుకోవటం లేదని ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. సుప్రీం కోర్టు లాయర్‌గా పని చేస్తున్న ఆమెను హత్య చేశాడు. హత్య అనంతరం భార్య శవాన్ని బంగ్లాలోని స్టోర్ రూములో దాచాడు. భార్యను హత్య చేసిన ఆ వ్యక్తి కూడా మాజీ ఐఆర్‌ఎస్ అధికారి కావటం గమనార్హం. ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన అజయ్ నాథ్, రేణు సిన్హా భార్యా, భర్తలు. 62 ఏళ్ల అజయ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. రేణు సిన్హా సుప్రీం కోర్టులో లాయర్‌గా పని చేస్తున్నారు.
ఈ దంపతులకు స్థానికంగా ఓ బంగ్లా ఉంది. దాన్ని అమ్ముదామని అజయ్ భావించాడు. నాలుగు కోట్ల రూపాయలకు అమ్మకానికి కూడా పెట్టాడు. ఓ వ్యక్తి ఆ బంగ్లాను కొనడానికి సిద్ధమై అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బంగ్లా అమ్మడానికి రేణు సుముఖత వ్యక్తం చేయలేదు. బంగ్లా అమ్మటం వద్దని తేల్చి చెప్పింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. ఆదివారం బంగ్లా విషయంలో భార్యాభర్తలు గొడవపడ్డారు. గొడవ తారాస్థాయికి చేరింది. క్షణికావేశంలో అజయ్ భార్యను పదునైన ఆయుధంతో బలంగా కొట్టాడు. గాయం కారణంగా తీవ్ర రక్త స్రావమై రేణు చనిపోయింది. భార్య చనిపోయిందని నిర్థారించుకున్న అజయ్..
ఆమె శవాన్ని బంగ్లాలోని స్టోర్ రూములో పడేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సాయంత్రం ఇంటికి రావాల్సిన రేణు రాకపోవటంతో.. సోదరుడు ఆమెకు ఫోన్ చేశాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఆమెనుంచి స్పందన రాలేదు. దీంతో పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బంగ్లాలో శోధించగా.. రేణు మృతదేహం లభ్యమైంది. పోలీసులకు అజయ్ మీద అనుమానం వచ్చింది. పరారీలో ఉన్న అతడికోసం అన్వేషణ ప్రారంభించారు. సోమవారం అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించగా అసలు విషయం బయటపడింది.