iDreamPost
android-app
ios-app

రాంగ్‌రూట్‌లో దూసుకొచ్చి.. ఎస్‌యూవీని ఢీకొట్టిన స్కూల్‌ బస్‌.. ఆరుగురు మృతి!

  • Published Jul 11, 2023 | 1:53 PM Updated Updated Jul 11, 2023 | 1:53 PM
  • Published Jul 11, 2023 | 1:53 PMUpdated Jul 11, 2023 | 1:53 PM
రాంగ్‌రూట్‌లో దూసుకొచ్చి.. ఎస్‌యూవీని ఢీకొట్టిన స్కూల్‌ బస్‌.. ఆరుగురు మృతి!

నిత్యం రోడ్డు మీద ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిలో అతివేగం, తాగి నడపడం వల్ల జరిగే ప్రమాదాలే ఎక్కువ. కొన్ని సార్లు ఆలస్యం అవుతుందనే కంగారులో.. రాంగ్‌రూట్‌లో వెళ్లడం వల్ల కూడా భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అయితే స్కూల్‌ వ్యాన్‌లు, పోలీసు వాహనాలు, అంబులెన్స్‌లు, ప్రభుత్వ వాహనాలు ఇలా రాంగ్‌ రూట్‌లో వెళ్లడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. మిగతా వాళ్లతో పోల్చుకుంటే.. వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పైన చెప్పిన వాహన శ్రేణిలో ఏ ఒక్కరైనా సరే.. కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించిన పదుల కుటుంబాల్లో విషాదం అలుముకుంటుంది. ఈ విషయం తెలిసి కూడా కొన్నిసార్లు వీరు అజాగ్రత్తగా వ్యవహరిస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. స్కూల్‌ బస్‌ రాంగ్‌ రూట్‌లో వచ్చి.. ఎస్‌యూవీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఆ వివరాలు..

ఘజియాబాద్‌, ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం ఉదయం ఈ దారుణం చోటు చేసుకుంది. ఘజియాబాద్ వద్ద ఓ స్కూల్ బస్సు రాంగ్‌ రూట్‌లో వచ్చి.. ఎస్‌వీయూ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ- మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై రాంగ్ రూట్‌లో వచ్చిన స్కూల్ బస్సు.. ఎదురుగా వస్తోన్న ఎస్‌యూవీని ఢీకొట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. బాధితులంతా గురుగ్రామ్‌ నుంచి ఎస్‌యూవీలో వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని.. ఆ సమయంలో కారులో ఎనిమిది మంది ఉండగా.. ఆరుగురు మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదంలో చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉండటం విషాదకరం.

రాంగ్‌ రూట్‌లో వచ్చిన స్కూల్‌ బస్‌.. యస్‌యూవీని బలంగా ఢీకొట్టడంతో అది నుజునుజ్జు అయ్యింది. దాంతో లోపల ఉన్న వారిని బయటకు తీయడానికి పోలీసులు చాలా శ్రమ పడ్డారు. చివరకు కట్టర్ సాయంతో డోర్లను కట్‌ చేసి.. తొలగించి వారిని బయటకు తీయాల్సి వచ్చింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడినవారిని బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదానికి కారణమైన స్కూల్ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు ఘజియాబాద్ డీసీపీ దహత్ శుభమ్ పటేల్ తెలిపారు.