Krishna Kowshik
Krishna Kowshik
దేశం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా.. లంచగొండితనం రూపుమాపడం లేదు. చిన్న పనికి కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకోవాలంటే చేతులు తడపాల్సిందే. లేదంటే కొన్ని సంవత్సరాల పాటు కాళ్లు అరిగేలా తిప్పించుకుంటుంటారు. రేపు రా, మాపు రా పని అయిపోతుందని చెబుతారు తప్ప.. పని చేసి పెట్టరు. వృద్ధులు, వికలాంగులు కూడా ఇదే సమస్యలను ఎదుర్కొంటున్నారు. చేతిలో డబ్బులు పడ్డాయా.. ఇక గంటలో మనం అనుకున్న పని జరిగిపోతుంది. ప్రభుత్వం దృష్టికి వెళితే.. నిఘా వేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే తప్ప.. వారి అసలు స్వరూపం బయటకు రాదు. న్యాయ వ్యవస్థలో కీలక పాత్ర పోషించే పోలీసులదీ కూడా ఇదే తీరు.
తాజాగా ఓ పోలీసు ఉన్నతాధికారి లంచం తీసుకుంటూ దొరికిపోయారు. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ సీఐ నరేందర్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఓ సమస్య పరిష్కారం కోసం బాధితుడి నుండి రూ. 3 లక్షలు ముడుపులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆయన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు అధికారులు. ప్రస్తుతం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌తో పాటు ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత కొంత కాలంగా నరేందర్ పై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పబ్స్, స్పాల్లో అక్రమంగా వసూళ్లు చేసినట్లు విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే అతడిపై నిఘా ఉంచి.. పట్టుకున్నారు. ప్రస్తుతం నరేందర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు.