iDreamPost
android-app
ios-app

మణిపూర్‌ వీడియో ఘటనపై CM ఆగ్రహం.. వారిని ఉరి తీసే ఆలోచనలో ఉన్నాం!

  • Published Jul 20, 2023 | 2:10 PM Updated Updated Jul 20, 2023 | 2:10 PM
  • Published Jul 20, 2023 | 2:10 PMUpdated Jul 20, 2023 | 2:10 PM
మణిపూర్‌ వీడియో ఘటనపై CM ఆగ్రహం.. వారిని ఉరి తీసే ఆలోచనలో ఉన్నాం!

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింసాత్మక వాతావరణం నెలకొంది. రెండు నెలల క్రితం అనగా.. మే 3న మణిపూర్‌లో ఒక్కసారిగా హింస చెలరేగింది. రెండు వర్గాల మధ్య మొదలైన వివాదం కారణంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ హింసాకాండలో ఇప్పటి వరకు 140 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అయితే మణిపూర్‌లో ఇప్పటి వరకు జరిగిన హింస ఒక ఎత్తయితే.. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో సృష‍్టించిన గందరగోళం అంతా ఇంతా కాదు. ఈ అంశం యావత్‌ దేశాన్ని కుదిపేస్తోంది.

రెండు నెలల క్రింత కొందరు దుండగులు ఇద్దరు మహిళల మీద దాడి చేసి.. వారిని నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసిన వీడియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ అమానుష చర్యపై జనాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. దీనిపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే అని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. నా గుండె రగిలిపోతుంది.. ఎవరినీ వదిలిపెట్టం అన్నారు. ఇక తాజాగా ఈ ఘటనపై మణిపూర్‌ సీఎం స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ ఘటనపై మణిపూర్‌ సీఎం బైరెన్‌ సింగ్‌ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే నిందితుడిని అరెస్ట్‌ చేశామని.. త్వరలోనే మిగతా వారిని అరెస్ట్‌ చేస్తామని.. అంతేకాక నిందితులకు ఉరిశిక్ష వేసే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా బైరెన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇద్దరు మహిళల మీద దాడి చేసి వారిని నగ్నంగా ఉరేగించిన వీడియో చూసి నా గుండె మండిపోయింది. ఇది చాలా అమానుషం, దారుణ చర్య. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించాము. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ చేప్టటారు. ప్రస్తుతానికి ఒకరిని అరెస్ట్‌ చేశాం. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాక ఉరిశిక్ష వేసే ఆలోచనలో ఉన్నాం. ఇలాంటి అమానవీయ ఘటనలకు మన సమాజంలో తావు లేదు’’అని ట్వీట్‌ చేశారు.

తాజాగా, ఈ ఘటనను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. సుమోటాగా స్వీకరించింది. ఈ దారుణ ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందని, ఇటువంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ దుర్ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే.. తామే తీసుకుంటామని హెచ్చరించింది. ఈ అమానవీయ ఘటనకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవడమే కాక, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరంగా జులై 28లోగా నివేదిక అందజేయాలని కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఆదేశించింది.