iDreamPost
android-app
ios-app

న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలులో కాల్పులు..

న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలులో కాల్పులు..

న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలులో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ప్యాసింజర్, ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) మధ్య వాగ్వాదం ఈ దారుణానికి దారి తీసింది. ఈ ఘటన 12313 యుపి సీల్డా-న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్‌లో జరిగింది. ఈ కాల్పుల ఘటనతో రైల్వే యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అయితే ఈ కాల్పుల్లో ఎవరికీ, ఎటువంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి  చేరుకున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఆర్మీ మాజీ ఉద్యోగి 41 ఏళ్ల హర్విందర్ సింగ్‌గా గుర్తించారు. గురువారం రాత్రి 9.45 గంటల సమయంలో రైలు ధన్ బాద్, గోమో స్టేషన్ మధ్య రైలు ఉన్నప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. బి-7 కోచ్‌లో కాల్పులు చోటుచేసుకున్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

పంజాబ్ లోని గురుదాస్ పూర్ నివాసి అయిన హర్విందర్ సింగ్ ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి. ధన్ బాద్‌లోని ఓ కొలిరీలో ప్రైవేట్ సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. శనివారం టికెట్ తీసుకుని రైలు ఎక్కిన ఆయన.. మాతారి స్టేషన్ సమీపంలోకి ట్రైన్ రాగానే.. టికెట్లు పరిశీలిస్తున్న టీటీఈ టికెట్ చూపించాలని కోరాడు. అతడి టికెట్ చూడగా.. ఇది వేరే ట్రైన్ టికెట్ అని చెప్పాడు. హౌరా- న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ ఎక్కాలని, టికెట్ తీసుకున్నానని, కానీ పొరపాటున సీల్దా-న్యూఢిల్లీ రాజధాని రైలు ఎక్కేశానని చెప్పడంతో పాటు టీటీఈతో వాగ్వాదానికి దిగాడు. ఈ వివాదంలో తన వద్ద ఉన్న రివాల్వర్ తీసి ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కోడెర్మా వద్దకు రైలు రాగానే హర్విందర్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతడు మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.