iDreamPost
android-app
ios-app

అందం, అరాచకం కలిస్తే ఆ లేడీ డాన్‌.. 35 ఏళ్లకే మూడు లవ్‌ స్టోరీస్‌!

అందం, అరాచకం కలిస్తే ఆ లేడీ డాన్‌.. 35 ఏళ్లకే మూడు లవ్‌ స్టోరీస్‌!

ఆడవాళ్ల విషయంలో అందం ఉన్న చోట తెలివి తేటలు ఉండవని అంటూ ఉంటారు. కానీ, అందం, తెలివితేటలు కలిస్తే.. ఆ రెండూ నేరాలకు బాట వేస్తే.. అలాంటి వాళ్లు కచ్చితంగా నేర సామ్రాజ్యంలో తిరుగులేని రారాణులు అవుతారు. మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీలో కూడా.. లేడీ గ్యాంగ్‌ స్టర్‌ అనురాధ అందం, తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి నేర సామ్రాజ్యంలో అంచెలంచెలుగా ఎదిగింది. ఉత్తర భారత దేశంలో మోస్ట్‌ వాంటెడ్‌ లేడీ డాన్‌గా మారింది. చివరకు పోలీసులకు చిక్కు జైలు పాలైంది. ఆమె జీవితంలో నేరాలు ఓ భాగమైతే.. ప్రేమలు మరో భాగం. అనురాధ 35 ఏళ్ల వయసులో ముగ్గుర్ని లవ్‌ చేసింది. ఇద్దర్ని పెళ్లి చేసుకుంది.

కాలేజ్‌ టైంలో మొదటి ప్రేమ

అనురాధ రాజస్తాన్‌లోని సిఖర్‌ ఫతేహ్‌ జిల్లాలో 1985లో జన్మించింది. ఆమె చిన్నతనంలోనే తల్లి చనిపోవటంతో తండ్రే అన్నీ అయి పెంచాడు. ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు. అనురాధ కాలేజీలో చదివే సమయంలో ఫీలిక్స్‌ మింజ్‌ అనే వ్యక్తిని ప్రేమించింది. వీరి పెళ్లికి తండ్రి ఒప్పుకోలేదు. దీంతో అనురాధ ఇంటినుంచి బయటకు వచ్చేసింది. ఫీనిక్స్‌ను పెళ్లి చేసుకుంది. తర్వాత భర్తతో కలిసి షేర్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ బిజినెస్‌ను మొదలుపెట్టింది. ఈ బిజినెస్‌ ఎంతో అద్భుతంగా సాగేది. డబ్బులు కూడా బాగా వచ్చేవి. అయితే, కొంతమంది వీరి పేరును వాడుకుని మోసాలకు పాల్పడ్డారు. దీంతో ట్రేడింగ్‌ బిజినెస్‌లో భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి. ఆమె దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు పట్టించుకోలేదు.

పీకల మీదకు అప్పుల బాధ.. అనంద్‌ పాల్‌తో పరిచయం..

అప్పులు మొత్తం అనురాధ పీకల మీదకు వచ్చాయి. ఆమె అప్పులు మొత్తం తీర్చలేని స్థితిలో నిత్యం నరకం అనుభవించసాగింది. ఇలాంటి సమయంలో ఆమె ఆనంద్‌ పాల్‌ను కలిసింది. తర్వాతినుంచి ఆనంద్‌ పాల్‌ అడ్డాలో భాగస్వామి అయింది. గ్యాంగ్‌ మెంబర్‌గా మారి నేరాలకు పాల్పడుతూ వచ్చింది. గ్యాంగ్‌లో చేరిన తర్వాత భర్తకు దూరమయింది. ఆనంద్‌ పాల్‌తో ఆమె స్నేహం బలపడింది. అనురాధ పరిచయం అయిన తర్వాత ఆనంద్‌లో చాలా మార్పులు వచ్చాయి. వేష, భాషల్లో కూడా మార్పులు వచ్చాయి. ఆమె అతడికి సూట్లు, బూట్లు అలవాటు చేసింది. వీటితో పాటు ఇంగ్లీష్‌ కూడా నేర్పించింది. తనకు ఇంత చేస్తున్న అనురాధకు.. ఆనంద్‌ పాల్‌ తుపాకులు ఎలా వాడాలో నేర్పించేవాడు. ఏకే 47 వాడకం కూడా నేర్పించాడు. వీరిద్దరూ ఓ తొమ్మిది నెలల పాటు సహజీవనం చేశారు. 2016లో అనురాధ జైలు పాలు కాగా.. 2017లో ఆనంద్‌ పాల్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు.

కాలా జతేడీతో పరిచయం.. ప్రేమ.. పెళ్లి..

2017లో ఆనంద్‌ పాల్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన తర్వాత అనురాధ ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిపోయింది. అక్కడ కాలా జతేడీ అనే గ్యాంగ్‌స్టర్‌ను కలిసింది. అతడి గ్యాంగ్‌లో చేరి, ఆనతి కాలంలోనే అతడికి దగ్గరైంది. అనురాధ చురుకుదనం, అందానికి కాలా దాసోహుడయ్యాడు. ఇద్దరి మధ్యా కొంతకాలనే చనువు ఏర్పడింది. ఆ చనువు కాస్తా ప్రేమగా మారింది. కొంత కాలం ప్రేమించుకున్న వీరు తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. అనురాధ తన భర్త కాలాతో కలిసి ఎన్నో నేరాలకు పాల్పడింది. పలు సార్లు జైలుకు కూడా పోయి వచ్చింది. 2022 మే నెలలో జరిగిన సిద్దు మూసే వాలా హత్య కేసులో కూడా అనురాధ హస్తం ఉన్నట్లు తేలింది.