iDreamPost
android-app
ios-app

పెళ్లై సంవత్సరం.. భార్య వేధింపులు తాళలేక..

పెళ్లై సంవత్సరం.. భార్య వేధింపులు తాళలేక..

సాధారణంగా అత్తింటి వేధింపులు తాళలేక అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. పిల్లల విషయంలోనో.. కట్నం విషయంలోనో.. ఇలా ఏదో ఒక విషయంలో గొడవ పడుతూ కోడల్ని వేధించే వారే ఈ సమాజంలో ఎక్కువగా ఉంటారన్నది టాక్‌. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం అత్తింటి వారి వేధింపులు భరించలేక అబ్బాయి చనిపోయిన ఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. తాజా ఘటనలో ఓ యువకుడు భార్యా, అత్తామామల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

హాసన్‌ జిల్లాలోని చిన్నరాయపట్టణంలోని ఉదయపుర గ్రామానికి చెందిన కిరణ్‌ బేకరీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి అదే ప్రాంతంలోని వగరహళ్లి గ్రామానికి చెందిన స్పందన అనే యువతితో కొద్దిరోజుల క్రితం పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ గత సంవత్సరం ఫిబ్రవరి 19న పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. అయితే, పెళ్లయిన కొద్దిరోజులు వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాతినుంచి గొడవలు రావటం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే కిరణ్‌ భార్యకు దూరంగా ఉంటున్నాడు. కొద్దిరోజుల క్రితం స్పందన.. కిరణ్‌పై అదనపు కట్నం వేధింపుల కేసు పెట్టింది.

పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు. కొన్ని రోజులు జైల్లో ఉన్న అతడు జామీను మీద బయటకు వచ్చాడు. చేయని తప్పు కారణంగా తనను జైలు పాలు చేశారంటూ కిరణ్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. జులై 31న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కిరణ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కిరణ్‌ భార్య, అత్తామామలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.