Dharani
Dharani
హరియాణా నూహ్ జిల్లాల్లో రెండు వర్గాల మధ్య చెలరేగిన హింసతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం రాత్రి జరిగిన ఘర్షణాల కారణంగా మొత్తం ఇప్పటి వరకు సుమారు ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు హరియాణా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే హరియాణ ప్రభుత్వం గురుగ్రామ్, నూహ్‌లలో 144 సెక్షన్ విధించింది. పరిస్థితిని అదుపు చేసేందుకు మరిన్ని బలగాలను పంపాలని కేంద్రాన్ని కోరింది. ఈ క్రమంలో అల్లరి మూక జడ్జీ కారుకు నిప్పంటించి ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించారు. దుండగులు దాడి చేసినప్పడు కారులో జడ్జీతో పాటు ఆమె కుమార్తె కూడా ఉన్నారు. అయితే తృ టిలో వారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆ వివరాలు..
నూహ్‌లో చెలరేగిన అల్లర్లలో అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, ఆమె మూడేళ్ల కుమార్తె ఇద్దరు క్షణాల వ్యవధిలో మూకదాడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. సోమవారం వారు ప్రయాణిస్తున్న వాహనంపై.. నూహ్ పాత బస్టాండ్ సమీపంలో అల్లరి మూక కారుపై దాడి చేసింది. అనంతరం దానికి నిప్పంటించింది. విషయం గమనించిన వెంటనే అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అంజలి జైన్.. ఆమె కుమార్తె, కొంత మంది సిబ్బంది అల్లరి మూక నిప్పంటించిన కారు నుంచి దిగిపోయి… పక్కనే ఉన్న వర్క్ షాపులో దూరి ప్రాణాలు కాపాడుకున్నారు. అక్కడ నుంచి కొందరు న్యాయవాదులు వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
అంజలి జైన్ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తన మూడేళ్ల కుమార్తె, గన్‌మెన్‌తో కలిసి మందులు కొనుగోలు చేయడానికి నల్హార్‌లోని ఎస్‌కేఎం మెడికల్ కాలేజీకి వెళ్లారు. అ తర్వాత అక్కడ నుంచి తిరిగి వస్తుండగా.. పాత బస్టాండ్ సమీపంలోని ఢిల్లీ-అల్వార్ రోడ్డులో వారి కారుపై 100 నుంచి 150 మంది అల్లరి మూక దాడి చేసినట్లు అంజలి జైన్ వెల్లడించింది. అల్లరి మూక రాళ్లు రువ్వడంతో.. కారు వెనక గ్లాస్ పగిలిందని.. ఇక తాము ప్రాణ భయంతో కారును రోడ్డు మీదే వదిలేసి.. అక్కడకి సమీపంలో ఉన్న వర్క్‌షాప్‌లో దాక్కున్నాం అని తెలిపారు. ఆ తర్వాత కొందరు న్యాయవాదులు వచ్చి.. తమని రక్షించారని గుర్తు చేసుకున్నారు అంజలి జైన్. ఇక తాము మరుసటి రోజు కార్‌ని చూడటానికి వెళ్లినప్పుడు దాన్ని తగలబెట్టారని తెలిసింది అన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.
హరియాణ, నుహ్ జిల్లాలో సోమవారం విశ్వహిందూ పరిషత్ చేపట్టిన బ్రిజ్ మండల్ జలాభిషేక యాత్రలో మొదలైన హింస.. ఆ తర్వాత మత ఘర్షణలకు దారి తీసింది. మత ఘర్షణలకు కారణమైనవారిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు సుమారు 116 మందిని అరెస్ట్ చేసినట్లు హరియాణా పోలీసులు వెల్లడించారు. ఈ అల్లర్ల నేపథ్యంలో పక్కనే ఉన్న దేశ రాజధాని ఢిల్లీ పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు.