Tirupathi Rao
పుష్ప సినిమాలో కేశవ పాత్రకు ఎంతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత జగదీశ్ కు మంచి అవకాశాలు కూడా వచ్చాయి. కానీ, బుద్ధి మాత్రం పెడదోవ పట్టింది.
పుష్ప సినిమాలో కేశవ పాత్రకు ఎంతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత జగదీశ్ కు మంచి అవకాశాలు కూడా వచ్చాయి. కానీ, బుద్ధి మాత్రం పెడదోవ పట్టింది.
Tirupathi Rao
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పుష్ప- 2పై నెలకొన్న ఆసక్తి అంతా ఇంతా కాదు. సినిమా లవర్స్ అంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో పుష్పరాజ్ పాత్ర తర్వాత బాగా హైలెట్ అయ్యింది కేశవ పాత్రే. ఆ క్యారెక్టర్ అంతగా హైలెట్ కావడంతో నటుడు జగదీశ్ కు మంచి పేరు కూడా వచ్చింది. సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. అయితే ఇప్పుడు జగదీశ్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. అతనిపై పోలీసులు కేసు నమోదు చేయడమే కాకుండా.. రిమాండుకు కూడా తరలించారు. ఓ మహిళ ఆత్మహత్య కేసులో జగదీశ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. దీంతో.. ప్రస్తుతం కేశవ అలియాస్ జగదీశ్ అరెస్టు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇప్పుడిప్పుడే నటుడిగా నిలదొక్కుకున్న కేశవ అసలు ఈ కేసులో ఎలా భాగం అయ్యాడు? అతను చేసిన తప్పు ఏమిటి? అసలు ఈ మొత్తం క్రైమ్ ఎలా జరిగింది? ఇలాంటి అన్ని విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
గత నెల 29న ఓ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ యువతి మృతికి జగదీశ్ కారణం అంటూ మృతురాలి తండ్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆ యువతి కాల్ డేటాని సంపాదించిన పోలీసులకి ఓ చిన్న క్లూ దొరికింది. ఆమె ఫోన్ నుంచి.. ఓ యువకుడికి ఎక్కువగా కాల్స్ , మెసేజ్ లు వెళ్లి ఉన్నాయి. దీంతో.. పంజాగుట్ట పోలీసులు ముందుగా ఆ యువకుడిని ట్రేస్ చేశారు. ఆ యువకుడి ఎంట్రీతో ఈ కేసులో కేశవ అలియాస్ జగదీశ్ పాత్ర బయట పడింది. పోలీసుల విచారణలోని యువకుడు.. నవంబర్ 27న జరిగిన ఒక ముఖ్యమైన విషయాన్ని పోలీసులకు తెలిపాడు. “నేను, చనిపోయిన యువతి ఆమె అపార్టుమెంట్లో సన్నిహితంగా ఉన్నామని, సరిగ్గా ఆ సమయంలో జగదీశ్ మా ఫోటోలు తీశాడని ఆ యువకుడు తెలిపాడు. ఫోటోలు తీయడమే కాకుండా.. లోపలికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ.. చాలా రచ్చ చేశాడని.. చివరికి మేము పోలీసులని పిలుస్తామని చెప్పేసరికి అక్కడి నుంచి జారుకున్నాడని తెలిపాడు. కానీ.., జగదీశ్ 2 రోజుల తర్వాత ఆ ఫోటోలను యువతికి వాట్సాప్ చేసి బెదిరించాడని. దీంతో ఆమె ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడిందని ఆ యువకుడు పోలీసుల స్టేట్మెంట్ లో వివరించాడు. దీంతో.. పోలీసులు నటుడు జగదీశ్ పై ఫోకస్ చేశారు.
అసలు.. చనిపోయిన మహిళకు, జగదీశ్ కి సంబంధం ఏమిటి అన్న కోణంలో విచారణ చేయగా.. ఇంకొన్ని సంచలన నిజాలు బయట పడ్డాయి. ఈ ఘటన అసలు ఎలా ప్రారంభమైందో పోలీసులు బయట పెట్టారు. “ఇప్పుడు చనిపోయిన మహిళకు ఆరేళ్ల క్రితం ఒక వ్యక్తితో వివాహం జరిగింది. అయితే కొన్ని కారణాల రీత్యా తర్వాత వాళ్లిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆ మహిళ సోమాజిగూడలోని ఓ అపార్టుమెంటుకు మకాం మార్చింది. సరిగ్గా అక్కడే షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీలు చేస్తున్న సమయంలో ఆమెకు జగదీశ్ తో పరిచయం ఏర్పడింది. వారి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే తనను జగదీశ్ పెళ్లి చేసుకుంటాడని ఆ మహిళ భావించింది. జగదీశ్ కూడా ఆమెకు ఆ మాటే చెప్పి దగ్గరయ్యాడు. కానీ.., కొంతకాలానికి జగదీశ్ వేరే యువతిని వివాహం చేసుకున్నాడు. అది కూడా తన ప్రియురాలికి చెప్పకుండా. దీంతో.. ప్రియురాలు రగిలిపోయింది. కోపంతో జగదీశ్ ని పూర్తిగా దూరం పెట్టేసింది. జగదీశ్ కనీసం ఇక్కడితో ఆగిపోయి ఉన్నా.. ఓ నిండు ప్రాణం బలయ్యేది కాదు. కానీ.. ఈ పుష్ప నటుడు బుద్ధి అప్పటికే పూర్తిగా వక్ర మార్గం పట్టింది.
పెళ్లి అయ్యి.. వివాహ బంధంలోకి అడుగు పెట్టాక కూడా.. జగదీశ్ ప్రియరాలిని మర్చిపోలేకపోయాడు. ఆమెను కలవడానికి తరుచూ అపార్టుమెంట్ వద్దకు వెళ్తూ ఉండేవాడు. కానీ.., ఈ గ్యాప్ లోనే అతని ప్రియురాలికి మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ మహిళ- యువకుడు సన్నిహితంగా ఉండటం జగదీశ్ తట్టుకోలేక పోయాడు. ఆ ఆవేశంలో తన కెరీర్, పేరు ప్రతిష్ట ఇవేమి గుర్తు లేకుండా పోయాయి. తిరిగి ఆమెను ఎలా అయినా లొంగతీసుకోవాలని, తన దారికి తెచ్చుకోవాలని ఆలోచన చేయసాగాడు. దానికి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ఒక్కటే మార్గంగా ఎంచుకున్నాడు. ఈ ఆలోచనతోనే జగదీశ్ ఓ రోజున వంటగది కిటికీలో నుంచి వాళ్ల ఫొటోలు తీశాడు. ఆ తర్వాత వచ్చి తలుపులు కొట్టి లోపలికి వచ్చి తన ప్రియురాలితో గొడవకి దిగాడు. ఆమె ఎంత వేడుకున్నా అక్కడి నుంచి బయటకు పోలేదు. చివరికి పోలీసులకు సమాచారం ఇస్తామని చెప్పడంతో జగదీశ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక ఇంత జరిగినా.. జగదీశ్ లో మార్పు రాలేదు.
తాను ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. రెండ్రోజుల తర్వాత ఆ ఫొటోలను మహిళకు పంపి, తాను చెప్పినట్టు వినాలని బెదిరించాడు. జగదీశ్ బెదిరింపులతో, ప్రవర్తనతో ఆందోళనకు గురైన సదరు మహిళ ఏకంగా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న జగదీశ్ కూడా కనిపించకుండా పోయాడు. అయితే.., తీగ లాగితే డొంక కదిలినట్టు.. పోలీసులు సంపాదించిన మహిళ కాల్ డేటా ఆధారంగా.. జగదీశ్ వక్ర బుద్ధి బయట పడింది. తాజాగా పోలీసులు జగదీశ్ ను అరెస్టు చేసి.. కోర్టులో హాజరు పరిచారు. ఈ పుష్ప నటుడు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నాడు. ఇక ఈ కేసుతో జగదీశ్ కెరీర్ కు మాత్రమే కాకుండా.. పుష్ప 2 సినిమాకి కూడా కొత్త కష్టాలు వచ్చినట్లు అయ్యింది. అవకాశాలు లేక, వచ్చిన ఆ అవకాశాలు సక్సెస్ కాక, సినీ ఇండస్ట్రీలో కొన్ని వేల మంది అల్లాడుతున్నారు. అలాంటిది తక్కువ సమయంలోనే అద్భుతమైన సక్సెస్ వస్తే.. ఈ పుష్ప నటుడు దాన్ని సరిగ్గా వినియోగించుకోలేక పోయాడన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. జగదీశ్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.