iDreamPost
android-app
ios-app

పెళ్లి విషయంలో తల్లి పడుతున్న బాధను చూడలేక

ఆడ పిల్ల పుట్టగానే సంబరాలు కాదు.. ఆమెను ఓ అయ్య చేతిలో పెడితేనే బాధ్యత పూర్తి అవుతుందని తల్లిదండ్రులు భావిస్తుంటారు. అందుకే ఆమె చదువుకన్నా ఎక్కువ ఖర్చు.. పెళ్లికి పెడుతున్నారు. కానీ..

ఆడ పిల్ల పుట్టగానే సంబరాలు కాదు.. ఆమెను ఓ అయ్య చేతిలో పెడితేనే బాధ్యత పూర్తి అవుతుందని తల్లిదండ్రులు భావిస్తుంటారు. అందుకే ఆమె చదువుకన్నా ఎక్కువ ఖర్చు.. పెళ్లికి పెడుతున్నారు. కానీ..

పెళ్లి విషయంలో తల్లి పడుతున్న బాధను చూడలేక

ఆడ పిల్ల పుట్టిందని సంబర పడేలోపు పెళ్లి చేసి అత్తారింటికి పంపాలన్న బాధ్యత, బరువు గుర్తుకు వస్తాయి తల్లిదండ్రులకు. 18 ఏళ్లు నిండిన నాటి నుండే ఎప్పుడు చేస్తావయ్యా నీ బిడ్డకు పెళ్లి అంటూ తండ్రిని సతాయిస్తుంటారు చుట్టుపక్కలోళ్లు. బంధువులు. పోనీ అక్కడతో ఆగుతారా అంటే..మాకు తెలిసిన వాళ్ల అబ్బాయి ఉన్నాడు సంబంధం మాట్లాడమంటావేంటీ అంటుంటారు. ఇన్ని చెబుతుంటారు కానీ పైసా సాయం చేసేందుకు మాత్రం ముందుకు రారు. కనీసం అప్పుగా అయిన డబ్బులు ఇవ్వరు. ఆడ పిల్లకు పెళ్లి చేయాలంటే రూపాయితో కూడుకున్న పని అని మర్చిపోయి మరీ ఉచిత సలహాలు ఇస్తుంటారు. కట్నం, పెట్టిపోతల విషయంలో ఆమెను కన్నోరికి ఖర్చు తడిసి మోపెడు అవుతుంది.

కట్నం ఇవ్వకపోతే పెళ్లి పీటల మీదే పెళ్లిళ్లు ఆగి పోయిన ఘటనలు అనేకం చూశాం. తాజాగా ఓ అమ్మాయి కూడా వరకట్నానికి బాధితురాలు అయ్యింది. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి కానరాని లోకాలకు వెళ్లిపోయి తల్లిని, తోబుట్టువులను శోక సంద్రంలో ముంచేసింది. పెళ్లి దగ్గర పడుతున్నా.. కట్నం డబ్బులు దొరకలేదన్న బాధతో ఆత్మహత్యకు ఒడిగట్టింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ల పల్లి మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగళ్ల పల్లికి చెందిన అత్తారి గిరి లక్ష్మి- గిరి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. ఏడేళ్ల క్రితమే తండ్రి గిరి అనారోగ్యంతో మృతి చెందాడు.

కూతురు శైలజకు కొడిమ్యాల మండలం దమ్మాయి పేటకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. కట్నం కింద రూ. 4 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు శైలజ తల్లి లక్ష్మి. ఈ కట్నం డబ్బుల కోసం పలువుర్ని అడిగినా.. అవి లభించలేదు. పెళ్లి సమయం దగ్గర పడుతోంది. కట్నం కోసం తన తల్లి నలుగుర్ని డబ్బులు అడగడం, అవస్థలు చూసి మనో వేదనకు గరైంది. తను లేకుంటే.. అమ్మకు ఈ కష్టం రాదని భావించిన శైలజ.. బుధవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చి చూసిన తల్లికి కూతురు శైలజ ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించే సరికి కన్నీరు మున్నీరు అయ్యింది. తల్లి లక్ష్మి ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.