Venkateswarlu
Venkateswarlu
ఐఫోన్ అంటే జనాలకు ఎంత మోజుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐఫోన్ కోసం తమ శరీరంలో భాగాలను అమ్మిన ఘటనలు కూడా ప్రపంచ వ్యాప్తంగా చాలా జరిగాయి. తాజాగా, ఓ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయటం కోసం ఐఫోన్ కొనాలని ఏకంగా తమ చంటి బిడ్డను అమ్మేసింది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగనాస్ జిల్లాలోని పనిహతి గాంధీనగర్‌కు చెందిన ఓ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ అయిపోవాలని, బాగా డబ్బు సంపాదించాలని భావించింది.
అయితే, మంచి క్వాలిటీ వీడియోలు తీసి ఇన్‌స్టాలో పెట్టడానికి వారి ఆర్థిక స్థోమత సరిపోలేదు. దీంతో ఐఫోన్ కొంటే బాగుంటుందని భావించింది. ఐఫోన్ కొనాలన్నా వారి ఆర్థిక స్థితి సరిపోదు. పూట గడవడానికే చాలా కష్టంగా ఉంది ఆ ఇంటి పరిస్థితి. అయితే, కొద్దిరోజులకు ముందు ఆ జంట ఓ దారుణమైన ఆలోచన చేసింది. ఐఫోన్ కొనడానికి డబ్బుల కోసం తమ 8 నెలల పిల్లను అమ్మాలని నిశ్చయించుకుంది. ఖర్దాహాలోని ఓ మహిళకు బేరం పెట్టింది. ఆ మహిళ వారు అడిగినంత డబ్బు ఇచ్చింది. దీంతో ఆ జంట ఐఫోన్ కొంది.
అయితే, తినడానికి సరిగా తిండి కూడా లేని వీరి దగ్గరికి ఒక్కసారిగా ఐఫోన్ వచ్చేసరికి పొరిగింటి వాళ్లకు అనుమానం వచ్చింది. అంతేకాదు! వారి బిడ్డ చాలా రోజుల నుంచి కనిపించకపోయే సరికి జనం నిలదీశారు. మొదట వారు అబద్ధం చెప్పారు. పొరిగింటి వాళ్లు గట్టిగా అడిగేసరికి అసలు నిజం ఒప్పుకున్నారు. ఈ విషయం లోకల్ కౌన్సిలర్ ద్వారా పోలీసులకు చేరింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహిళ వద్ద ఉన్న బిడ్డను రక్షించారు. చైల్డ్ ట్రాఫికింగ్ కోణం విచారణ చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.