Krishna Kowshik
ఆమె విద్యావంతురాలు. ఓ సంస్థను స్థాపించింది. ఇటీవల కొడుకుతో కలిసి గోవా వెళ్లింది. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఆమె మాత్రమే కనిపించింది. అనుమానం వచ్చిన అపార్ట్ మెంట్ సిబ్బంది.. ఆమె గదికి వెళ్లి చూడగా రక్తపు మరకలు.. పోలీసులకు సమాచారం అందించగా.. చివరకు శవమై ఆమె బ్యాగులో కనిపించాడు నాలుగేళ్ల కుమారుడు
ఆమె విద్యావంతురాలు. ఓ సంస్థను స్థాపించింది. ఇటీవల కొడుకుతో కలిసి గోవా వెళ్లింది. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఆమె మాత్రమే కనిపించింది. అనుమానం వచ్చిన అపార్ట్ మెంట్ సిబ్బంది.. ఆమె గదికి వెళ్లి చూడగా రక్తపు మరకలు.. పోలీసులకు సమాచారం అందించగా.. చివరకు శవమై ఆమె బ్యాగులో కనిపించాడు నాలుగేళ్ల కుమారుడు
Krishna Kowshik
ఈ భూ ప్రపంచంలో స్వార్థం లేని.. కల్తీ కానీ బంధం, ఎమోషన్ ఏదైనా ఉందంటే.. అదీ అమ్మ, ఆమె ప్రేమ మాత్రమే. అందుకే అమ్మను మించిన దైవం లేదని అంటారు పెద్దలు. అడగకుండానే ఆకలి తెలుసుకుని..కంచంలో ముద్ద పెట్టి, అవసరమైతే గోరు ముద్దలు తినిపించి కడుపు నింపుతుంది. బాధలో ఓదార్చి, నిరాశలో ధైర్యాన్ని నింపి, జీవన ప్రయాణంలో వెన్నుతట్టి..విజయంలో వెనక ఉండి నడిపిస్తుంది తల్లి. ఆమెకు ఉన్న నేర్పు,ఓర్పు మరే జీవికి ఉండదు. అందుకే అమ్మను భూమాతతో కొలుస్తారు. తిట్టినా, కొట్టినా చివరకు దగ్గరకు తీసుకుని ఓదార్చేది, ప్రేమ కురిపించేది అమ్మే. తన బిడ్డ కోసం ఎంత దూరమైనా వెళుతోంది. ఎంత త్యాగమైనా చేస్తుంది. అందుకే ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు లేరని సినీ కవి అన్నాడు.
అలాంటి అమ్మతనానికి మాయని మచ్చలా మారింది బెంగళూరుకు చెందిన ఓ సంస్థ సీఈవో సుచనా సేథ్. నాలుగేళ్ల కుమారుడ్ని చంపి.. కసాయి తల్లిగా చరిత్రలకు ఎక్కింది. ఇంతకు ఈ సుచనా సేథ్ ఎవరు.. ఆమె ఎందుకు కొడుకును చంపేసింది. చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే.. సుచనా సేథ్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళ. ఈమె భర్త వెంకట్ రామన్ కేరళకు చెందిన వ్యక్తి. వీరికి 2010లో వివాహం అయ్యింది. నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. వీళ్ల కాపురం కొన్నాళ్లకే బీటలు వారింది. వెంకట్ రామన్ తనను, తన కొడుకును హింసిస్తున్నాడంటూ2022లో గృహ హింస కేసును దాఖలు చేసింది సుచనా.రూ. 2.5 లక్షల భరణం కూడా కోరింది. వీరి విడాకుల కేసు తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం ఆమె భర్త విదేశాల్లో ఉంటున్నారు.ఆమె బెంగళూరులో ఉంటోంది
సుచనా సేథ్ సాదా సీదా మహిళ కాదూ.. చాలా తెలివైనది.. ఉన్నత చదువులు చదివింది. సుచనా భవానీ పుర్‌లో డిగ్రీ చేసి.. కోల్ కతా యూనివర్శిటీ నుండి ఎంఎస్సీ ఫిజిక్స్‌లో పీజీ చేసింది.హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన బెర్క్ మాన్ క్లెన్ సెంటర్ లో ఫెలోగా ఉంది. రామన్ రీసెర్చ్ యూనివర్శిటీ పరిశోధకురాలు కూడా. డేటా అండ్ సైన్స్ మెజిల్లా ఫెల్లోగా కూడా వ్యవహరించింది. ఆర్టిఫియల్ ఇంటిలిజెన్స్ ఎథిక్స్ నిపుణురాలు ఆమె. స్టార్టప్‌లు, ఇండస్ట్రీ రీసెర్చ్ స్కేలింగ్, మెషిన్ లెర్నింగ్ సొల్యూషన్లలో 12 సంవత్సరాల అనుభవముంది. ఇందులో మరో విశేషమేమిటంటే.. ఏఐ ఎథిక్స్ 2021లో 100 మంది తెలివైన మహిళల జాబితాలో ఆమె పేరు ఉండటం గమనార్హం. 2012-16 మధ్య బెంగళూరులో వివిధ ఉద్యోగాల్లో చేసిన సుచనా 2020లో మైండ్ ఫుల్ ఏఐ సంస్థను స్థాపించింది. అక్కడ వరకు ఓకే.. కానీ
జనవరి 6న గోవాలోని కాండోలిమ్‌లో ఓ సర్వీసు అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకుని.. తన కొడుకుతో పాటు రెండు రోజులు గడిపింది. 2 రోజులు గడిచిపోయాక.. తాను పని మీద తిరిగి బెంగళూరు వెళ్లాలని అపార్ట్ మెంట్ సిబ్బందికి చెప్పి.. టాక్సీ ఏర్పాటు చేయాలని కోరింది. అయితే ఫ్లైట్‌లో వెళితే తక్కువ ఖర్చు అవుతుందని సిబ్బంది చెప్పినప్పటికీ.. కాదని టాక్సీ ఏర్పాటు చేయాలని పేర్కొంది. అప్పుడే సుచనా సేథ్ పై అనుమానం వచ్చింది సిబ్బందికి. జవనరి 8న ఆమె బెంగళూరుకు బయలు దేరింది. ఆమె ఖాళీ చేశాక.. సిబ్బంది ఆమె ఉన్న అపార్ట్ మెంట్ శుభ్రం చేసేందుకు వెళ్లారు. అప్పుడే గదిలోని టవల్‌పై రక్తపు మరకలు కనిపించాయి. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సుచన వెళ్లినప్పుడు ఆమె కుమారుడు కనిపించలేదని, ఆమె మోస్తున్న బ్యాగ్ కూడా చాలా బరువుగా ఉన్నట్లు వివరాలు తెలిపారు. అయితే ఈ విషయంపై ఆమెను పోలీసులు సంప్రదించగా.. అవి పీరియడ్స్ మరకలని, కుమారుడు దక్షిణ గోవాలో ఫ్రెండ్ ఇంట్లో ఉన్నట్లు చెప్పింది. అక్కడి అడ్రస్ కూడా ఇచ్చింది. పోలీసులు వైరిఫై చేయగా.. అది నకిలీ అడ్రస్ అని తేల్చారు. ఈ సారి ప్లాన్ మార్చారు పోలీసులు. ఆమెకు బదులుగా.. ఆమెను తీసుకెళుతున్న టాక్సీ డ్రైవర్‌ను సంప్రదించి.. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లాలని చెప్పడంతో.. చిత్ర దుర్గలోని స్టేషన్ వైపుగా వాహనాన్ని మళ్లించాడు టాక్సీ డ్రైవర్. అక్కడి పోలీసులకు అప్పటికే సమాచారం అందింది.
వెంటనే సుచనా సేథ్ అక్కడకు చేరుకోగానే.. ఆమె బ్యాగ్ తనిఖీ చేయగా.. కుమారుడి మృతదేహం కనిపించింది. వెంటనే ఆమెను అరెస్టు చేశారు పోలీసులు. ఆమె బిడ్డను చంపడానికి కారణాలు భార్యా భర్తల మధ్య తగాదాలేనని తెలుస్తోంది. వీరి విడాకుల కేసు ఇటీవల విచారణకు రాగా.. నాలుగేళ్ల చిన్నారిని తండ్రి కూడా చూసే హక్కును కోర్టు కల్పించింది. ఈ తీర్పు పట్ల ఆమె అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. తన భర్తను బిడ్డకు చూపించేందుకు ఇష్టపడకే..ఆమె కుమారుడ్నిచంపేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే పోలీసులు జరిపిన దర్యాప్తులో.. ఆమె ముందస్తు ప్రణాళికతోనే హత్య చేసినట్లు నిర్దారించారు.
జనవరి 10న గోవా పోలీసులు.. వారు ఉన్న గదిలో సోదాలు చేపట్టగా.. దగ్గు మందు ఖాళీ సీసాలు పెద్ద మొత్తంలో కనిపించాయి. కుమారుడికి అధిక మోతాదులో దగ్గు మందు పట్టించి..అతడు గాఢ నిద్రలోకి వెళ్లాక.. ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు భావిస్తున్నారు. అయితే తన కుమారుడ్ని తాను చంపలేదని వాపోతుంది తల్లి సుచనా సేథ్. ఆమె ఇన్ స్టా చూస్తే.. చివరి సారిగా ఆమె కొడుకు ఫోటో పెట్టినట్లు కనిపిస్తోంది. మరీ ఈ తల్లి కమ్ ఓ సంస్థ సీఈవో క్రైం కథనంలో తప్పు ఎవరిదైనా.. అభం, శుభం తెలియని చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.