iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. 11 మంది స్పాట్ డెడ్

  • Published Sep 13, 2023 | 9:51 AM Updated Updated Sep 13, 2023 | 9:51 AM
బ్రేకింగ్: బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. 11 మంది స్పాట్ డెడ్

దేశంలో గత కొంతకాలంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేస్తున్న తప్పిదాల వల్ల ఎంతోమంది అమాయకులు బలిఅవుతున్నారు. రోడ్డుపై ప్రయాణించే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని డ్రైవర్లకు ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నా.. కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడి ఎంతోమంది వికలాంగులుగా మారిపోతున్నారు.. పెద్ద దిక్కు కోల్పోయిన ఎన్నో కుటుంబాల రోడ్డున పడుతున్నాయి. మొన్న తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మహిళలు మృతి చెందారు.. ఈ ఘటన మరువక ముందే మరో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బస్సును ట్రక్కు ఢీ కొట్టడంతో 11 మంది చనిపోయారు. ఈ విషాద ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్ లోని భరత్ పూర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు రాజస్థాన్ లోని పుష్కర్ నుంచి ఉత్తర్ ప్రదేశ్ కి బయలుదేరింది. లఖన్ పూర్ ప్రాంతంలో అంట్రా ఫ్లై ఓవర్ వద్ద బస్సులోని ఇంధనం అయిపోవడంతో బస్సును పక్కకు ఆపి ఉంచారు. బస్సు డ్రైవర్ తో పాటు మరికొంతమంది అక్కడే నిల్చుని వేరు వాహనం కోసం ఎదురు చూస్తున్నారు. అంతలోనే ఓ ట్రక్కు అతి వేగంగా దూసుకొచ్చి ఆగి ఉన్న బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సు బ్రిడ్జీ నుంచి కిందపడిపోయింది. ఈ ఘటనలో 11 మంది అక్కడిక్కడే చనిపోయారు. చనిపోయిన వారిలో ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు మరో 12 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.

ఈ ఘటన బుధవారం తెల్లవారజామున 4.30 ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తుంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై పూర్తి వివరాలు తెలుసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారు అంతా గుజరాత్ ప్రాంతానికి చెందినవారని తెలుస్తుంది.. అక్కడ పూర్తిగా విషాద వాతావరణం కనిపిస్తుంది.