iDreamPost
android-app
ios-app

ప్రేయసిని చంపేసి తప్పించుకునే ప్రయత్నం.. చివరకు ఆ ఆధారంతో

ప్రేయసిని చంపేసి తప్పించుకునే ప్రయత్నం.. చివరకు ఆ ఆధారంతో

రాజేష్ అనే యువకుడు ప్రేమ, పెళ్లి పేరుతో దగ్గరై ఓ యువతిని అత్యంత దారుణంగా అంతమొందించిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. కాగా ఈ ఘటన 2019 మే 8న చోటుచేసుకోగా మొదట్లో సాక్ష్యాధారాలు లేని కారణంగా పోలీసులు అతడిని అరెస్టు చేయకుండా వదిలేశారు. కానీ ఆ యువతి కుటుంబ సభ్యులు మాత్రం విడిచిపెట్టలేదు. నిందితుడిపై అనుమానంతో పోలీసులతో పాటుగా ఆ యువతి కుటుంబసభ్యులు ఆధారాల కోసం వెతకసాగారు. ఈ క్రమంలో యువతి ఇంటికి సమీపంలో ఉన్న సీసీ కెమెరా కీలక ఆధారం అందించింది. దీంతో పోలీసులు నిందితుడు రాజేశ్ ను అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో రాజేష్ బెయిల్ పై బయటకు రాగా.. కేసు కోర్టు విచారణలో ఉంది. కాగా నిందితుడు రాజేష్ మరో హత్య కేసులో అరెస్టయ్యాడు.

ప్రేమ పేరుతో దగ్గరై

పద్మారావునగర్‌లోని ఇంటిపై కన్నేసి, దాన్ని కాజేయడం కోసం యజమాని అయిన సినీ నిర్మాత అంజిరెడ్డిని కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేసి అరెస్టైన రాజేష్‌ గణేష్‌ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇతగాడు 2019లో డబ్బు కోసమే తన ప్రేయసి మౌనికను హత్య చేసి కటకటాల్లోకి చేరాడు. చెన్నై నుంచి హైదరాబాద్ కు వలస వచ్చిన రాజేష్ గణేష్ పార్శిగుట్టలో ఆక్వేరియం షాప్ పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదిమూలం మౌనిక అనే యువతితో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఈ క్రమంలోనే మౌనిక కుటుంబసభ్యులకు దగ్గరై వ్యాపారం విస్తరించడానికి డబ్బు అవసరం అని రూ. 15 లక్షలు మౌనిక తల్లి పుష్ప వద్ద తీసుకున్నాడు. పుష్పకు ఇద్దరు కూతుర్లు. కాగా కొంత కాలం తర్వాత పెద్ద కూతురికి పెళ్లి చేయాలని పుష్ప నిర్ణయించుకుంది.

డబ్బు తిరిగి అడిగినందుకు కక్ష.. పట్టించిన సీసీ కెమెరా

దీనికోసం రాజేష్ ను డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా తన చిన్న కూతురు మౌనికతో అడిగిపించింది. ఈ క్రమంలోనే వారి మధ్య వివాదం చెలరేగింది. ఎలాగైన మౌనికను అంతమొందించాలని పథకం వేశాడు రాజేష్. 2019 మే 8న మౌనిక ఇంటికి వెళ్లి ఎవరు లేని సమయం చూసి ఆమెపై దాడి చేసి చంపేశాడు. ఈ ఘటనపై తుకారాంగేట్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి రాజేష్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ నిందితుడు చాకచక్యంగా అరెస్టు కాకుండా తప్పించుకున్నాడు. కాగా రాజేష్ పై అనుమానం వ్యక్తం చేసిన కుటుంబసభ్యులు ఆధారాల కోసం వెతకసాగారు. అయితే పుష్ప ఇంటికి కొద్ది దూరంలో ఉన్న సీసీ కెమెరా వీరికి కీలక ఆధారం అందించింది. హత్య జరిగిన రోజు సాయంత్రం 4 గంటలకే తాను మౌనిక వద్ద నుంచి వెళ్లిపోయానని రాజేష్‌ చెప్పుకొచ్చాడు. అయితే ఆ సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల ప్రకారం ఆ రోజు సాయంత్రం 6.30 వరకు రాజేష్‌ అక్కడే ఉన్నట్లు తేలింది.

దీంతో పాటు ఇతర ఆధారాలను పోలీసులకు అందించారు. ఫోరెన్సిక్‌ రిపోర్టు సైతం మౌనిక తలపై ఆరు అంగుళాల బలమైన గాయం ఉందని, ఇది హత్యేనని తేలి్చంది. వీటి ఆధారంగా అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చి రాజేష్‌ను అరెస్టు చేశారు. కేసు కోర్టులో ఉండగా రాజేష్ బెయిల్ పై బయటికొచ్చాడు. తాజాగా నిర్మాత అంజిరెడ్డి కేసులో రాజేష్‌ అరెస్టు అయిన విషయం తెలుసుకున్న మౌనిక కుటుంబీకులు శనివారం నార్త్‌జోన్‌ డీసీపీ చందన దీప్తిని కలిశారు. మౌనికను చంపిన రాజేష్ కు వీలైనంత త్వరలో శిక్షపడేలా చూడాలని, అతడి నుంచి తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. కేసు విచారణ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని హతురాలి కుటుంబీకులకు పోలీసులు హామీ ఇచ్చారు. అంజిరెడ్డి హత్య కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన రాజేష్ తో పాటు సుపారీ హంతకులను తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకోవాలని గోపాలపురం పోలీసులు నిర్ణయించారు.