iDreamPost
android-app
ios-app

ACB కోర్టులో చంద్రబాబుకు మరోషాక్‌!

ACB కోర్టులో చంద్రబాబుకు మరోషాక్‌!

టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్‌ స్కాం కేసులో అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉంటున్నారు. తాజాగా, ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు మరో షాక్‌ తగిలింది.
ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబుకు పీటీ వారెంట్‌ జారీపై గురువారం ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. ఫైబర్‌ నెట్‌ కేసుకు సంబంధించి చంద్రబాబును కోర్టుకు తీసుకురావాలని సీఐడీ న్యాయవాది సుధీర్ఘ వాదనలు వినిపించారు.

పీటీ వారెంట్‌ జారీ చేయటానికి కోర్టు అనుమతి ఇచ్చింది. సోమవారం చంద్రబాబును హాజరుపర్చాలని కోర్టు ఆదేశించింది. సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కోర్టు ముందు హాజరుపర్చాలని తెలిపింది. కాగా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టు ద్వారా భారీగా అవినీతి చేసినట్లు తెలుస్తోంది. బినామీ కంపెనీ ద్వారా అవకతవకలకు పాల్పడినట్లు సమాచారం. 2 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుకు సంబంధించి మొదటి దశలో 333 కోట్ల రూపాయలతో పనులు మొదలయ్యాయి.

చంద్రబాబు, లోకేశ్‌లు నిబంధనలకు విరుద్ధంగా తమకు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు చెందిన ‘టెరా సాఫ్ట్‌’ కంపెనీకి టెండర్లు కట్టబెట్టినట్లు తెలుస్తోంది.  మరి, ఫైబర్‌ నెట్‌ కేసుకు సంబంధించి చంద్రబాబుకు పీటీ వారెంట్‌ జారీ చేయటానికి ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.