Dharani
బిడ్డల ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డేసి కాపాడుకోవాల్సిన తల్లి.. అత్యంత కర్కశంగా తన కడుపున పుట్టిన పిల్లల ప్రాణాలు తీసి.. తాను ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆ వివరాలు..
బిడ్డల ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డేసి కాపాడుకోవాల్సిన తల్లి.. అత్యంత కర్కశంగా తన కడుపున పుట్టిన పిల్లల ప్రాణాలు తీసి.. తాను ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆ వివరాలు..
Dharani
బిడ్డ ఒక్కసారి బాధగా అమ్మా అని పిలిస్తే చాలు.. చితి నుంచి సైతం లేచి వచ్చి.. బిడ్డను అక్కున చేర్చుకుని ధైర్యం చెబుతుంది తల్లి. అమ్మ పక్కన ఊంటే చాలు.. ప్రపంచాన్ని ఎదిరించేంత ధైర్యం వస్తుంది. పిల్లలకు తల్లి ఒడికి మించిన సురక్షిత స్థానం ప్రపంచంలో మరొకటి లేదు. నాన్న లేకపోయినా సరే.. తల్లి ఒక్కతే తన బిడ్డలకు అన్ని ప్రేమలను పంచగలదు. బిడ్డలకు అమ్మ ప్రేమే శ్రీరామ రక్ష అంటారు. బిడ్డల కోసం తల్లి మృత్యువుకు సైతం ఎదురెళ్తుంది. కానీ ఈ మధ్య కాలంలో వెలుగు చూసే కొన్ని సంఘటనలు చూస్తే.. తల్లి ప్రేమకు నిర్వచనం మార్చాలేమో అనిపించకమానదు.
కొందరు కసాయి తల్లులు తమ స్వార్థం కోసం కన్న బిడ్డలను కడతేరుస్తుంటే.. మరి కొందరు తల్లులు మాత్రం.. ఈలోకంలో బతకలేక.. బిడ్డలను ఒంటరిగా వదిలిపెట్టలేక.. తమతో పాటు బిడ్డల జీవితాలను కూడా కడతేరుస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ముక్కుపచ్చలారని బిడ్డలను చంపి.. తాను ఆత్మహత్యా ప్రయత్నం చేసింది ఓ తల్లి. ఆ వివరాలు..
ఈ విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా, కౌతాళం మండలం హాల్వి గ్రామంలో శనివారం నాడు చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. హాల్వి గ్రామానికి చెందిన బోయ రామకృష్ణకు కోసిగి మండలం అర్లబండకు చెందిన శారదతో నాలుగేళ్ల క్రితం అనగా 2019లో వివాహమైంది. భార్యాభర్తలిద్దరూ వ్యవసాయం చేసుకుని జీవనం సాగించే వారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కొడుకు వెంకటేష్ (3 ఏళ్లు), చిన్నారి భరత్ కు 6 నెలల వయసు మాత్రమే. రెండో కొడుకు జననం తర్వాత.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న శారద గత ఐదు నెలలుగా పుట్టింటిలో ఉంటోంది.
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం గ్రామ దేవత విగ్రహ ప్రతిష్టాపన ఉండటంతో అత్తగారి ఊరు హాల్వి గ్రామానికి వచ్చింది శారద. ఆపరేషన్ తర్వాత భార్య ఆరోగ్యం ఇంకా కుదుటపడకపోవడంతో.. ఆమెకు మరి కొంత విశ్రాంతి అవసరమని భావించిన శారద భార్త.. ఆమెను పుట్టింటిలో వదిలి వస్తానని శుక్రవారం రాత్రి చెప్పాడు. మరి ఏం జరిగిందో తెలియదు కానీ.. శారద భర్త రామకృష్ణ శనివారం ఉదయం లేచి పొలానికి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చి నిద్రిస్తుండగా.. చిన్న పిల్లవాడు భరత్ అరుపులు వినిపించాయి. ఇంటి బయటకు వెళ్లి చూడగా భార్య శారద నీటి బకెట్లో పిల్లాడిని ముంచుతూ కనిపించింది.
వెంటనే స్పందించిన శారద భర్త.. చిన్నారి భరత్ ను ఆమె చేతిలోంచి లాక్కుని.. గ్రామంలోని వైద్యుని దగ్గరికి తీసుకుని వెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందాడు. అనుమానం వచ్చిన శారద భర్త సోదరుడు ఇంటికి వెళ్లి చూడగా పెద్ద పిల్లాడు వెంకటేష్ నోటి నుంచి నురుగు వస్తుండటం గమనించాడు. వెంటనే బాలుడిని వైద్యుని వద్దకు తీసుకుని వెళ్లగా అప్పటికే వెంకటేష్ మృతి చెందినట్లు తెలిపారు.
పెద్ద కుమారుడు వెంకటేష్ కి.. తలకు రాసుకునే సూపర్ వ్యాస్మోల్ తాపి.. తాను కూడా తాగింది శారద. ఆమెను ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే ఆమెకు చికిత్స అందిచడంతో.. ప్రస్తుతం కోలుకుంటుంది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని, కుటుంబ సభ్యుల నుంచి సమాచారం సేకరించి.. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.