iDreamPost
android-app
ios-app

వెజ్ ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే నాన్‌ వెజ్‌ డెలివరీ.. జొమాటో, మెక్‌డొనాల్డ్‌కు రూ. లక్ష ఫైన్

వెజ్ ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే నాన్‌ వెజ్‌ డెలివరీ.. జొమాటో, మెక్‌డొనాల్డ్‌కు రూ. లక్ష ఫైన్

ఈ రోజుల్లో ఎక్కువ మంది ఆన్ లైన్ లోనే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని ఆకలి తీర్చుకుంటున్నారు. బిజీ లైఫ్, వంట చేసుకునేంత సమయం లేకపోవడం కారణంగా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే టైమ్ కు డెలివరీ కాకపోవడంతో ఇబ్బంది పడే సందర్బం కూడా ఉంటుంది. మరి కొన్ని సందర్భాల్లో ఆర్డర్లు తారుమారయ్యే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా ఓ కస్టమర్ తాను వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే, నాన్ వెజ్ ను డెలివరీ చేసింది జొమాటో. దీంతో షాక్ తిన్న వినియెగదారుడు కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో జొమాటో మరియు దానితో టైఅప్ అయిన మెక్ డొనాల్డ్ కు జరిమానా విధించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు బిగ్ షాక్ తగిలింది. ఫుడ్ డెలివరీ విషయంలో చేసిన పొరపాటుకు తగిన మూల్యం చెల్లించుకుంది. కన్జ్యూమర్ కోర్టు ఏకంగా రూ. లక్ష జరిమానా విధించింది. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. జోధ్ పూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మెక్‌డొనాల్డ్‌లో వెజిటేరియన్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేశాడు. అయితే జొమాటో డెలివరీ బాయ్ ఫుడ్ ను డెలివరీ చేశాడు. ఇక తినేద్దామని ఫుడ్‌ ఓపెన్ చేసి చూడగా అతడు షాకయ్యాడు. తాను వెజ్ ఆర్డర్ చేస్తే నాన్ వెజ్ డెలివరీ చేశారని గుర్తించాడు.

వెజ్‌కు బదులు నాన్‌ వెజ్‌ ఫుడ్‌ డెలివరీ చేయడంపై ఆ వ్యక్తి అసహనం వ్యక్తం చేశాడు. తనకు కలిగిన అసౌకర్యానికి ఆ వ్యక్తి మెక్‌డొనాల్డ్‌, జొమాటోపై జోధ్‌పూర్ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కన్జ్యూమర్ కోర్టు వినియోగదారుల రక్షణ చట్టం 2019 కింద ఉల్లంఘన జరిగినట్లు కోర్టు తేల్చింది. ఈ క్రమంలోనే మెక్‌డొనాల్డ్‌, జొమాటోకు లక్ష జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. అలాగే ఆ రెండు సంస్థలు కూడా ఆ వ్యక్తికి కోర్టు ఖర్చుల కింద రూ.5,000 చెల్లించాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.