iDreamPost
android-app
ios-app

Airtel, Jioలకు గడ్డు కాలమే.. BSNL 5G సేవలు రెడీ!

  • Published Aug 03, 2024 | 10:32 AM Updated Updated Aug 03, 2024 | 10:32 AM

BSNL 5G: ప్రైవేటు టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్‌, జియలోకు బీఎస్‌ఎన్‌ఎల్‌ చెక్‌ పెట్టడానికి రెడీ అయ్యింది. ఎందుకంటే 5జీ సేవలు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..

BSNL 5G: ప్రైవేటు టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్‌, జియలోకు బీఎస్‌ఎన్‌ఎల్‌ చెక్‌ పెట్టడానికి రెడీ అయ్యింది. ఎందుకంటే 5జీ సేవలు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..

  • Published Aug 03, 2024 | 10:32 AMUpdated Aug 03, 2024 | 10:32 AM
Airtel, Jioలకు గడ్డు కాలమే.. BSNL 5G సేవలు రెడీ!

ప్రైవేటు టెలికాం రంగ సంస్థలైన ఎయిర్‌టెల్‌, జియోలు తమ రీఛార్జ్‌ ప్లాన్స్‌ రేట్లను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఒక్కో ప్లాన్‌ మీద 11-25 శాతం వరకు రేట్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయం కస్టమర్లలో తీవ్ర అసంతృప్తిని రగల్చడమే కాక.. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారేందుకు అవకాశం కల్పించినట్లు అయ్యింది. రీఛార్జ్‌ ప్లాన్స్‌ రేట్లను పెంచడంతో.. ఇప్పటికే లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారారు. ఈ పరిణామాలన్ని క్యాష్‌ చేసుకునేందుకు బీఎస్‌ఎన్ఎల్‌ కూడా తీవ్రంగా శ్రమిస్తోంది. మొన్నటి వరకు 3జీ దగ్గరే తచ్చాడిన బీఎస్‌ఎన్‌ఎల్‌.. ఇప్పుడు దేశవ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన 4 జీ సేవలు ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో తాజాగా బీఎస్‌ఎన్‌ల తీసుకున్న నిర్ణయంతో ఎయిర్‌టెల్‌, జియోల గుండెల్లో గుబులు మొదలయ్యింది. ఆ వివరాలు..

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తన నెట్‌వర్క్‌ సేవల్ని విస్తరిస్తోంది. ఇప్పటికే 4జీ నెట్‌వర్క్‌ సేవల్ని కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.. తాజాగా తన 5జీ సేవల ట్రయల్స్‌ను ప్రారంభించింది. కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. శుక్రవారం నాడు బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ నెట్‌వర్క్‌ సేవల్ని పరీక్షించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ‘ఎక్స్‌’ లో షేర్‌ చేయడంతో అది వైరల్‌గా మారుతోంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ తన 5జీ నెట్‌వర్క్‌ టెస్ట్‌ను సీ-డాట్‌ క్యాంపస్‌లో నిర్వహించింది. ఇందులో పాల్గొన్న కేంద్ర మంత్రి 5జీ ఎనేబల్డ్‌ వీడియో కాల్‌ చేశారు. నెట్‌వర్క్‌ ఎలా పనిచేస్తుందో పరిశీలించారు. మాటలు, వీడియో స్పష్టంగా వస్తోందని చెబుతున్న వీడియోని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం టెలికాం రంగానికి మరీ ముఖ్యంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ను పునరుద్ధరించేందుకు భారీ ఎత్తున నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. అంటే ఏకంగా రూ.82 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించింది. టెలికాం సంస్థ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడంతో పాటు దేశమంతటా 4జీ, 5జీ నెట్‌వర్క్‌ సేవల్ని అందించేందుకు ఈ నిధుల్ని ఉపయోగించనుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పుడీ చర్యలు తీసుకోవడానికి ప్రధాన కారణం.. ప్రైవేటు టెలికాం సంస్థలైన ఎయిర్‌టెల్‌, జియోలు టారిఫ్‌లను పెంచడంతో చాలా మంది బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మరలుతున్నారు. దీంతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఓ వైపు నెట్‌వర్క్‌ సేవల్ని విస్తరిస్తూనే మరోవైపు సిమ్‌ పోర్టింగ్‌ను సులభతరం చేయడానికి దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో క్యాంపులు నిర్వహిస్తూ.. దేశమంతటా కస్టమర్లను పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది.