5 లక్షలలోపు బెస్ట్.. బడ్జెట్ కార్లు ఇవే!

ఇవాళ్టి రోజుల్లో కారు అనేది విలాసం నుంచి అవసరంగా మారిపోయింది. అందుకే మీకోసం 5 లక్షల్లోపు బెస్ట్ బడ్జెట్ కార్లను తీసుకొచ్చాం.

ఇవాళ్టి రోజుల్లో కారు అనేది విలాసం నుంచి అవసరంగా మారిపోయింది. అందుకే మీకోసం 5 లక్షల్లోపు బెస్ట్ బడ్జెట్ కార్లను తీసుకొచ్చాం.

గతంలో కారు అనగానే అందరూ అదొక లగ్జరీ విషయంగా భావించేవారు. కానీ, ప్రస్తుతం మారుతున్న జీవనవిధానం, కుటుంబ పరిస్థితుల దృష్ట్యా కారు అనేది అవసరంగా మారిపోయింది. మధ్యతరగతి వాళ్లు కూడా వారి ఆర్థిక పరిస్థితికి తగ్గట్లు కారును కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కారు కొనే సమయంలో వారి బడ్జెట్ కి తగ్గట్లు ఉన్న కారును కొనుగోలు చేయడం ఎంత ముఖ్యమో.. అది వారికి ఏ మేరకు ఉపయోగపడుతుంది? పర్స్ మీద భారం పడకుండా ఉంటుందా లేదా? అసలు ఎలాంటి కారు మనకు సెట్ అవుతుంది? అనే విషయాలపై ఒక అవగాహన ఉండాలి. ఒకవేళ అలాంటి అవగాహన లేనివారి కోసం.. ఈ ఆర్టికల్ లో ప్రస్తుతం మార్కెట్ లో రూ.5 లక్షలలోపు ఉన్న బడ్జెట్, బెస్ట్ కార్ల గురించి వివరిస్తాం.

మారుతీ సుజుకి ఆల్టో K10:

బడ్జెట్ కార్లు అనగానే అందరికీ ముందుగా మారుతీ సుజుకీ బ్రాండ్ మాత్రమే గుర్తొస్తుంది. నిజానికి మీకు బడ్జెట్ కారు కావాలి అంటే.. తక్కువ మెయిన్టినెన్స్ తో మారుతీ సుజుకీ నుంచి లభిస్తుంది. అతి తక్కువ ధరలో మీకు మారుతీ సుజుకీ నుంచి కారు కావాలి అంటే.. ఆల్టో K10 మోడల్ అందుబాటులో ఉంది. ఈ మోడల్ ఎక్స్ షో రూమ్ ధర రూ.3.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇందులో మొత్తం 7 వేరియంట్స్ ఉన్నాయి. వేరియంట్ మారుతున్న కొద్దీ ధర కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర గరిష్టంగా రూ.5.96 లక్షల వరకు ఉంటుంది. సిటీ మారుతున్న కొద్దీ ఈ ధర తగ్గచ్చు, పెరగచ్చు. ఈ 5 సీటర్ మోడల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 998 సీసీ ఇంజిన్ తో వస్తోంది. ఇందులో పెట్రోల్, CNG ఆప్షన్స్ ఉన్నాయి. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్స్ తో అందుబాటులో ఉంది. గ్లోబల్ ఎన్ క్యాప్ సేఫ్టీ రేటింగ్ లో ఈ కారుకు 2 స్టార్ రేటింగ్ దక్కింది. ఇంక మైలేజ్ విషయానికి వస్తే.. లీటరుకు 24 కిలోమీటర్ల నుంచి 33 కిలోమీటర్ల వరకు వస్తుందంటూ కంపెనీ చెబుతోంది.

మారుతీ సుజుకీ S- ప్రెసో:

ఆల్టో k10తో పోలిస్తే.. ఎస్ ప్రెసో ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. దానికి తగినట్లుగానే ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ కూడా పెరుగుతాయి. ఈ కారు ఎక్స్ షో రూమ్ ధర రూ.4.27 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇందులో మొత్తం 8 వేరియంట్స్ ఉన్నాయి. వేరియంట్ మారే కొద్దీ ధర కూడా పెరుగుతూ ఉంటుంది. ఇందులో టాప్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ.6.12 లక్షలుగా ఉంది. ఇది 4 సీటర్, 5 సీటర్లలో అవైలబుల్ ఉంది. 998 సీసీ ఇంజిన్ తో వస్తోంది. ఫ్యూయల్ విషయానికి వస్తే.. CNG, పెట్రోల్ వేరియంట్స్ లో ఈ కారు అందుబాటులో ఉంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంక మైలేజ్ విషయానికి వస్తే.. లీటరుకు 24 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 32 కిలోమీటర్ల వరకు ఇస్తుందని కంపెనీ క్లయిమ్ చేస్తోంది. అయితే గ్లోబల్ ఎన్ క్యాప్ సేఫ్టీ రేటింగ్ లో మాత్రం జీరో స్టార్స్ ఉండటం కాస్త మైనస్ పాయింట్ అని చెప్పాలి.

రెనాల్ట్ క్విడ్:

రెనాల్ట్ కంపెనీకి భారత వినియోగదారులో మంచి ఆదరణ ఉంది. కానీ, ఈ కంపెనీ మంచి మోడల్స్ తో ఇంప్రెస్ చేయడంలో కాస్త వెనకబడింది అనే చెప్పాలి. ఇంక రెనాల్ట్ కంపెనీ నుంచి బడ్జెట్ కార్స్ లో క్విడ్ అందుబాటులో ఉంది. ఈ మోడల్ బాగా క్లిక్ అయిన మోడల్ గా చెప్పాలి. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.4.70 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారులో మొత్తం 11 వేరియంట్స్ ఉన్నాయి. వేరియంట్ మారే కొద్దీ ధర పెరుగుతూ ఉంటుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర గరిష్టంగా రూ.6.45 లక్షల వరకూ ఉంటుంది. ఈ రెనాల్ట్ క్విడ్ 5 సీటర్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 999 సీసీ ఇంజిన్ తో వస్తోంది. ఇందులో ఫ్యూయల్ టైప్ పెట్రోల్ మాత్రమే ఉంటుంది. ట్రాన్స్ మిషన్ మాత్రం మాన్యువల్, ఆటోమేటిక్ లో ఉందుబాటులో ఉంది. మైలేజ్ విషయానికి వస్తే లీటరుకు 21.7 కిలోమీటర్ల నుంచి 22 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ క్లయిమ్ చేస్తోంది. గ్లోబల్ ఎన్ క్యాప్ సేఫ్టీ రేటింగ్ లో ఈ రెనాల్ట్ క్విడ్ కారుకు సింగిల్ స్టార్ రేటింగ్ దక్కింది. మరి.. ఈ మూడు కార్లలో మీకు ఏ కారు నచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments