iDreamPost

సామాన్యులకు గుడ్‌న్యూస్.. తగ్గిన టమాటా ధర, కేజీ ఎంతంటే..

  • Published Aug 08, 2023 | 9:18 AMUpdated Aug 08, 2023 | 9:18 AM
  • Published Aug 08, 2023 | 9:18 AMUpdated Aug 08, 2023 | 9:18 AM
సామాన్యులకు గుడ్‌న్యూస్.. తగ్గిన టమాటా ధర, కేజీ ఎంతంటే..

ఈ ఏడాది టమాటా ధర జనాల చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కిలో ధర ఏకంగా 250 రూపాయల వరకు కూడా చేరుకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని రోజుల్లో టమాటా ధర డబుల్, ట్రిపుల్ సెంచరీ కూడా దాటాయి. చికెన్‌, యాపిల్‌ ధరలతో సమానంగా టమాటా ధరలు పెరిగి.. జనాలను భయపెట్టాయి. చాలా రోజుల పాటు జనాలు టమాటాలు కొనడం మానేశారు. ఒకవేళ వాడాల్సి వచ్చినా.. చాలా తక్కువగా వినియోగించారు. టమాటా లేక కూరలు రుచి కూడా ఉండటం లేదు.. ధర ఎప్పుడు దిగి వస్తుందా.. తనివితీరా టమాటా కూర తిందాం అని ఎదురు చూస్తున్వారు చాలా మంది ఉన్నారు. టమాటా తినాలని భావించే వారికి శుభవార్త.

టమాటా ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. మెున్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో డబుల్ సెంచరీకి చేరువగా ఉన్న టమాటా ధర ఒక్కసారిగా సగానికి సగం పడిపోయింది. తగ్గిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రైతు బజార్లలో కేజీ టమాటా. రూ. 63కు విక్రయిస్తున్నారు. ఇక బయట మార్కెట్‌లో నాణ్యతను బట్టి కేజీ రూ. 100 నుంచి రూ. 140 వరకు అమ్ముతున్నారు. నగరానికి టమాటా రాక పెరగటంతో ధరలు దిగి వస్తున్నాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. మెున్నటి వరకు హైదరాబాద్ నగరానికి రోజుకు 850 క్వింటాళ్ల టమాటాలు మాత్రమే వస్తుండగా.. సోమవారం ఒక్కరోజే హైదరాబాద్‌కు 2,450 క్వింటాళ్ల సరుకు హోల్‌సేల్ మార్కెట్‌కు వచ్చింది.

అలానే పొరుగున ఉన్న కర్ణాటక, చిత్తూరు, అనంతపురంతో పాటు.. నవాబ్‌పేట, మెదక్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, చేవెళ్ల జిల్లాల నుంచి పెద్ద మెుత్తంలో టమాటాలు హైదరాబాద్‌ మార్కెట్‌కు వస్తున్నాయి. దాంతో నగరంలో ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి అని వ్యాపారులు చెబుతున్నారు. ఈ నెలాఖరుకు వరకు కిలో టమాట రూ.50 లోపు దొరికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు స్థానిక వ్యాపారులు.

ఏపీలో కూడా దిగి వస్తోన్న ధర..

ఇక ఏపీలో కూడా ఆదివారం నుంచి టమాటా ధరలు భారీగా దిగి వస్తున్నాయి. కేజీ ధర 65-100 రూపాయలకు పడిపోయింది. వాస్తవానికి టమాటా ధర కేజీ మీద 300 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని భావిస్తుండగా.. ఉన్నట్లుండి ధర భారీగా పడిపోవడంతో జనాలు సంతోషంగా ఉండగా.. రైతులు మాత్రం రేటు తగ్గడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి