Krishna Kowshik
దసరా పండుగ వస్తుంది కదా అని చుట్టాలను పిలిచేసి గారెలు, బూరెలు వండుదామని ప్రిపేర్ అవుతున్నారా..? అయితే భారీ షాకులు ఇస్తున్నాయి కూరగాయలు, నిత్యావసర సరుకులు
దసరా పండుగ వస్తుంది కదా అని చుట్టాలను పిలిచేసి గారెలు, బూరెలు వండుదామని ప్రిపేర్ అవుతున్నారా..? అయితే భారీ షాకులు ఇస్తున్నాయి కూరగాయలు, నిత్యావసర సరుకులు
Krishna Kowshik
దసరా పండుగ వస్తుంది. సరుకులు తెచ్చుకోవాలని షాపింగ్‌కు ప్రిపేర్ అవుతున్నారా.? చుట్టాలు వస్తున్నారు గారెలు, బూరెలు వంటి ఆతిధ్యం ఇద్దామనుకుంటున్నారా..? భారీ ఆర్థిక అంచనాలు వేసుకుంటున్నారా.? అయితే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. ‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు’లా ఉంది ప్రస్తుత పరిస్థితి. షాకుల మీద షాకులిస్తున్నాయి కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు. ఒకదానితో మరొటీ పోటీ పడి సామాన్యుల కడుపుకు కోత పెడుతున్నాయి. ఇప్పటికే కూరగాయల ధరలు పెరిగి, గాయాలు చేస్తుంటే.. మరో వైపు నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. ఉల్లి అమాంతం పెరిగి కొయ్యకుండానే.. కొంటుంటేనే కన్నీళ్లు తెప్పిస్తుంది. ఇక వెల్లుల్లి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చుక్కలు చూపిస్తోంది. ఈ తరుణంలోనే సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయాయి.
రెంట్, కరెంట్ కష్టాలు, ఇతర ఖర్చులు బేరీజు వేసుకుని దసరా పండుగ భారీగా ప్లాన్ చేసుకుందామనుకుంటే.. సామాన్యులకు మరింత భారంగా మారాయి నిత్యావసర సరుకులు. గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వచ్చే జీతం మొత్తం ఖర్చులకే సరిపోయేట్టు కనిపిస్తుంది. ఉప్పు, పప్పు ధరలకు రెక్కలు వచ్చాయి. ఇప్పటి వరకు కేజీ కందిపప్పు రూ. 150 ఉండగా.. రూ. 175కి పెరిగింది. ఇక పెసరపప్పు కూడా అదే బాటలో నడుస్తోంది. 135 రూపాయలు ఉన్న పెసర పప్పు.. 150 రూపాయలకు చేరింది. మీ ఇద్దరు పెరిగితే..నేనేమన్నా తక్కువ తిన్నానా అంటోంది మినపప్పు. అదీ కూడా సుమారు రూ.135కి పెరిగింది. అలాగే లీటర్ నూనె ప్యాకెట్‌పై కూడా రూ. 20 నుండి రూ. 50 వరకు ధరలు పెరిగాయి. ఇవే కాదు.. ఇతర సరుకులకు కూడా రెక్కలు వచ్చాయి. దీంతో చుట్టాల సంగతి దేవుడు ఎరుగు.. నెలంతా ఇల్లు గడపడమే కష్టమైన పరిస్థితి.
పోనీ కూరగాయలతో సరిపెడదామంటా అవి కూడా ఆ దారిలోనే నడుస్తున్నాయి. మొన్నటి వరకు వందకు నాలుగు కేజీల ఉల్లిపాయలు వస్తుంటే.. ఇప్పుడు రెండు కిలోలు రావడం కూడా కష్టంగా మారింది. వంద లేదా రెండొందలో తీసుకెళితే.. వారానికి సరిపడా కూరగాయలు, సంచినిండా వచ్చేవి. ఇప్పుడు బ్యాగ్ సగం కూడా నిండటం లేదు. వంకాయ, బెండకాయ, కాకరకాయ, చివరకు సొరకాయ ధర కూడా అమాంతం పెరిగింది. సొరకాయ రూ. 30 నుండి 40 రూపాయలు పలుకుతుంది. అల్లం కిలో 150కి పెరిగింది. ఇక వెల్లుల్లి డబుల్ అయ్యింది. సుమారు కేజీ 350 రూపాయలు పలుకుతోంది. ఎండు మిర్చి రూ. 200కు చేరింది. దీంతో బెంబేలెత్తిపోతున్నారు సామాన్యులు. పండగ సంగతి పక్కన పెడితే.. వండలేని, కడుపు నిండా తినలేని, పరిస్థితి. పోనీ పచ్చడి మెతుకులతో సరిపెడదామంటే.. మిర్చి రేటు కూడా ఘాటుగా ఉంది. ఇక ఆహా నా పెళ్లంట సినిమాలో కోటాశ్రీనివాసరావులా కోడిని వేలాడదీసి.. కడుపునింపుకోవాలేమో బహుశా. ఇలా రేట్లు పెరిగితే సగటు మానవుడి పరిస్థితి ఏంటంటారు?