iDreamPost
android-app
ios-app

జొమాటో, స్విగ్గీలకు కేంద్రం ఝలక్‌.. రూ.750 కోట్లు కట్టాలంటూ నోటీసులు

  • Published Nov 23, 2023 | 12:31 PM Updated Updated Nov 23, 2023 | 12:31 PM

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీలకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. ఏకంగా 750 కోట్ల రూపాయలు కట్టాలంటూ నోటీసులు జారీ చేసింది. ఆ వివరాలు..

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీలకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. ఏకంగా 750 కోట్ల రూపాయలు కట్టాలంటూ నోటీసులు జారీ చేసింది. ఆ వివరాలు..

  • Published Nov 23, 2023 | 12:31 PMUpdated Nov 23, 2023 | 12:31 PM
జొమాటో, స్విగ్గీలకు కేంద్రం ఝలక్‌.. రూ.750 కోట్లు కట్టాలంటూ నోటీసులు

నేటి డిజిటల్‌ యుగంలో ప్రతిదీ ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. తినే తిండి దగ్గర నుంచి కట్టుకునే బట్టల వరకు ప్రతి దాన్ని ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. గత కొన్నేళ్ల నుంచి మన దేశంలో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ వ్యాపారం విపరీతంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ వ్యాపారంలో జొమాటో, స్విగ్గీలు అగ్రస్థానంలో ఉన్నాయి. కరోనా సమయంలో కాస్త మందగించినా.. ఆ తర్వాత భారీగా పుంజుకున్నాయి. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ మార్కెట్‌లో ఈ రెండు కంపెనీల వాటానే అధికంగా ఉంది అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు.

ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం.. జొమాటో, స్విగ్గీలకు భారీ షాక్‌ ఇచ్చింది. నేషనల్‌ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ఈ రెండు కంపెనీలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ కథనాల ప్రకారం.. జొమాటో, స్విగ్గీలు భారీగా జీఎస్‌టీ బకాయిలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ రెండు సంస్థలు కలిసి సుమారు 750 కోట్ల మేర జీఎస్‌టీ బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని చెల్లించాలంటూ తాజాగా డీజీజీఐ రెండు కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. దీని ప్రకారం జొమాటోకు సుమారు రూ.350 కోట్లు విలువై జీఎస్‌టీ బకాయి పడగా.. మరో దిగ్గజ సంస్థ స్విగ్గీకి రూ.400 కోట్లు విలువైన జీఎస్‌టీ బకాయిలు ఉన్నట్లు నోటీసుల్లో పేర్కొంది. ఫుడ్ డెలివరీ అనేది ఒక సేవ అనగా సర్వీస్‌ కాబట్టి దాని ట్యాక్స్ స్లాబ్‌కు తగినట్లుగా జొమాటో, స్విగ్గీలు జీఎస్‌టీ చెల్లించాలని డీజీజీఐ తెలిపింది.

పైగా ఈ రెండు సంస్థలు డెలివరీ ఫీ పేరుతో కస్టమర్ల నుంచి కొంత డబ్బు వసూలు చేస్తాయానే సంగతి తెలిసిందే. ఈ డెలివరీ ఛార్జీ అనేది కస్టమర్లకు ఆహారాన్ని అందించినందుకు గాను డెలివరీ భాగస్వాములకు చెల్లించే రుసుము. ఫుడ్‌ డెలివరీ సంస్థలు.. డెలివరీ చార్జీల మొత్తాన్ని కస్టమర్ల దగ్గర నుంచి వసూలు చేసి డెలివరీ బాయ్స్‌కు అందిస్తాయనే సంగతి తెలిసిందే. జొమాటో, స్విగ్గీలు ఇలా డెలివరీ చార్జీలు వసూలు చేస్తోన్న నేపథ్యంలో జీఎస్‌టీ చెల్లించాలని డీజీజీఐ తెలిపింది. అయితే దీనిపై కొందరు అధికారులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

డీజీజీఐ ప్రకారం.. ఈ రెండు సంస్థలు జులై, 2017 నుంచి మార్చి, 2023 వరకు సంబంధించిన జీఎస్‌టీని చెల్లించాల్సి ఉంది. ఈ విలువ మొత్తంగా రూ.750 కోట్లుగా ఉన్నట్లు ఓ నివేదిక పేర్కొంది. జీఎస్‌టీ బకాయిలపై ఈ రెండు సంస్థలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి. ఇక 2022 ఏడాదిలో జొమాటో, స్విగ్గీలు తమ ఆర్డర్లపై 5 శాతం రేటుతో ట్యాక్స్ వసూలు చేసి జమ చేయాలనే నిబంధనలు తీసుకువచ్చాయి. అయితే అంతకు ముందు కేవలం జీఎస్‌టీ కింద నమోదైన రెస్టారెంట్లు మాత్రమే పన్ను వసూలు చేసి జమ చేసేవి. గత నెలలో స్విగ్గీ ఫుడ్ ఆర్డర్లు ప్లాట్‌ఫామ్ ఛార్జీ రూ.2 నుంచి రూ.3కి పెంచింది. ఈ అంశంపై జొమాటో, స్విగ్గీలు ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.