iDreamPost
android-app
ios-app

స్టార్‌ గుర్తు ఉన్న నోట్లు చెల్లవంటూ ప్రచారం.. RBI క్లారిటీ

  • Published Jul 28, 2023 | 1:56 PM Updated Updated Jul 28, 2023 | 1:56 PM
  • Published Jul 28, 2023 | 1:56 PMUpdated Jul 28, 2023 | 1:56 PM
స్టార్‌ గుర్తు ఉన్న నోట్లు చెల్లవంటూ ప్రచారం.. RBI క్లారిటీ

సోషల్‌ మీడియా వినియోగం పెరిగాక.. తప్పుడు వార్తల ప్రవాహం కూడా విపరీతంగా పెరిగింది. సోషల్‌ మీడియాలో ఏదైనా సమాచారం కనిపిస్తే చాలు.. వెనకా,ముందు ఏమాత్రం ఆలోచించకుండా.. వాస్తవమో కాదో తెలుసుకోకుండా.. ఎడాపెడా దాన్ని షేర్‌ చేసి.. జనాలను భయభ్రాంతులకు గురి చేస్తారు. ఆఖరికి ప్రభుత్వం, సంబంధిత శాఖ వారు.. తెర మీదకు వచ్చి.. అదంతా తప్పుడు ప్రచారం అని క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఇక ఈ మధ్య కాలంలో ఈ తరహా వార్త ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. కరెన్సీ నోట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అర్ధం కాక జనాలకు పిచ్చెక్కుతుంటుంది. దీనికి తోడు కొందరు వ్యక్తులు కరెన్సీ నోట్లకు సంబంధించి.. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుండటంతో.. జనాలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా స్టార్‌ గుర్తు ఉన్న కరెన్సీ నోట్లు చెల్లవంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది.

కరెన్సీ నోట్లపై స్టార్‌ (*) సింబల్‌ ఉండడంపై ఇటీవల సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. స్టార్ గుర్తు ఉన్న నోట్లు నకిలీవి అంటూ పలువురు పోస్టులు పెట్టడం వైరల్‌గా మారింది.  స్టార్​ (*) గుర్తు ఉన్న కరెన్సీ నోట్లు చెల్లవంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. దాంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పందిస్తూ.. స్టార్‌ గుర్తు ఉన్న నోట్లన్ని కూడా చట్టబద్ధమైనవే అని.. మిగతా నోట్ల లాగే అవి కూడా సమాన హోదాను కలిగి ఉంటాయని స్పష్టం చేసింది.  నక్షత్రం గుర్తు ఉన్న నోట్లు నకిలీవి కావని, అవి కూడా ఆర్‌బీఐ జారీ చేసినవేనని తెలిపింది. ఇతర చట్టపరమైన నోట్లలానే ఇవి కూడా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.

ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్లన్నంటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే జారీ చేస్తుంది. ఆర్బీఐ ముద్రించే ఈ నోట్ల మీద సీరియల్‌ నంబర్‌ ముద్రించి ఉంటుంది. కానీ, ఇటీవల కాలంలో కొన్ని నోట్లపై స్టార్‌ గుర్తు ముద్రించి వస్తున్నాయి. ఇది గమనించిన కొందరు.. ఇవి నకిలీ నోట్లంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల ఈ అంశం తెర మీదకు వచ్చింది. ఇలా స్టార్‌ గుర్తు ఉన్న నోట్లు నకిలీవంటూ ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఈ స్టార్‌ గుర్తు ఉన్న నోట్లపై క్లారిటీ ఇచ్చింది. ప్రిఫిక్స్‌, సీరియల్‌ నంబర్‌ మధ్య ఈ స్టార్‌ గుర్తు ఉంటుందని ఆర్బీఐ వివరించింది.

రీప్లేస్‌ చేసిన, పునర్‌ ముద్రించిన నోట్లు ఇలా స్టార్‌ గుర్తుతో వస్తాయని ఆర్‌బీఐ స్పష్టతనిచ్చింది. వాటిని సులువుగా గుర్తించానికే ఈ స్టార్‌ సింబల్‌ను ముద్రిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు సోషల్‌ మీడియాలో స్టార్‌ గుర్తు కరెన్సీ నోట్ల మీద జరుగుతున్న ఫేక్​ న్యూస్​ ప్రచారం పట్ల ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో సైతం స్పందించింది. అవేవీ నకిలీ నోట్లు కాదని.. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం పట్ల భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు చెప్పింది. అంతకుముందు 2016లో ఆర్‌బీఐ జారీ చేసిన రూ. 500 నోట్లపై కూడా స్టార్‌ సింబల్‌ ఉందని గుర్తుచేసింది.