iDreamPost
android-app
ios-app

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. రూ.50 లక్షల వరకు లోన్‌.. పూర్తి వివరాలు ఇవే!

  • Published Jul 12, 2023 | 1:59 PM Updated Updated Jul 12, 2023 | 1:59 PM
  • Published Jul 12, 2023 | 1:59 PMUpdated Jul 12, 2023 | 1:59 PM
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. రూ.50 లక్షల వరకు లోన్‌.. పూర్తి వివరాలు ఇవే!

దేశంలోని పట్ట భద్రులందరికి ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పించాలంటే.. అసంభవం. అందుకే ప్రైవేట్‌ సెక్టార్‌ను కూడా ప్రోత్సాహిస్తాయి ప్రభుత్వాలు. అయితే చదువు పూర్తి చేసుకుని.. సమాజంలోకి అడుగు పెట్టిన వెంటనే వారందరికి ఉద్యోగాలు దొరకడం అనేది కల్ల. దేశంలో ప్రతి ఏటా డిగ్రీ పట్టా పుచ్చుకుని బయటకు అడుగుపెడుతున్న వారు లక్షల మంది ఉన్నారు. వారందరికి సరిపడా ఉద్యోగాలు సిద్ధంగా లేవు. దాంతో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. అలానే చదువుకున్న ప్రతి ఒక్కరు ఉద్యోగమే చేయాల్సిన పని లేదు. చిన్న వ్యాపారం ప్రారంభించి తనతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించవచ్చు. అయితే వ్యాపారం చేయడం అంటే మాటల్లో చెప్పినంత సులువు కాదు. ముందు వ్యాపారం చేయాలంటే చేతిలో ఎంతో కొంత పెట్టుబడి ఉండాలి. అదిగో అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం(పీఎంఈజీపీ) ద్వారా నిరుద్యోగులకు 50 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తోంది. మరి ఆ పథకం వివరాలు.. అర్హులు ఎవరు అంటే..

ఈ పథకం ప్రధాన ఉద్దేశం.. గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో స్వ‌యం ఉపాధి ప‌థ‌కాలు, ప్రాజెక్టులు, సూక్ష్మ‌, చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసి.. వాటి ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించి వారికి ఆర్థిక స్వావ‌లంబన చేకూర్చ‌డం. అయితే గతంలో ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్ర‌ధాన‌మంత్రి రోజ్‌గార్ యోజ‌న‌, గ్రామీణ ఉపాధి క‌ల్ప‌న ప‌థ‌కం అనే రెండు ర‌కాల ప‌థ‌కాల‌ను నిర్వహించేది. ఆ తర్వాత కాలంలో ఆ రెండింటిని కలిపి.. ప్ర‌ధాన‌మంత్రి ఉపాధి క‌ల్ప‌న ప‌థ‌కం ప్రారంభించింది. కేంద్ర ప్ర‌భుత్వంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఖాదీ, గ్రామీణ ప‌రిశ్ర‌మ‌ల క‌మిష‌న్ (కేవీఐసీ) ద్వారా ఈ ప‌థ‌కం అమ‌ల‌వుతోంది.

ఈ పథకం కింద కేవలం కొత్త‌గా ఏర్పాటు చేసే చిన్న‌, సూక్ష్మ‌, కుటీర ప‌రిశ్ర‌మ‌ల యూనిట్ల మొద‌లు మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ స్థాయి వ‌ర‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి రుణం అంద‌జేస్తారు. ఇప్ప‌టికే ఏర్పాటు చేసిన పాత యూనిట్ల విస్త‌ర‌ణ‌కు, వాటి న‌వీక‌ర‌ణకు ఈ పథకం కింద రుణం ఇవ్వరు. అలాగే.. నెగిటివ్ ప‌రిశ్ర‌మ‌ల జాబితాలో ఉన్న‌వాటికి కూడా ఈ ప‌థ‌కం వ‌ర్తించ‌దు. ఈ పథకాన్ని 2026 వరకు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2021-2022 నుంచి 2025-2026 మధ్య కాలంలో ఈ పథకం అమలుకు 15వ ఆర్థిక సంఘం ఏకంగా రూ.13,554.42 కోట్లు కేటాయించింది.

ఎంత రుణం ఇస్తారంటే..

మీరు పెట్టబోయే కొత్త తయారీ యూనిట్‌కు లక్ష రూపాయల నుంచి రూ. 50 లక్షల వరకు రుణం ఇస్తారు. సర్వీసు యూనిట్లకయితే ఈ పథకం కింద సుమారు 20 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తారు. గతంలో ఈ పథకం కింద అందించే రుణ సదుపాయం గరిష్ఠంగా 25 లక్షల వరకు మాత్రమే ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ప్రోత్సాహం అందివ్వాలనే ఉద్దేశంతో రుణ పరిమితిని 50 లక్షల రూపాయల వరకు పెంచింది.

మనం ఎంత పెట్టుబడి పెట్టాలి..

ఈ పథకం కింద రుణం లభించాలంటే ముందుగా మనం ఎంతో కొంత పెట్టుబడి పెట్టాలి. ఇక్కడ కూడా సామాజిక వర్గాల వారిగీ ఈ పెట్టుబడి మొత్తం మారుతుంటుంది. ఈ పథకం కింద రుణం పొందాలనుకుంటే.. జనరల్ కేటగిరీ వ్యక్తులు తాము ఏర్పాటు చేయబోయే యూనిట్‌కు సంబంధించి మొత్తం వ్యయంలో 10 శాతం పెట్టుబడి భరించాల్సి ఉంటుంది. ఇక.. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు చెందిన లబ్ధిదారులు ప్రాజెక్టు వ్యయంలో 5 శాతం సొంత వనరులుగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే జనరల్‌ కేటగిరీ లబ్ధిదారులకు ప్రాజెక్టు వ్యయంలో 90 శాతం మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణం కింద అందజేస్తారు. అలానే వెనుకబడిన వర్గాలకు చెందిన లబ్ధిదారులకు అయితే ఈ పథకం కింద 95 శాతం మొత్తాన్ని రుణంగా మంజూరు చేస్తారు.

రుణంలో సబ్సిడీ ఇస్తారా..

ఈ పథకం కింద రుణం కోసం అప్లై చేసే దరఖాస్తుదారులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, ట్రాన్స్ జెండర్లు, శారీరక వైకల్యం కలిగిన వారై.. అందులోనూ వారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేస్తున్నట్లయితే వాటికి గరిష్ఠంగా 35 శాతం రాయితీ ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు 25 శాతం రాయితీ ఉంటుంది. అలానే ఈ పథకం కింద జనరల్ కేటగిరీ అభ్యర్థులకూ రుణంలో సబ్సీడీ సదుపాయం ఉంటుంది. అయితే ఈ కేటగిరీ గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోయే యూనిట్‌కు అయితే 25 శాతం వరకు సబ్సిడీ, పట్టణ ప్రాంతాల్లో వాటికి 15శాతం వరకు సబ్సిడీ కల్పిస్తారు.

ఎలా అప్లై చేయాలి..

ఈ పథకం కింద రుణం పొందాలంటే.. ముందుగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అయితే ప్రాజెక్టు ఏర్పాటును మాత్రం అధికారులు భౌతికంగా తనిఖీ చేసి పరిశీలన చేస్తారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు https://kviconline.gov.in/ క్లిక్‌ చేసి పీఎంఈజీపీ పోర్టల్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత అప్లికేషన్‌ ఫామ్‌ను ఎంచుకోవాలి. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులైతే కేవీఐసీకి, పట్టణ నిరుద్యోగులైతే డీఐసీలో వివరాలను నమోదు చేయాలి. అనంతరం దరఖాస్తు ఫారాన్ని ప్రింట్‌ తీసుకోవాలి.

ఆ తర్వాత ఈ వెబ్‌సైట్‌కు వెళ్లి అక్కడ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఈ సైటులో లాగిన్ అవడం కోసం ముందుగా మీరు మీ కోసం ప్రత్యేకంగా ఒక యూజర్ ఐడీ, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తులో అడిగిన వివరాలన్నీ నింపాలి. దరఖాస్తు చేసిన వెంటనే 10 నుంచి 15 రోజుల వ్యవధిలో అధికారుల నుంచి స్పందన వస్తుంది. ఆ తర్వాత మీ ప్రాజెక్ట్‌కు నిధుల మంజూరుకు సంబంధించి పనులు ప్రారంభమవుతాయి.

శిక్షణ పూర్తి చేస్తేనే లోన్‌ ఇస్తారు..

పీఎంఈజీపీ పథకానికి మీరు దరఖాస్తు చేసుకున్న వెంటనే నిధులు మంజూరు చేయరు. మొదట మీరు ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీకు సుమారు నెల రోజుల పాటు ట్రైనింగ్‌ ఇస్తుంది. ఈ శిక్షణ ఆన్‌లైన్,ఆఫ్‌లైన్‌లో ఉండొచ్చు. ఈ శిక్షణ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. దరఖాస్తు చేసుకోకముందే కూడా ఈ శిక్షణ పూర్తి చేసుకుని తరువాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలేంటి అంటే..

  • 18 సంవత్సరాల వయసు నిండిన వారంతా ఈ పథకానికి అర్హులే.
  • ఈ పథకం కింద లోన్‌ పొందాలంటే కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
  • స్వయం సహాయక బృందాలు (ఏ ఇతర పథకాల కింద ప్రయోజనాలు పొందని బిపిఎల్‌కు చెందిన వారితో కలిపి)కూడా ఈ పథకానికి అర్హులే.
  • వ్యక్తి, తన భార్య/భర్త కలిపి) ఒక కుటుంబం నుండి ఒక వ్యక్తి మాత్రమే అర్హుడు.