iDreamPost
android-app
ios-app

కేంద్రం అద్భుత స్కీమ్‌.. ఏ గ్యారెంటీ లేకుండానే 3 లక్షల లోన్‌

  • Published Sep 28, 2023 | 6:29 PM Updated Updated Sep 28, 2023 | 6:29 PM
  • Published Sep 28, 2023 | 6:29 PMUpdated Sep 28, 2023 | 6:29 PM
కేంద్రం అద్భుత స్కీమ్‌.. ఏ గ్యారెంటీ లేకుండానే 3 లక్షల లోన్‌

పేదలు, బడుగు బలహీన వర్గాల వారిని ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను తీసుకువస్తుంటుంది. విద్యార్థులు మొదలు.. మహిళల వరకు.. వారికి చేయూత అందించడం కోసం అనేక స్కీమ్‌లను ప్రవేశపెట్టింది. అలాంటి ఓ పథకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి గ్యారెంటీ లేకుండానే.. అతి తక్కువ వడ్డీతో లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఈ పథకం ప్రారంభించి కేవలం 10 రోజులే అవుతున్నా.. ఇప్పటికే 1.40 లక్షల మంది దీని కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంతకు ఏంటీ పథకం.. దాని పూర్తి వివరాలు..

ప్రధాని నరేంద్ర మోదీ పది రోజుల క్రితం అనగా సెప్టెంబర్‌ 17న చేతి వృత్తులు, కుల వృత్తుల వారిని ఆదుకోవడం కోసం.. విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలసిందే. చేతి వృత్తులు, కుల వృత్తుల వాళ్ల సామర్థ్యాలను మెరుగుపర్చడం, వారు తయారు చేసిన ఉత్పత్తులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ స్కీమ్‌ కింద మొత్తం 18 విభాగాల చేతివృత్తుల పని వారు, కళాకారులకు లబ్ధి చేకూరుస్తారు.

అయితే ఈ పథకానికి ప్రజల నుంచి భారీ ఎత్తున ఆదరణ లభిస్తుంది అన్నారు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణె. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సెప్టెంబర్ 17న ఈ స్కీమ్‌ను ప్రారంభించగా.. కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఏకంగా 1.40 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇంత భారీ సంఖ్యలో అప్లికేషన్లు రావడం అనేది.. ఈ స్కీం విజయానికి నిదర్శనం’’ అని తెలిపారు.

విశ్వకర్మ స్కీం పూర్తి వివరాలు..

చేతి వృత్తులు, కుల వృత్తుల వారిని ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం.. పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించింది. ఇందుకోసం.. రాబోయే ఐదేళ్ల కాలానికిగాను రూ. 13 వేల కోట్లు కేటాయించింది కేంద్రం. దీనిలో భాగంగా చేతివృత్తుల వారి పరికరాల కోసం తొలుత.. రూ. 15 వేలు సాయంగా అందిస్తారు. వారి వారి వృత్తుల్లో నైపుణ్యం పెంచుకునేందుకు వారికి శిక్షణ కూడా ఇస్తుంది. ఇలా ట్రైనింగ్‌ తీసుకునే వారికి రూ. 500 స్టైఫండ్ కూడా ఇస్తుంది. శిక్షణ తర్వాత వడ్డీ రాయితీతో బ్యాంక్ లోన్ కూడా ఇస్తుంది కేంద్రం.

వీరు తొలుత 5 శాతం వడ్డీకే రూ. లక్ష రుణం పొందవచ్చు. మిగతా 8 శాతం వడ్డీని కేంద్రం భరిస్తుంది. ఇలా పొందిన రుణాన్ని.. 18 నెలల్లోగా చెల్లించాలి. తొలి విడత లభించిన లోన్‌ని సద్వినియోగం చేసుకుంటే రెండో విడతలో భాగంగా రూ. 2 లక్షల లోన్ వస్తుంది. దీనిని 30 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీంతో దాదాపు 30 లక్షల మంది చేతివృత్తుల వారికి కేంద్రం సాయం అందించబోతుంది.

దీనికి అప్లై చేసుకోవాలను వారు.. కామన్ సర్వీస్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్, క్యాస్ట్‌ సహా అవసరమైన ఇతర డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్కీం ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఐడీ కార్డు సహా సర్టిఫికెట్ కూడా ఇస్తుంది. వీరు తయారు చేసే వస్తువుల్ని ప్రమోట్ చేసి.. మార్కెటింగ్ చేసే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. వడ్రంగులు, క్షురకులు, సంప్రదాయ కళాకారులు, చేనేతకారులు, రజకులు, స్వర్ణకారులు, కమ్మరి, కుమ్మరి, తాపీ పనిచేసేవారు, దర్జీలు సహా మొత్తం 18 కులవృత్తుల వారు ఈ స్కీంకు అర్హులు.