iDreamPost
android-app
ios-app

గుడ్‌న్యూస్‌: గ్యాస్‌ సిలండర్‌పై రూ.300 తగ్గింపు! పథకం కొనసాగింపు!

  • Published Mar 30, 2024 | 2:26 PM Updated Updated Mar 30, 2024 | 2:26 PM

LPG Cylinder Price: ఏప్రిల్‌ నెల ప్రారంభంలోనే సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతోంది. గ్యాస్‌ సిలిండర్‌ ధరపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

LPG Cylinder Price: ఏప్రిల్‌ నెల ప్రారంభంలోనే సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతోంది. గ్యాస్‌ సిలిండర్‌ ధరపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

  • Published Mar 30, 2024 | 2:26 PMUpdated Mar 30, 2024 | 2:26 PM
గుడ్‌న్యూస్‌: గ్యాస్‌ సిలండర్‌పై రూ.300 తగ్గింపు! పథకం కొనసాగింపు!

పెరుగుతున్న నిత్యవసరాల ధరలు చూసి సామాన్యులు బెంబెలేత్తుతున్నారు. కూరగాయలు మొదలు వంట నూనె, గ్యాస్‌ సిలిండర్‌ ధరలు సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇంధన ధరలు అయితే పైపైకి దూసుకెళ్తున్నాయి తప్ప దిగి రావడం లేదు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం.. గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు ఊరట కలిగించిన సంగతి తెలిసిందే. గత ఏడాది రాఖీ, ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రం గ్యాస్‌ సిలిండర్‌ రేటును రెండు పర్యాయాలు తగ్గించింది. ఒకసారి 200 రూపాయలు, మరోసారి రూ.100 తగ్గించింది. అయితే ఇది కేవలం ఉజ్వల యోజన లబ్ధిదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పథకం కూడా ఈ ఏడాది మార్చి 31 వరకు మాత్రమే అమల్లో ఉండాలి. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఎంతో మేలు జరగనుంది. ఇంతకు ఆ నిర్ణయం ఏంటి అంటే..

ప్రతి ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఇక కొత్త ఫైనాన్సియల్‌ ఇయర్‌ ప్రారంభం అయిన మొదటి రోజు నుంచే అనేక కొత్త నియమ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఈ ఏడాది కూడా అనేక కొత్త రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. వీటిలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకానికి సంబంధించి కూడా కొత్త రూల్స్‌ అమలు కానున్నాయి. సాధారణంగా ఉజ్వల సబ్సిడీ మినహాయింపు మార్చి 31, 2024తో ముగియాల్సి ఉంది. అయితే కేంద్రం దీన్ని 2025, మార్చి 31 వరకు పొడిగించింది. దాంతో ఉజ్వల స్కీమ్‌ లబ్ధిదారులు 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా ఎల్‌పీజీ సిలిండర్‌ మీద 300 రూపాయల తగ్గింపును పొందుతారు. 2025, మార్చి 31 వరకు కూడా ఇది అమల్లో ఉంటుంది. ఏప్రిల్‌ 1, 2024 నుంచే ఇది దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది.

ఇక ఈ స్కీమ్ కింద లబ్ధిదారులు ఏడాదికి 12 సిలిండర్లు పొందేందుకు అర్హులు. దీని కింద 14.2 కిలోల ఒక్కో సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ అందించబడుతుంది. సబ్సిడీని నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ విధంగా ఉజ్వల లబ్ధిదారులకు సాధారణ వినియోగదారుల కంటే రూ.300 తక్కువ ధరకే సిలిండర్లు లభిస్తాయి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం చేసే వ్యయం రూ.12,000 కోట్లుగా ఉంది.

గ్రామీణ వెనుకబడిన పేద కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మే 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించింది. ఈ పథకంలో మార్చి 1, 2024 వరకు 10.27 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇక గతేడాది రాఖీ, ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ సిలిండర్‌ను రెండు పర్యాయాల్లో 300 రూపాయల మేర తగ్గించింది. ఫలితంగా ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో గృహ వినియోగాలకు వాడే సిలిండర్ ఇప్పుడు రూ.803కి అందుబాటులో ఉంది.