P Venkatesh
P Venkatesh
ప్రస్తుత రోజుల్లో చదువు పూర్తవ్వగానే ఉద్యోగం కోసం ఎదుచూసే వారు కొందరైతే, సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని మరికొందరు ఆలోచిస్తున్నారు. ఏదో ఒక బిజినెస్ ప్రారంభించి నలుగురికి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నారు. కానీ బిజినెస్ ప్రారంభించాలంటే అంత సులభమైన ప్రక్రియ కాదు. ఏ వ్యాపారం చేయాలన్నా మొదటగా కావాల్సింది పెట్టుబడి. సరైన పెట్టుబడి ఉండి మీకు దేనిపైన అవగాహన ఉందో ఆ రకమైన బిజినెస్ ను ప్రారంభిస్తే సక్సెస్ అవ్వడం అసాధ్యమేమీ కాదు. ఇలా సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్న వారికి ఓ పథకం ద్వారా ఎలాంటి హామీ లేకుండా రూ. 10 లక్షల వరకు లోన్ అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మరి ఆ పథకం ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి? ఆ వివరాలు మీకోసం..
సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నవారు పెట్టుబడి కోసం బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. కానీ బ్యాంకులు అంత సులువుగా లోన్ ఇవ్వవు. బ్యాంక్ నుంచి లోన్ పొందాలంటే మీరు చేయదల్చుకున్న బిజినెస్ వివరాలు, సంబంధిత డాక్యుమెంట్లు, గ్యారెంటీ వంటి ఇతర అంశాలను అడుగుతాయి. గ్యారెంటీ ఇచ్చే క్రమంలో ఆస్తులను కూడా తనఖా పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇలా అన్ని వివరాలు సరిచూసుకున్నాకే బ్యాంకులు లోన్ అందిస్తుంటాయి. అయితే కేంద్ర ప్రభుత్వం సొంతంగా బిజినెస్ చేయాలనుకునే వారిని ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకాన్ని 2015లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఎలాంటి హామీ లేకుండా సులువుగా రూ. 10 లక్షల వరకు లోన్ సొంతం చేసుకోవచ్చు.
కాగా ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం కింద ప్రభుత్వం ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు అందిస్తోంది. ఈ లోన్ పొందేందుకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించనక్కర్లేదు. అయితే ఆర్బీఐ నిర్ణయించిన 27 బ్యాంకుల్లో ఈ ముద్రా లోన్ ను పొందొచ్చు. ఆయా బ్యాంకులను సంప్రదించి మీరు ముద్రా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ముద్రా లోన్ పై బ్యాంకులు10 నుంచి 12 శాతం వడ్డీ రేటును విధిస్తాయి.
ముద్రా రుణాలు మూడు రకాలు
ప్రధాన మంత్రి ముద్రా రుణాలు మొత్తం మూడు రకాలుగా నిర్ణయించారు. వాటిలో మొదటి రకం శిశు రుణం అంటారు. మీరు మొదటి సారిగా మీ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ప్రభుత్వం మీకు ఎటువంటి హామీ లేకుండా రూ. 50,000 వరకు లోన్ ఇస్తుంది. ఇక రెండో రకం కిషోర్ లోన్.. దీని ద్వారా రూ. 50,000 నుంచి రూ. 5 లక్షల వరకు రుణం ఇస్తారు. మూడోది తరుణ్ లోన్.. దీని ద్వారా ప్రభుత్వం రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు లోన్ అందిస్తుంది.
ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకంలో 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. లోన్ అప్లికేషన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్లు ఆధార్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, అడ్రస్ ప్రూఫ్ మొదలైనవి. ఈ పథకం కోసం అప్లై చేయడానికి, mudra.org.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత ఫారమ్‌లో అడిగిన సమాచారాన్ని నమోదు చేసి, బిజినెస్ కు సంబంధించిన వివరాలతో కూడిన ఫైల్ ను సమీపంలోని బ్యాంకులో అందజేయాలి. ఆ తరువాత అన్ని డాక్యుమెంట్‌లను పరిశీలించిన అనంతరం బ్యాంక్ ముద్రా లోన్ ను అందజేస్తుంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ముద్రా యోజన పథకం ద్వారా లోన్ పొంది మీరు అనుకున్న బిజినెస్ ను ప్రారంభించుకోవచ్చు.