iDreamPost
android-app
ios-app

ఐటీ కంపెనీలకు ఏమైంది?.. టెకీలకు షాకిస్తున్న ఐటీ కంపెనీలు

ఐటీ కంపెనీలకు ఏమైంది?.. టెకీలకు షాకిస్తున్న ఐటీ కంపెనీలు

కరోనా మహమ్మారితో ప్రపంచమే తలక్రిందులైంది. దీని ప్రభావం అన్ని రంగాలతో పాటు ఐటీ రంగంపై కూడా పడింది. దీనికి తోడు వరల్డ్ వైడ్ గా చేసుకున్న మాంద్యం కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఐటీ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను ఉన్నఫలంగా తీసేశాయి. అదే సమయంలో నియామకాలు కూడా తగ్గిపోయాయి. ప్రముఖ ఐటీ కంపెనీలైనా టీసీఎస్, ఇన్ఫోసిస్ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. దీంతో టెకీల్లో భయందోళన నెలకొంది. టీసీఎస్, ఇన్ఫోసిస్ రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన సంస్థలు ఉద్యోగుల కోతలపై వెల్లడించాయి.

ఇటీవల టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రెండో త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఉద్యోగుల కోతలపై వెల్లడించింది. ఇప్పుడు అదే దారిలో మరో దిగ్గజం ఇన్ఫోసిస్ సైతం ఫలితాలు ప్రకటించింది. వరుసగా మూడో త్రైమాసికంలోనూ భారీగా ఉద్యోగులు తగ్గిపోయినట్లు తెలిపింది. సెప్టెంబర్ 30తో ముగిసిన క్వార్టర్‌లో తమ కంపెనీలో ఏకంగా 7,530 మంది ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయినట్లు ప్రకటించింది. ఇన్ఫోసిస్ భారీగా ఉద్యోగులను తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో దేశీయ ఐటీ కంపెనీల్లో ఏం జరుగుతోందనే అంశంపై ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. టీసీఎస్ లో కూడా 6 వేల పైచిలుకు ఉద్యోగులు తగ్గిపోయినట్లు వెల్లడించింది.

ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ కంపెనీల్లో లేఆఫ్స్ కొనసాగడం, కొత్త హైరింగ్ లేకపోవడంతో ఐటీ ఉద్యోగుల్లో భయం మొదలైంది. ఈ అంశంపై ఐటీ నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐటీ రంగంలో మనుగడ సాధించాలంటే కొత్త టెక్నాలజీ కోర్సులపై పట్టు పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏఐ గురించే చర్చ. ఏఐ నాలెడ్జ్ ఉన్న వారి కోసం కంపెనీలు గాలిస్తున్నాయి. ఏఐపై పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. కాబట్టి ఐటీ రంగంలో స్థిరపడాలనుకునే వారు నూతన టెక్నాలజీ కోర్సులను నేర్చుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.