iDreamPost
android-app
ios-app

AEPS Scam: కొత్త మోసం.. ఆధార్ తో మీ బ్యాంకు ఖాతాని ఖాళీ చేస్తున్నారు!

AEPS Scam: కొత్త మోసం.. ఆధార్ తో మీ బ్యాంకు ఖాతాని ఖాళీ చేస్తున్నారు!

రోజు రోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న విషయం తెలిసిందే. ప్రతి విషయాన్ని టెక్నాలజీ చాలా సులభం చేసేసింది. అలాగే బ్యాంకు మోసాలు, ప్రజల వద్ద నుంచి డబ్బు దొంగింలించే పద్దతులు కూడా టెక్నాలజీ వల్ల చాలా సులభం అవుతున్నాయి. ఇప్పుడు రోజుకే కొత్త మోసం వెలుగు చూస్తోంది. ఏదైతే మీరు భద్రత అనుకుంటున్నారో ఆ వివరాలు, ఆ టెక్నాలజీతోనే మోసగాళ్లు మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ మధ్య బాగా వినిపిస్తున్న మోసం ఆధార్ వివరాలతో డబ్బు డ్రా చేయడం. చాలామంది బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.

సాధారణంగా ప్రతి వినియోగదారుడు తమ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డుని తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉంటుంది. కొత్తగా బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలి అంటే ఆధార్ తప్పనిసరిగా ఉండాల్సిందే. సాధారణంగా మీరు బ్యాంకుకు వెళ్లి మీ ఖాతా నుంచి డబ్బు డ్రా చేయచ్చు, ఏటీఎం ద్వారా డ్రా చేయచ్చు, ఆన్ లైన్ ద్వారా కూడా మనీని ట్రాన్సఫర్ చేయచ్చు. కానీ, ఇంకో ఆప్షన్ కూడా ఉంది. అదే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్(AEPS) విధానం. ఇందులో మీరు మీ ఆధార్ నంబర్, బ్యాంక్ పేరు, ఫింగర్ ప్రింట్ ఇచ్చి డబ్బును డ్రా చేయచ్చు. అందుకోసం బిజినెస్ కరస్పాండెంట్ ని కలిసి ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయడం ద్వారా మీ ఖాతా నుంచి డబ్బుని డ్రా చేసుకోవచ్చు. ఈ విధానాన్ని రిమోట్ విలేజెస్, బ్యాంకులు దగ్గర్లోలేని గ్రామాల్లో ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ విధానాన్ని పరిచయం చేసింది.

నిజానికి ఇది చాలా సెక్యూర్డ్ మనీ విత్ డ్రా విధానం. కానీ, ఒక చిన్న పొరపాటు మీ బ్యాంకు ఖాతాని ఖాళీ చేస్తోంది. మీరు ఏదైనా కేవైసీ చేయాలి అనగానే టక్కున ఆధార్ ఇచ్చేస్తుంటారు. అలాగే అక్కడే మీ బ్యాంకు వివరాలు, మొబైల్ నంబర్ కూడా రాసేస్తుంటారు. మీరు బయట ఎక్కడన్నా మీ ఆధార్, ఫింగర్ ప్రింట్ ఇస్తున్నారు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం సమాచారం ఎవరికి ఇస్తున్నాం అనేది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. డేటా చోరీ, డేటా దుర్వినియోగం వల్ల ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చాలాచోట్ల సైబర్ క్రైమ్ విభాగంలో ఏఈపీఎస్ మోసాలు ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయి. తాజాగా కోల్ కతాలో పోలీసులు ఈ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ సిస్టమ్ ఫ్రాడ్ కి సంబంధించి రెండు అరెస్టులు చేసింది. వారు పలు మోసాలు చేసినట్లు గుర్తించింది. ఫింగర్ ప్రింట్ క్లోన్ చేసి ఈ మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఏఈపీఎస్ మోసాలు నమోదు అయ్యాయి. ఇటీవలికాలంలో ఈ విధానం ద్వారా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

ఖాతాదారుల ప్రమేయం లేకుండా వారి ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ఈ విషయంపై పోలీసులు, ఆర్థిక, టెక్ నిపుణులు ఇస్తున్న ఒకే ఒక సూచన చేస్తున్నారు. మీ ఫింగర్ ప్రింట్ డేటాను లాక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల ఈ ఏఈపీఎస్ ఫ్రాడ్ నుంచి మీ ఖాతాను కాపాడుకోగలరు. అందుకోసం ప్లే స్టోర్/యాప్ స్టోర్ నుంచి ఎంఆధార్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో బయోమెట్రిక్ లాక్ ఆప్షన్ ఉంటుంది. అది ఎనేబుల్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల మీ ఫింగర్ ప్రింట్ ని క్లోన్ చేసి ఎవరూ ట్రాన్సాక్షన్ చేయలేరు. అలాగే మీకు అవసరమైనప్పుడు బయోమెట్రిక్ ని అన్ లాక్ చేసుకోవాలి. ఈ ఏఈపీఎస్ ఫ్రాడ్ ని కట్టడి చేయాలి అంటే అందరూ ఇలా ఎం ఆధార్ ద్వారా బయోమెట్రిక్ లాక్ చేసుకోవడమే ఉత్తమం అని చెబుతున్నారు. ఈ విషయాన్ని మీ కుటుంబం, ఫ్రెండ్స్, బంధువులతో కూడా షేర్ చేసుకుని వారి బ్యాంకు ఖాతాను కూడా కాపాడుకోమని హెచ్చరించండి.