iDreamPost
android-app
ios-app

బ్యాంకు వడ్డీ రేట్లు 8.5%, 10.5% అని ఉంటాయి.. నెల వడ్డీని ఎలా లెక్కించాలి?

  • Published Jul 18, 2024 | 6:37 PM Updated Updated Jul 18, 2024 | 6:37 PM

How To Calculate Monthly Interest Rate From Annual Interest Rate:

How To Calculate Monthly Interest Rate From Annual Interest Rate:

బ్యాంకు వడ్డీ రేట్లు 8.5%, 10.5% అని ఉంటాయి.. నెల వడ్డీని ఎలా లెక్కించాలి?

పర్సనల్ లోన్, హోమ్ లోన్, కార్ లోన్, టూవీలర్ లోన్ ఇలా రకరకాల లోన్స్ ని బ్యాంకుల్లో తీసుకుంటూ ఉంటారు. బయట అప్పు చేస్తే నూటికి రూపాయి, రూపాయిన్నర, రెండు రూపాయల వడ్డీ అని చెబుతారు. దీన్ని బట్టి లక్షకు ఎంత వడ్డీ పడుతుందో ఈజీగా లెక్కించుకోవచ్చు. అయితే బ్యాంకు వడ్డీ మాత్రం ఇలా లెక్కించడానికి అవ్వదు. ఎందుకంటే బ్యాంకు వారు వార్షిక వడ్డీ చెబుతారు. అంటే ఏడాదికి 8.5 శాతం అనో.. 10.5 శాతం అనో ఇలా చెబుతుంటారు. అలాంటప్పుడు తీసుకున్న లోన్ కి ఎంత వడ్డీ పడుతుందో అనేది ఎలా లెక్కించాలో చాలా మందికి తెలియదు. అసలు, వడ్డీ కలిపి బ్యాంకు వారు ఈఎంఐలో యాడ్ చేసి ఎంత కట్టాలో చెబుతారు. కానీ వడ్డీ ఎంత పడుతుంది అనేది తెలుసుకోవాలంటే ఈ సింపుల్ లెక్కని తెలుసుకుంటే సరిపోతుంది. 

ఉదాహరణకు మీరు ఒక బ్యాంకులో 5 లక్షల లోన్ తీసుకున్నారనుకుందాం. ఐదేళ్ల టెన్యూర్ పెట్టుకున్నారు. ఈ ఐదేళ్లకు ఏడాదికి 10.5 శాతం వడ్డీ బ్యాంకు విధించింది. అంటే మీరు నెలకు 10,747 రూపాయల ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో వడ్డీ ఎంత? అసలు ఎంత? ఎంత శాతం వడ్డీ పడింది? అని తెలుసుకోవడం ఎలానో చూడండి. నెలకు 10,747 రూపాయలు అంటే 5 ఏళ్లకు అంటే 60 నెలలకు రూ. 6,44,820 రూపాయలు అవుతుంది. ఇందులోంచి అసలు 5 లక్షలు తీస్తే 1,44,820 రూపాయలు వస్తుంది. అంటే మీకు వడ్డీ ఐదేళ్ళలో 1,44,820 రూపాయలు పడినట్టు. దీన్ని 60తో భాగిస్తే నెలకు రూ. 2,413 వడ్డీ పడినట్టు. అయితే ఇది ఎంత శాతం వడ్డీ అనేది ఎలా తెలుసుకోవడం? నూటికి ఎంత పడిందో ఎలా తెలుసుకోవడం అంటే? చాలా సింపుల్.

బ్యాంకు వారు చెప్పిన వడ్డీ ఏడాదికి 10.5 శాతం కదా. దీన్ని 12తో భాగిస్తే వచ్చే విలువే నెలకు పడే వడ్డీ రేటు. 10.5% ని 12తో భాగిస్తే 0.875 వస్తుంది. దీన్ని వందతో గుణిస్తే 87.50 పైసలు అవుతుంది. ఇదే మీకు పడిన వడ్డీ. నూటికి 87.50 పైసలు పడినట్టు. అప్పుడు లక్షకు 875 రూపాయలు వడ్డీ అవుతుంది. 5 లక్షలకు నెలకు రూ. 4,375 వడ్డీ పడుతుంది. అయితే బ్యాంకు ఈఎంఐ కడుతున్న క్రమంలో నెల నెలా కట్టిన అమౌంట్ ని అసలు లోన్ మొత్తం లోంచి తీసి మిగతా అమౌంట్ కి మాత్రమే వడ్డీ లెక్కించడం వల్ల మీకు ప్రతి నెలా రూ. 4,375 వడ్డీ పడదు.

ఉదాహరణకు మీరు 5 లక్షలు లోన్ తీసుకుంటే మొదటి నెల వడ్డీ రూ. 4,375, అసలు రూ. 6,372 కలిపి మొత్తం రూ. 10,747 ఈఎంఐ కింద చెల్లిస్తారు. రెండో నెలకు వచ్చేసరికి మీకు 5 లక్షలకు వడ్డీ పడదు. అసలు 5 లక్షల్లోంచి 6,372 రూపాయలు తగ్గించి మిగతా అమౌంట్ కి వడ్డీ లెక్కిస్తారు. అందుకే మీకు వడ్డీ అనేది తగ్గుతూ వస్తుంది. మొత్తంగా మీకు నూటికి ఎంత శాతం వడ్డీ పడింది అనేది ఫైనల్ కాబట్టి దీన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. నెల నెలా ఎంత వడ్డీ పడింది అనేది మాత్రం.. లోన్ టెన్యూర్ కట్టే మొత్తం ఈఎంఐలను కూడి.. తీసుకున్న లోన్ అమౌంట్ నుంచి తీసేయగా వచ్చే అమౌంట్ ని ఎన్ని నెలలు పెట్టుకున్నారో ఆ నెలలతో భాగిస్తే సరిపోతుంది.