iDreamPost
android-app
ios-app

దసరా సమయంలో సామాన్యులకు పిడుగు దెబ్బ.. పెరిగిన నిత్యావసర ధరలు!

  • Published Sep 30, 2024 | 6:04 PM Updated Updated Sep 30, 2024 | 6:04 PM

Essentials: సామాన్యులకు గట్టి షాక్ తగిలింది. అసలే చాలీ చాలని జీతాలతో మిడిల్‌క్లాస్‌ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు నిత్యావసర ధరలు పెరిగాయి.

Essentials: సామాన్యులకు గట్టి షాక్ తగిలింది. అసలే చాలీ చాలని జీతాలతో మిడిల్‌క్లాస్‌ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు నిత్యావసర ధరలు పెరిగాయి.

దసరా సమయంలో సామాన్యులకు పిడుగు దెబ్బ.. పెరిగిన నిత్యావసర ధరలు!

దసరా పండుగ సమీపిస్తుంది. ఈ క్రమంలో సామాన్యులకు గట్టి షాక్ తగిలింది. అసలే చాలీ చాలని జీతాలతో మిడిల్‌క్లాస్‌ ప్రజలు ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు నిత్యావసర ధరలు పెరిగాయి. సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉల్లి ధరలు దారుణంగా పెరిగిపోయాయి. నెల రోజుల క్రితం కిలో రూ.25 నుంచి రూ.30 ఉండగా, ఇప్పుడు ఏకంగా కిలో రూ.70కి పెరిగింది. తెలంగాణ రైతు బజార్ల ధరల ప్రకారం ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.50 నుంచి రూ.60 వరకు ఉంది. కానీ స్థానిక దుకాణాలు మాత్రం కిలోకు రూ.70కి పైగా తీసుకుంటున్నాయి. వర్షాలకు ఉల్లి పంటలు పాడైపోయాయి. అందువల్ల నగరంలో సరఫరా కొరత కలిగింది. మలక్‌పేట్, బోయిన్‌పల్లి, మూసాపేట్, గుడిమల్కాపూర్‌తో సహా హైదరాబాద్‌లోని ప్రధాన మార్కెట్‌లకు ఉల్లి సరఫరా బాగా తగ్గింది. అందుకే పస్తుత పరిస్థితి తీవ్రంగా ఉంది.

ఇటు అల్లం, వెల్లుల్లి ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. ఏకంగా 60 రూపాయలు పెరిగాయి. గత వారంలో అల్లం కిలో 100 రూపాయలు ఉంటే ఇప్పుడు ఏకంగా 160 రూపాయలకు పెరిగింది. వెల్లుల్లి కేజీ 300 నుంచి 360కు పెరిగింది. మాల్స్‌లో అయితే ఈ ధర ఇంకా ఎక్కువగానే ఉంది. ఎండుమిర్చి కేజీ 50 రూపాయలు పెరిగింది. గత వారం 200 రూపాయలు మాత్రమే ఉన్నకేజీ ఎండుమిర్చి ఇప్పుడు ఏకంగా 250 కి పెరిగింది. మరోవైపు పప్పుల ధరలు కూడా పెరిగిపోయాయి. వారం గ్యాప్ లోనే కందిపప్పు 20రూపాయలు పెరిగింది. ఇక పెసరపప్పు ఏకంగా 30రూపాయలు పెరిగింది. ప్రస్తుతం కందిపప్పు రూ.170 ఉండగా.. పెసరపప్పు రూ.150 ఉంది.

ఇక పండుగల సీజన్‌లో ఎడిబుల్‌ ఆయిల్‌ ధరలను స్థిరంగా ఉంచాలని ఆహార శాఖ సూచించింది. అయినా కానీ లీటరుకు రూ.8-22 దాకా ధరలు పెరిగాయి. ఇక ఇప్పటికే సోయాబీన్, పొద్దుతిరుగుడు, పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని కేంద్రం పెంచింది. రైతుల లాభం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇక అప్పటికే నూనె తయారీ కంపెనీల్లో స్టాక్ ఎక్కువగా ఉంది. దీంతో నూనె కంపెనీలు ధరలను పెంచవని కేంద్రం భావించింది. అయితే ఆ కంపెనీలు ధరలని పెంచేశాయి. గత రెండు వారాల్లో ఆవనూనె సగటు ధర లీటరుకు రూ.141 నుంచి రూ.152కి పెరిగింది. సెప్టెంబర్ 12న రూ.100గా ఉన్న పామాయిల్ రూ.122 అయ్యింది.

ఇటు బియ్యం, షుగర్‌ ధరలు కూడా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయడంతో బియ్యం రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఇక పంచదార కనీస అమ్మకపు ధర పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇలా పండుగ సమయంలో సామాన్యుడికి ధరలు షాక్ ఇస్తున్నాయి. ఇక నిత్యావసర సరుకుల ధరలు పెరగడం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.