P Venkatesh
Centralized Pension Payment System: ఈపీఎస్ పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురును అందించింది. కేంద్రం నిర్ణయంతో లక్షలాది మంది పెన్షన్ దారులకు లాభం చేకూరనున్నది.
Centralized Pension Payment System: ఈపీఎస్ పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురును అందించింది. కేంద్రం నిర్ణయంతో లక్షలాది మంది పెన్షన్ దారులకు లాభం చేకూరనున్నది.
P Venkatesh
ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం ద్వారా పెన్షన్ పొందే ఈపీఎస్ పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. లక్షలాది మంది పెన్షన్ దారులకు లాభం చేకూరనున్నది. తాజాగా సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చేందుకు ఈపీఎఫ్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఈపీఎఫ్ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ మన్ సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ కొత్త పేమెంట్ సిస్టం తో పెన్షన్ దారులు దేశంలో ఎక్కడి నుంచైనా, ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ తీసుకునేందుకు వీలు కలుగుతుంది. ఈ సదుపాయం 2025 జనవరి 1 నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. దీని వల్ల 78 లక్షల మంది ఈపీఎస్ పెన్షన్ దారులకు ప్రయోజనం కలుగనుందని ఆయన వెల్లడించారు.
సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టంతో పెన్షన్ దారులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లినప్పుడు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ బదిలీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పెన్షనర్లు తమ బ్యాంక్ లేదా బ్రాంచ్ ను మార్చినప్పుడు పెన్షన్ చెల్లింపు ఆర్డర్ లను బదిలీ చేయాల్సిన అవసరం ఉండదు. రిటైర్ మెంట్ అనంతరం సొంతూళ్లకు వచ్చే పెన్షన్ దారులకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుత పెన్షన్ పంపిణీ వ్యవస్థలో సీపీపీఎస్ సమూల మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ జోనల్/ ప్రాంతీయ కార్యాలయాలు 3 బ్యాంకులతో మాత్రమే ఒప్పందాలు కలిగి ఉన్నాయి. సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టంతో పెన్షన్ పంపిణీలో ఖర్చు సైతం తగ్గుతుందని ఈపీఎఫ్ఓ భావిస్తోంది.
పెన్షన్ దారులు పెన్షన్ ప్రారంభించే సమయంలో ధృవీకరణ కోసం బ్యాంక్ బ్రాంచీని సందర్శించాల్సిన అవసరం ఉండదు. విడుదలైన వెంటనే పెన్షన్ ఖాతాలో జమ అవుతుంది. ఇక తదుపరి దశలో సీపీపీఎస్ ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థని కూడా ప్రారంభిస్తుందని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈపీఎస్ స్కీమ్ ద్వారా ఆరు రకాల పెన్షన్స్ అందుకోవచ్చు. అవి సూపర్ యాన్యుయేషన్ పెన్షన్, ముందస్తు పెన్షన్, డిసేబుల్డ్ పెన్షన్, చిల్డ్రన్ & వితంతు పెన్షన్, అనాథ పెన్షన్, నామినీ పెన్షన్ లను పొందొచ్చు.