iDreamPost
android-app
ios-app

కొత్త కారు, బైక్ కొనేవారికి కేంద్రం శుభవార్త.. ఆ స్కీమ్ మళ్లీ పొడిగింపు..?

  • Published Jul 08, 2023 | 6:10 PM Updated Updated Jul 08, 2023 | 6:10 PM
  • Published Jul 08, 2023 | 6:10 PMUpdated Jul 08, 2023 | 6:10 PM
కొత్త కారు, బైక్ కొనేవారికి కేంద్రం శుభవార్త.. ఆ స్కీమ్ మళ్లీ పొడిగింపు..?

పెరుగుతున్న ఇంధన ధరలు, కాలుష్యం కారణంగా.. ప్రభుత్వాలు, ప్రజలు ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సాహిస్తున్నాయి. వాటిపై భారీ ఎత్తున సబ్సిడీలు ఇస్తుండటంతో.. సామాన్యులు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేసే వారికి శుభవార్త చెప్పింది. ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న సబ్సిడీని మరోసారి పొడిగించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈవీల కొనుగోలు చేసే వారి కోసం కేంద్ర సర్కార్ ఫేమ్ సబ్సిడీ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో తాజాగా ఈ స్కీమ్‌ను పొడిగించే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. అదే జరిగితే ఎలక్ట్రిక్ వాహనాలు కొనే వారికి భారీ ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.

ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం.. ఫేమ్ సబ్సిడీ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ గడువు ముగిసినప్పటికీ.. ఈవీల వినియోగాన్ని పెంచడానికి ఇప్పటికే ఈ స్కీమ్‌ గడువును కేంద్రం పలుమార్లు పొడిగించింది. ప్రస్తుతం ఈ పథకం వ్యాలిడిటీ 2024, మార్చి వరకు ఉంది. దాతో కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం తర్వాత కూడా ఫేమ్‌ సబ్సిడీ స్కీమ్‌ గడువును పొడిగించాలని భావిస్తున్నట్లు ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ హనిఫ్ ఖురేషీ ప్రకారం.. ఫేమ్ స్కీమ్ గడువు.. మార్చి,  2024లో ముగుస్తుంది. కానీ, ఈ స్కీమ్‌ను మరికొన్నాళ్ల పాటు కొనసాగించాలని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు కోరుతున్నాయి. ‘‘ఐదేళ్ల క్రితం ఈవీలపై సబ్సిడీ ఇవ్వడం కోసం రూ. 10 వేల కోట్లతో ఫేమ్ స్కీమ్ తీసుకువచ్చాం. 2024, మార్చిలో ఈ స్కీమ్‌ గడువు ముగియనుంది. దాంతో ఈ పథకాన్ని ఏ విదంగా పొడిగించాలి.. ఆ ప్రయోజనాలను ఏ విధంగా అందించాలి అనే విషయంపై ఆలోచన చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు ఖురేషీ. న్యూఢిల్లీలో జరిగిన ఫిక్కీ అవార్డుల కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఖురేషి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫేమ్‌ స్కీమ్‌ వివరాలు..

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సాహించడం కోసం.. కేంద్ర ప్రభుత్వం వాటిపై సబ్సిడీ అందించేందుకు గాను ఐదేళ్ల వ్యవధితో ఫేమ్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఈ స్కీమ్‌ 2019, ఏప్రిల్ 1న అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి ఎవరైనా ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ బైక్, ఎలక్ట్రిక్ స్కూటర్, ఇతర విద్యుత్తు వాహనాలను కొనుగోలు చేసినట్లయితే డిస్కౌంట్ లభిస్తోంది. దీనిలో భాగంగా ఐదేళ్ల క్యాల వ్యవధిలో 7వేల ఎలక్ట్రిక్ బస్సులు, 5 లక్షల ఎలక్ట్రిక్ త్రివీలర్లు, 55 వేల ఎలక్ట్రిక్ కార్లు, 10 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్లకు సబ్సిడీ ప్రయోజనాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకొచ్చింది.

ఈ స్కీమ్‌ కారణంగా.. ఎలక్ట్రిక్‌ వాహనాలు అమ్మే కంపెనీలు ఈవీలను డిస్కౌంట్‌, తగ్గింపు ధరలతో విక్రయిస్తున్నాయి. అయితే, ఇటీవలే కేంద్రం.. ఎలక్ట్రిక్ టూ వీలర్లపై అందించే సబ్సిడీ మొత్తాన్ని తగ్గించింది. 40 శాతం నుంచి 15 శాతానికి సబ్సిడీలో కోత పెట్టింది. దీని వల్ల ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ బైక్ వంటి వాటి ధరలు పెరిగాయి. దీని వల్ల గత నెల నుంచి విద్యుత్తు టూవీలర్ల విక్రయాలు భారీగా పడిపోయినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కంపెనీలే మళ్లీ అమ్మకాలు పెంచుకునేందుకు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం మరోసారి ఫేమ్‌ సబ్సిడీ పథకాన్ని తీసుకువస్తే.. ప్రయోజనకరంగా ఉండనుంది.