Tirupathi Rao
Tirupathi Rao
బ్యాంకు ఖాతా అనేది ఈరోజుల్లో తప్పనిసరి అయిపోయింది. ఏ ప్రభుత్వ పథకం రావాలన్నా, ఉద్యోగులకు జీతం పడాలి అన్నా, మీ దగ్గర ఉన్న డబ్బును దాచుకోవాలి అన్నా కూడా బ్యాంకు ఖాతా తప్పకుండా ఉండాల్సిందే. గతంలో అయితే మీరు మా బ్యాంకులు డిపాజిట్ చేయండి చాలు అనేవి. ఇప్పుడు చూస్తే.. మీ డబ్బులు మీరు తీసుకోవాలి అన్నా ఛార్జెస్ కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఏటీఎంలో లిమిట్ కి మించి డబ్బు డ్రా చేసినా.. ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉంచకపోయినా.. మీ ఖాతా వివరాల కోసం ఎస్ఎంఎస్ లు పంపాలన్నా మీరు బ్యాంకులకు ఛార్జెస్ చెల్లించాలి. అలా 2018 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులు చెల్లించిన మొత్తం ఏకంగా వేల కోట్లు అని చెలిసి అందరూ నోరెళ్లబెడుతున్నారు.
బ్యాంకులు చేసే లావాదేవీలు కాకుడా కేవలం ఇలాంటి ఛార్జెస్ తోనే ఐదేళ్లలో వేలకోట్లు సంపాదించారనే విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2018 నుంచి గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వ బ్యాంకులు సహా హెచ్ డీఎఫ్ సీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ వంటి ప్రైవేటు బ్యాంకులు వసూలు చేసిన ఛార్జెస్ వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అన్ని బ్యాంకుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం ఏ కేటగిరీలో ఛార్జెస్ ఎంత వసూలు చేశారు అనే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరద్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. ముఖ్యంగా మినిమం బ్యాలెన్స్ లేదని వసూలు చేసిన ఛార్జెసే ఎక్కువగా ఉన్నాయి. కేవలం మినిమం బ్యాలెన్స్ ఛార్జీల రూపంలోనే ఏకంగా రూ.21,044.4 కోట్లు వసూలు చేశారు. నెలకు పరిమితికి మించి ఏటీఎం లావాదేవీలు చేసినందుకు రూ.8,289.3 కోట్లు వసూలు చేశారు. ఎస్ఎంఎస్ సేవల విషయంలో రూ.6,254.3 కోట్లు వసూలు చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు.
మొత్తం మీద ఈ మూడు రకాల ఛార్జెస్ రూపంలో గత ఐదేళ్లలో బ్యాంకులు అక్షరాలా రూ.35 వేల కోట్లు వసూలు చేశారు. ఈ లెక్కలు విన్న తర్వాత ఖాతాదారులు అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. రిజర్వ్ బ్యాంకు సర్క్యులర్ ప్రకారం 2015 నుంచి బ్యాంకు ఖాతాలో నిర్ణీత మొత్తం మినిమం బ్యాలెన్స్ గా లేకపోతే సహేతుకమైన ఛార్జెస్ వసూలు చేయచ్చని వెల్లడించింది. అలాగే ఎస్ఎంఎస్ అలర్ట్స్ కి సంబంధించి కూడా నిర్ణీత మొత్తం ఛార్జ్ చేసేందుకు అనుమతులు ఉన్నాయి. పరిమితికి మించి ఒక నెలలో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఏటీఎం లావాదేవీలపై కూడా ఛార్జెస్ విధిస్తారు. అయితే 2022 నవబంర్ నుంచి ఆర్బీఐ నూతన మార్గదర్శకాల్లో వాటిని సవరించింది. ప్రాంతంతో సంబంధం లేకుండా సేవింగ్స్ ఖాతాకు నెలకు 5 ఉచిత ట్రాన్సాక్షన్స్ ఇవ్వాలి. అలాగే వేరే బ్యాంకుల ఏటిఎంలలో మెట్రో నగరాల్లో 3సార్లు, నాన్- మెట్రో నగరాల్లో ఐదు ట్రాన్సాక్షన్స్ ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది.