Venkateswarlu
Venkateswarlu
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఏలూరులో జరిగిన సభలో వాలంటీర్ల వ్యవస్థ సంఘవిద్రోహశక్తి అని పవన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. దీంతో వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగుతున్నారు. పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓ మహిళా వాలంటీర్ కాళ్లు కడిగి.. వాలంటీర్ల ఔనత్యాన్ని చాటి చెప్పారు. ఆ వివరాల్లోకి వెళితే..
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళవారం మంగళగిరి నియోజక పరిధిలోని దుగ్గిరాల మండలం, ఈమనిలో జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాలంటీర్లు అందిస్తున్న సేవలను కొనియాడుతూ విశేష సేవలు అందించిన వాలంటీర్ జెట్టి రజితను ఆయన ఘనంగా సత్కరించారు. ఈమని సచివాలయం – 2 పరిధి వాలంటీర్ జెట్టి రజిత కాళ్లు కడిగి, పాదాభివందనం చేశారు. అనంతరం ఆమెకు సన్మానం కూడా చేశారు. పాటు ఆమె పాదాలను కడిగి నమస్కరించానన్నారు.
అనంతరం జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆర్కే మాట్లాడుతూ.. ‘‘ పవన్ కల్యాణ్ వాలంటీర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. వాలంటరీ వ్యవస్థ ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడుతోంది. అలాంటి వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు’’ అని అన్నారు. అయితే, వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై పవన్ ఇప్పటి వరకు స్పందించలేదు. వాలంటీర్ల నిరసనలకు ఆయన వెనక్కు తగ్గుతారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మహిళా వాలంటీర్ కాళ్లు కడగటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.