iDreamPost
android-app
ios-app

చంద్రబాబు అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన సీఎం జగన్‌!

చంద్రబాబు అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన సీఎం జగన్‌!

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. ఇక, చంద్రబాబు అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తొలిసారి స్పందించారు. చంద్రబాబుపై తనకు ఎలాంటి కక్ష లేదని అన్నారు. ఆ అరెస్ట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సోమవారం విజయవాడలో జరిగిన వైఎస్సార్‌ సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. చంద్రబాబుకు విశ్వసనీయత లేదన్నారు. టీడీపీని చూస్తే ప్రజలకు మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలు, వంచనలు గుర్తుకు వస్తాయని అన్నారు. తాను లండన్‌లో ఉన్నపుడు చంద్రబాబు అరెస్ట్‌ జరిగిందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇన్‌కంటాక్స్‌, ఈడీలు బాబు అవినీతిపై విచారణ జరిపి నోటీసులిచ్చాయని పేర్కొన్నారు.

ఆయనకు ఇన్‌కంటాక్స్‌ నేరుగా నోటీసులు ఇచ్చిందని అన్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని మోదీ అన్నారని, బాబుపై అవినీతి ఆరోపణలు కూడా చేశారని వెల్లడించారు. చంద్రబాబు ఐటీని, ఈడీని, సీబీఐని రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వకుండా పర్మిషన్‌ విత్‌ డ్రా చేశారని, అప్పుడే ఆయన అవినీతిపరుడని తేలిందని అన్నారు. అలాంటి వ్యక్తికి మద్దుతుగా ఎల్లో మీడియా.. ఎల్లో గజదొంగల ముఠా వాదనలు వినిపిస్తోందని మండిపడ్డారు.