iDreamPost
android-app
ios-app

గుండె ధైర్యంతో నిలబడి.. ఇక్కడి నుండి మళ్లీ పైకి లేస్తాం: జగన్

YS Jagan Mohan reddy- AP Elections 2024 Results: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి స్పందించారు. ప్రజల తీర్పును అంగీకరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కచ్చితంగా పేదవాళ్లకు అండగా ఉంటామని, పోరాడతామని హామీ ఇచ్చారు.

YS Jagan Mohan reddy- AP Elections 2024 Results: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి స్పందించారు. ప్రజల తీర్పును అంగీకరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కచ్చితంగా పేదవాళ్లకు అండగా ఉంటామని, పోరాడతామని హామీ ఇచ్చారు.

గుండె ధైర్యంతో నిలబడి.. ఇక్కడి నుండి మళ్లీ పైకి లేస్తాం: జగన్

2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ప్రజల తీర్పుపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ.. “ప్రజలకు మంచి చేశాం. పిల్లలు బాగుండాలి, వారి భవిష్యత్ బాగుడాలని తాపత్రయ పడుతూ అడుగులు వేశాం. కానీ, అక్కచెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు వితంతువులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా మంచి చేశాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ.. వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ.. వారి ఇంటికే తీసుకెళ్లే వ్యవస్థనే తీసుకొచ్చాం. గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఇస్తూ ఉన్న చాలీచాలని పెన్షన్ నుంచి.. ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలీదు. దాదాపుగా కోటీ 5 లక్షల మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిపిస్తూ.. వారి కష్టాలను మా కష్టాలుగా భావిస్తూ.. ఇచ్చిన అన్నీ హామీలను పాటిస్తూ.. ఆసరాకు తోడుగా ఉంటూ.. సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం. చేయూతతో సైతం కూడా తోడుగా ఉన్నాం. మరి.. ఆ కోటీ 5 లక్షల అక్కచెల్లెమ్మల ప్రేమానురాగాలు ఏమయ్యాయో తెలీదు. 26 లక్షల చేయూత అందుకుంటున్న ఆ అక్కచెల్లెమ్మల ఆప్యాయత ఏమైందో తెలీదు.

మొట్టమొదటిసారి పిల్లలకు పూర్తి ఫీజును ఇచ్చాం.చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తెచ్చాం. దాదాపుగా ఏడాదికి 12 లక్షల మందికి మంచి చేశాం. ఆ పిల్లలు, ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలీదు. దాదాపుగా 54 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా పెట్టుబడి సాయం జరిగింది మన ప్రభుత్వం వచ్చాకే. మరి.. అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ.. రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం గానీ, సీజన్ ముగియక ముందే ఇచ్చే ఇన్ పుట్ సబ్సిడీ గానీ, ఉచిత రైతు బీమా గానీ, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం చేశాం. మరి.. ఆ అరకోటి రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు. మరి.. ఇన్ని కోట్ల మందికి పేదవాడికి తోడుగా ఉంటూ.. ఆటో డ్రైవర్లు నడుపుకుంటూ ఉన్న వారికి వాహన మిత్రా, నేతన్నలకు నేతన్న మిత్ర, మత్స్యకారుల భరోసా ఇచ్చాం. ఫుట్ పాత్ మీద చిన్న వ్యాపారాలు చేసుకునే వారికోసం ఆరాటపడుతూ.. వారికి ఒక తోడుగా ఉన్నాం. రజకులు, నాయీ బ్రాహ్రమణులు చేదోడుగా.. ఇన్నిన్ని కోట్ల మందికి తోడుగా ఉన్నాం.

మేనిఫెస్టో అంటే మొదటి నుంచి ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ వచ్చాం. ఏకంగా 99 శాతం వాగ్దానాలను పూర్తి చేశాం. ఆ మేనిఫెస్టోని ఇళ్లకు తీసుకెళ్లి మీ అందిన లబ్ధికి సంబంధించి మీరే టిక్కు పెట్టండి అని నిబద్దతగా పనిచేశాం. పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం అని.. పెత్తందారులతో యుద్ధం చేసి పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. ఆ పేద పిల్లలకు అండగా , తోడుగా ఉంటూ వారి చరిత్రను మార్చాలని  కష్టపడ్డాం. గ్రామస్థాయిలోనే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి వివక్ష లేకుండా, అవినీతి లేకుండా 2.70 లక్షల కోట్ల రూపాయలు ఇంటి వద్దకే అందించగలిగాం.

ఎప్పుడూ చూడని మార్పులు తీసుకు రావడమే కాకుండా.. విద్యా రంగం, వ్యవసాయ రంగం, వైద్యరంగం ఏదైనా.. ఏ పేదవాడు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు అని మార్పులు తీసుకొస్తూ పేదవాడికి అండగా నిలబడ్డాం. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది అని చాటి చెప్పాం. సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం. మరి.. ఇన్ని కోట్లమందికి మంచి జరిగిన తర్వాత ఆ అభిమానం ఏమైందో? ఆ ఆప్యాయత ఏమైందో తెలీదు? ఎవరో మోసం చేశారు.. ఎవరో అన్యాయం చేశారు అనచ్చు. కానీ, నా దగ్గర ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్దగా నేను చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పును తీసుకుంటాం. కానీ, మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా కచ్చితంగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ గా ఈ పార్టీ చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది.

ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ.. గళం విప్పుతుంది. పేదవాడికి అండగా నిలుస్తుంది. పెద్ద పెద్ద వాళ్ల కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితిలో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కల్యాణ్ గారికి వారి గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయినా కూడా.. నా ప్రతికష్టంలో కూడా తోడుగా, అండగా నిలబడిన నా ప్రతి నాయకుడుకి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్ కు, ప్రతి ఇంటి నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపైనర్లు అయిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఏం జరిగిందో తెలీదు గానీ.. ఏమీ చేసినా ఎంత చేసినా ఇంకా… 46 శాతం ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. కచ్చితంగా ఇక్కడి నుంచి లేస్తాం. మళ్లీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి పోరాడతాం. ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదు.. పోరాటాలు చేయడం కొత్తకాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపాను. ఈ ఐదు సంవత్సరాలు తప్ప. పోరాటాలు చేశాను. రాజకీయ జీవితంలో ఎవ్వరూ చూడని కష్టాలు పడ్డా. ఇంకా అంతకన్నా ఏమైనా కష్టాలు పెట్టినా కూడా సిద్భంగా ఉన్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్.. ఎవరైతే అధికారంలోకి వచ్చారో” అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.