iDreamPost
android-app
ios-app

ఎస్సీ వర్గీకరణ అంటే ఏమిటీ? ఎందుకు?

ఎస్సీ వర్గీకరణ అంశం ఇటీవల మరోసారి తెరపైకి వచ్చింది. మంద కృష్ణ మాదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో.. 'మాదిగ విశ్వరూప మహాసభ' పేరుతో భారీ ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిధిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అంశంపై త్వరలోనే ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఎస్సీ వర్గీకరణ అంశం ఇటీవల మరోసారి తెరపైకి వచ్చింది. మంద కృష్ణ మాదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో.. 'మాదిగ విశ్వరూప మహాసభ' పేరుతో భారీ ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిధిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అంశంపై త్వరలోనే ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఎస్సీ వర్గీకరణ అంటే ఏమిటీ? ఎందుకు?

ఎస్సీ వర్గీకరణ.. ఈ ఉద్యమానికి మూడు దశాబ్దాల చరిత్ర ఉంది. షెడ్యూల్డు కులాలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా వర్గీకరించాలనే డిమాండ్‌తో ఈ ఉద్యమం కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ ఉద్యమాన్ని మంద కృష్ణ మాదిగ ముందుండి నడిపిస్తున్నారు. పట్టు వదలని విక్రమార్కుడిలా దాదాపు 30 ఏళ్లుగా మాదిగలకు న్యాయం చేయాల్సిందేనంటూ తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే, ఇటీవల ఎస్సీ వర్గీకరణ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఇటీవల మంద కృష్ణ మాదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో.. ‘మాదిగ విశ్వరూప మహాసభ’ పేరుతో భారీ ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిధిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అంశంపై త్వరలోనే ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు మాదిగలకు తప్పకుండా న్యాయం చేస్తామని కూడా ప్రధాని స్పష్టం చేశారు. ఇంతకు ఎస్సీ వర్గీకరణ అంటే ఏమిటి? దీని వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అసలు స్టోరీ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ వర్ణ వ్యవస్థలో ప్రధానంగా దళితులను నిచ్చెనమెట్ల కుల వ్యవస్థకు పరిమితం చేశారు. మరో దారుణమైన విషయం ఏంటంటే.. వీళ్ళందరూ ఊరికి దూరంగా వెలివాడల్లో నివసించేవారు. సామాజికంగా ఎన్నో అవమానాలు పడుతూ అంటరాని వారిగా బతికారు. అగ్రకులాలు వీరిని చూస్తే చీదరించునే పరిస్థితులు అప్పట్లో చాలా ఎక్కువ. దీంతో పాటు కుల వివక్షకు గురై ఎన్నో అవమానాలు పడ్డారు. నేటికీ ఇలాంటి పరిస్థితులు మనకు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాయి. ఆనాటి నుంచి ఎస్సీలు ఇలా ఎన్నో రకాలుగా అన్యాయానికి గురైనవారే. అయితే ఇక్కడ మనం మరో విషయం కూడా చెప్పుకోవాలి. అగ్రకులాలు దళితులను తక్కువ చూసినట్లు షెడ్యూల్డ్ కులాల్లో కూడా ఎక్కువ, తక్కువలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. మాలలు మాదిగలను తక్కువ చూపుతో చూడడం, మాదిగలు కూడా వారి కింది స్థాయి వారిని తక్కువ చూపుతో చూడడం అనేది ఉంది. అయితే ప్రధానంగా ఈ ఎస్సీల్లో కూడా 59 ఉప కులాలు ఉన్నాయి. అందులో మిగతా వారితో పోలిస్తే మాదిగ జనాభా సంఖ్య ఎక్కువ.

షెడ్యూల్డు ఉప కులాల జాబితాలో 59 ఉప కులాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా మాల, మాదిగల జనాభా ఎక్కువ. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే.. ఎస్సీ జనాభా 1,38,78,078. వీరిలో మాదిగలు 67,02,609 మంది ఉండగా, మాలలు 55,70,244 మంది. అంటే మాదిగల జనాభా మాలలకన్నా దాదాపు 11.3 లక్షలు ఎక్కువ. ఇలా ఎస్సీ జనాభాలో మాలల కన్న మాదిగలు అధికంగా ఉండడంతో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు.. విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో వీరికి అన్యాయం జరుగుతుందని అప్పట్లో కొందరు మేధావులు తెలుసుకున్నారు.

అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అప్పట్లో ఎన్నో ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. అందులో ప్రధానంగా చెప్పుకునే ఉద్యమం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS). దీనికి నాయకత్వం వహించారు మంద కృష్ణ మాదిగ. ఈ ఉద్యమాన్ని ఆయన 1994లో మొదలు పెట్టి మాదిగల హక్కుల కోసం పోరాటానికి నాంది పలికారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో మాదిగలకు దక్కాల్సిన వాటా దక్కాల్సిందేనంటూ పాదయాత్రలతో మాదిగలను చైతన్య పరిచారు. అర్థమయ్యేలా చెప్పాలంటే.. 70 శాతం ఉన్న మాదిగ, మాదిగ ఉపకులాలు 10 శాతం రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతుంటే, 30 శాతం ఉన్న మాలలకు 90 శాతం అందుతున్నాయి. దళితుల్లోనే ఒక వర్గం మరో వర్గ ప్రయోజనాల్ని సొంతం చేసుకుంటోందని మంద కృష్ణ మాదిగ గొంతెత్తి నినదించారు.

ఈ క్రమంలోనే ఆయన మాదిగ దండోర పేరుతో మాదిగలకు ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇంతే కాకుండా.. మాదిగ పేరు వింటేనే ఏదోలా చూసే అప్పటి రోజుల్లో.. అదే మాదిగ పేరును తమ పేరు ముందు ఉంచుకోవాలని, అలా పెట్టుకోవడంలో ఎవరూ సిగ్గు పడాల్సిన పని లేదని ఆయన ఓ గొప్ప నీతిని బోధించారు. దీంతో ఈ ఉద్యమం అప్పటి ఉమ్మడి రాష్ట్రం అంతటా విస్తరించింది. ఈ నేపధ్యంలోనే ఎస్సీ కులాలను A,B,C,D గ్రూపులుగా విభజించి ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం 15 శాతం ఉన్న రిజర్వేషన్ కోటాను పెంచాలనే డిమాండ్ తో MRPS ముందుకొచ్చింది. బీసీల్లో ఉన్న ఏబీసీడీ వర్గీకరణ మాదిరిగానే ఎస్సీ కులాలను కూడా A,B,C,D గ్రూపులుగా వర్గీకరించి అన్ని రకాలుగా నష్టపోతున్న మాదిగలకు న్యాయం చేయాలని మంద కృష్ఱ మాదిగా డిమాండ్ చేశారు. ఆయన ఈ ఒక్క ఉద్యమంతోనే సరిపెట్టలేదు. 1972 నుంచి మొదలుకుని మారిన ప్రతీ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి మాదిగ జాతి నష్టపోతున్న తీరును స్పష్టంగా అర్థమయ్యేలా వివరించి ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరారు. కానీ, ఏ ముఖ్యమంత్రి కూడా ఈ అంశంపై ముందడుగు వేయడానికి ప్రయత్నాలు చేసింది లేదు.

చేసినా.. ఆ దిశగా అడుగులు పడలేదు. ఇదిలా ఉండగా.. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో మాల సామాజిక వర్గంలోని కొందరు మేధావులు తమ గొంతు వినిపించేందుకు ముందుకు వచ్చారు. వర్గీకరణ పేరుతో ఎస్సీలను విచ్చిన్నం చేయాలనే కుట్ర జరుగుతుందని అన్నారు. ఇంతే కాకుండా మాదిగ కుల వృత్తులు చేసే వారు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా లబ్ధి పొందుతున్నారని మాల మేధావులు అన్నారు. ఇవేం పట్టించుకుని మంద కృష్ణ మాదిగ తన ఉద్యమాన్ని ఎక్కడా నీరు గార్చకుండా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రాజకీయ నేతల దృష్టికి తీసుకెళ్లారు. ఇలా తన సుధీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో ఆయన ఎక్కడా కూడా ఈ సున్నితమైన అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోలేదని కొందరు మేధావులు చెబుతున్న మాట. ఇకపోతే.. ఇటీవల హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో మంద కృష్ణ.. మాదిగ విశ్వరూప మహా సభ పేరుతో భారీ ఎత్తున ఓ మీటింగ్ ను ఏర్పాటు చేశారు.

ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని మాదిగలు పెద్ద ఎత్తున తరలిరాగా ముఖ్య అతిదిగా దేశ ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అంశంపై త్వరలోనే ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు మాదిగలకు తప్పకుండా న్యాయం చేస్తామని కూడా ప్రధాని స్పష్టం చేశారు. దీంతో ఎస్సీ వర్గీకరణ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ప్రధాని హామీతో ఎస్సీ వర్గీకరణ అంశం ఓ కొలిక్కి వచ్చినట్టేనని మాదిగలు సంతోషపడుతున్నారు. మరి నిజంగానే ప్రధాని ఎస్సీ వర్గీకరణ దిశగా అడుగులు వేస్తారా? లేక రాజకీయ లబ్దికోసమే వాడుకుంటారనే అనేది తేలాల్సి ఉంది.