Venkateswarlu
Venkateswarlu
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. మొన్నటి వరకు మండే ఎండలతో ఇబ్బందులు పడ్డ జనానికి కాస్త ఊరట లభించింది. నిన్న ఉదయం తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలో అయితే వర్షం భీభత్సం సృష్టించింది. ఈ సెప్టెంబర్ నెలలో వర్షాలు బాగా పడే అవకాశం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావారణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈరోజు నుంచి మంగళవారం వరకు తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రేపటినుంచి నుంచి ఎల్లుండి వరకు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లోతో పాటు ఆరెంజ్ అలెర్ట్‌లు జారీ చేసింది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య రాయచోటి, కడప, శ్రీసత్యసాయి పుట్టపర్తి, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో వచ్చే 24 గంటల వ్యవధిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. బయటకు పనుల నిమిత్తం వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. మరో మూడు రోజులు ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.